నా అమూల్యమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 12:24వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనం, ‘‘శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును’’ ప్రకారం నా ప్రియ స్నేహితులారా, మనము అన్ని విషయములలో జాగ్రత్త వహించాలి. ఈ వచనమును మనము తీసుకొన్నట్లయితే, ప్రతి విషయమును ఎంతో శ్రద్ధతో చేయాలి. మనం చేపట్టే ప్రతి పనిలో శ్రద్ధతో జీవించాలని పిలుపునివ్వబడినది.
ఇంకను బైబిల్‌లో 2 కొరింథీయులకు 8:7వ వచనములో చూచినట్లయితే, ‘‘మీరు ప్రతివిషయములో, అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మా యెడలనున్న ప్రేమయందును ఏలాగు అభివృద్ధి పొందుచున్నారో ఆలాగే మీరు ఈ కృపయందు కూడ అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి’’ అను వచనములో చెప్పబడిన ప్రకారం మనము ఉదయమున లేచిన వెంటనే ప్రతి విషయము జాగ్రత్తగా చేస్తున్నామా? లేదా అని మనలను మనము ఒక్కసారి పరీక్షించుకోవాలి. పడక నుండి నిద్ర లేచిన వెంటనే మనము ప్రభువు వైపు చూస్తూ, ఆ దినమంతటిలోను కూడా మనలను కాపాడమని ప్రభువునకు మనము శ్రద్ధగా మొఱ్ఱపెట్టాలి. మనం లేచిన క్షణం నుండి, మన హృదయాలను దేవుని వైపుకు తిప్పుకుందాం మరియు ఆ రోజు కొరకు కావలసిన ఆయన నడిపింపు కోసం వెదకుదాం. దీనిని మనము శ్రద్ధగా చేయుటకు, ఆయనను మన హృదయపూర్వకంగా వెదకుదాము.
అదేవిధముగా, నా ప్రియులారా, ఆ రోజంతటిలోను ప్రతి విషయములోను మనము శ్రద్ధగా పనిచేయాలి. ఇంకను బైబిల్‌లో హెబ్రీయులకు 6:11-12వ వచనములలో మనము చూచినట్లయితే, ‘‘మీరు మందులు కాక, విశ్వాసము చేతను ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనునట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము’’ అని వ్రాయబడియున్న ప్రకారం ఇందులో ప్రతి మాట ఎంతో ప్రాముఖ్యమైనది. మనము మందులముగా ఉండకుండా, దేవుని నుండి వచ్చు ప్రతి వాగ్దానమును స్వతంత్రించుకొని, ఎంతో శ్రద్ధతో పనిచేయవలెను. ఇంకను మనము ఏదైన కూడా మంచి పనులను మాత్రమే చేయాలి.
అంతేకాదు నా ప్రియులారా, మనం చేయుచున్న ప్రతి పని మన విశ్వాసాన్ని ప్రతిబింబించేలా ఉండాలి. విశ్వాసులుగా ఉన్న మనకు తీతుకు 3:8 వ వచనములో గుర్తు చేయుచున్నది. ‘‘ఈ మాట నమ్మదగినది గనుక దేవునియందు విశ్వాసముంచినవారు సత్‌క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచునట్లు నీవీసంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవియునై యున్నవి...’’ ప్రకారం మీరు ఏది చేసినను అది సత్‌క్రియగా ఉండాలి. అది ఎట్టి పరిస్థితులలో కూడా అది చెడు పనిగా ఉండకూడదు. ఇంకను ఎఫెసీయులకు 4:1-2లో చెప్పబడిన ప్రకారము, ‘‘కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినవారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెను...’’ ప్రకారం అవును, నా ప్రియులారా, సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును మనము నిత్యము కాపాడుకోవాలి. ఆలాగుననే, మీరు మీ గృహములో సమాధానమును కలిగి ఉండాలంటే, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ వహించినప్పుడు మీ గృహములలో మీకు సమాధానము కలుగుతుంది.
నా ప్రియ స్నేహితులారా, మన జీవితాలలో అనేక విషయాలలో ఎలా శ్రద్ధ కలిగి జీవించాలో మనము అనేక విషయాలను చూచియున్నాము కదా. ఇప్పుడు ఆ ఆశీర్వాదములన్నిటిని పొందుకొనునట్లుగా మనము ప్రార్థన చేయబోవుచున్నాము. కనుకనే, నేడు మీరు మీ జీవితములో శ్రద్ధగా పనిచేయలేకపోయినట్లయితే, ‘ప్రభువా, మా జీవితాలలో శ్రద్ధగా పనిచేసే కృపను దయచేయమని’ మీరు ఇప్పుడే ప్రార్థించండి. మీ జీవితంలోని ఏ విషయములోనైనను శ్రద్ధ లేకున్నట్లయితే, ఇప్పుడే దానిని ప్రభువునకు అప్పగించండి మరియు ఆయన నడిపింపు కొరకు వెదకండి. ఆలాగుననే, ప్రభువు నేడు మిమ్మును నడిపిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవిస్తాడు.
ప్రార్థన:
మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, నీ యొక్క అద్భుతమైన సన్నిధానమునకై నీకు వందనాలు. ప్రభువా, నీ బిడ్డలైన మా మొఱ్ఱలను ఆలకించుము. దేవా, మేము శ్రద్ధగా పనిచేయాలని అనుకుంటున్నాము. ఆలాగుననే, ఇప్పుడే, శ్రద్ధగా పనిచేయడానికి మాకు అటువంటి కృపను అనుగ్రహించుము. యేసయ్యా, ఉదయముననే మేము నిన్ను వెదకుటకును శ్రద్ధకలిగి జీవించునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, నీ మార్గమును అనుసరించుట యందును, మేము చేయాలని నీవు కోరుకున్న ప్రతి విషయమునందు, ప్రతి ఒక్కరము ఈ దీవెనను కలిగి ఉండడానికి మాకు సహాయము చేయుము. దేవా, మా హృదయాలను తాకుము, ప్రతి విషయమును మేము శ్రద్ధగా చేయునట్లుగా మాకు అటువంటి కృపను దయచేయుము. ప్రభువా, శ్రద్ధతో కూడిన జీవితాన్ని గడపడానికి నీ కృపను కోరుతూ మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. దేవా, మా మాటలు మరియు క్రియలతో నిన్ను ఘనపరుస్తూ, మా జీవితంలోని ప్రతి అంశంలో నమ్మకంగా మరియు జాగ్రత్తగా ఉండేందుకు మాకు సహాయం చేయుము. ప్రభువా, మేము చేసే ప్రతి పనిలో నీ మంచితనాన్ని ప్రతిబింబిస్తూ, ఐక్యతతో మరియు నీ నడిపింపు ప్రకారముగా జీవించడానికి మమ్మును బలపరచుము. దేవా, మా క్రియలలో నీ ప్రేమను ప్రసరింపజేయునట్లుగాను మరియు మా ఇంటిలో ఐక్యత మరియు సమాధానమును అనుగ్రహించుము. ప్రభువా, మా జీవితం నిన్ను మహిమపరుచునట్లుగా, సత్‌క్రియలలో అభివృద్ధి పొందునట్లుగా మమ్మును నడిపించుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.