నా అమూల్యమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 121:2వ వచనములో ఈలాగున చెప్పబడియున్నది. "యెహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు'' అన్న వచనం ప్రకారం, మన సహాయం ప్రభువు యొద్ద నుండి వస్తుంది. కాబట్టి, మీరు ఎవరికి లేదా దేనికిని భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే, ఆకాశమును మరియు భూమిని సృష్టించిన దేవుడు నేడు మీ సహాయకుడుగా ఉన్నాడు మరియు ఆయన మీకు నూతన జీవితాన్ని సృష్టిస్తాడు. " కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను'' అని ఆయన మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. కాబట్టి, ఉత్సాహంగా ఉండండి.

నా ప్రియులారా, నేడు మీరు పాత కార్యముల చేత బాధించబడుచున్నారా? మీ పాత పాపములు మిమ్మును వెంటాడుతున్నాయా? షవును పాత సమస్యలు మిమ్మును వెంటాడుతూనే ఉన్నాయి. మీ పాత బంధము మిమ్మును వెంటాడుచున్నాయా? లేక మీ గతకాలపు చర్యలు ఆ రీతిగా మిమ్మును వెంటాడుచున్నాయా? లేక చెడ్డ ప్రజల యొక్క మాటలు అవి మిమ్మును వెంటాడుచున్నాయా? భయపడకండి, "నేను సమస్తమును నూతమైనవిగా చేయుదును, ఇంకను ప్రతివాని ముఖము మీది బాష్పబిందును తుడిచివేసి, నేను సమస్తమును నూతమైనవిగా చేయుదునని'' దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఇంకను ప్రకటన 21:5లో చూచినట్లయితే, " ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను'' అని చెప్పినట్లుగానే, యేసు ప్రభువు మీ జీవితములో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాడు. మీ జీవితములో సమస్తమును నూతమైనవిగా చేయునట్లుగా, ఆయ న సమస్తమును మీ జీవితములో సరఫరా చేయగలడు. ఆయన మీ కొరకు నూతన ఆరంభమును సృజించగలడు. కేవలం ఆయన యందు మీరు నమ్మిక మాత్రము ఉంచండి.

సోనీయా చార్లెస్ అను ఒక యవ్వనస్థురాలు ఉండెను. ఆమె ఈ విధంగా తన సాక్ష్యాన్ని పంచుకున్నారు. నా వ్యక్తిగత జీవితంలో యేసు అంటే ఎవ్వరో నాకు తెలియదు. నేను కాలేజిలో చదువుకుంటున్నప్పుడు, మా తల్లిదండ్రులు ఆకస్మాత్తుగా జరిగిన ప్రమాదములో మరణించారు. అది చూచి నా గుండె బ్రద్ధలైపోయినది. నా సోదరీ, సోదరుడు నాతో కూడ నివసించారు. నా సహోదరికి వివాహమై ఇద్దరు పిల్లలు, తమ్ముడు చదువుకుంటున్నాడు. తల్లిదండ్రుల మరణము తరువాత, మాకు రావలసిన ధనము ఏ మాత్రము కూడ మాకు రాలేదు. తద్వారా, నేను నా తమ్మునికి ఫీజు కట్టలేకపోయాను. కనుకనే, నేను పనిచేయుటకు ప్రారంభిద్దాము అని అనుకున్నాను. ఉద్యోగము కొరకు ప్రయత్నించాను. నాకు ఎక్కడ కూడా ఉద్యోగము రాలేదు. నా గుండె బ్రద్ధలైపోయినది.

అటువంటి సమయములోనే ఒక ప్రాంతానికి వెళ్లుచున్నప్పుడు, యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమును నేను చూచాను. నేను లోపలికి వెళ్లాను. నా సమస్యలను ప్రార్థనా యోధులకు తెలియజేశాను. వారు నా కొరకు ప్రార్థించారు, వారు నా సమస్యల కొరకు ఎంతో భారముతో ప్రార్థించారు. యేసు నా కొరకు గొప్ప మార్పు చేయాలని భారముతో ప్రార్థించారు. నా జీవితములో సమస్తమును నూతనముగా చేయాలని ప్రార్థించారు. నా జీవితములో ఎంత గొప్ప అద్భుతము జరిగిందనగా, నాకు రావలసిన డబ్బు అంతయు తిరిగి వచ్చినది. అవును, దేవుడు మాకు సహాయము చేశాడు. ఆలాగుననే, నాకు ఉద్యోగము కూడ వచ్చినది. తద్వారా, ప్రార్థనా గోపురములో యూటర్న్ పరిచర్యలో సభ్యురాలుగా చేరాను. ప్రభువు నన్ను పరిశుద్ధాత్మ చేత నింపాడు.

ఇంకను దైవీకమైన జీవిత భాగస్వామిని దేవుడు నాకు ఇవ్వాలని నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుని యందు భయభక్తులు కలిగియున్న జీవిత భాగస్వామిని దేవుడు నాకు అనుగ్రహించి నా జీవితములో అద్భుతమును జరిగించాడు. నా జీవితములో అన్నియు కూడ స్థిరపరచబడ్డాయి. దేవుడు నా జీవితంలో సమస్తమును నూతనంగా మార్చాడు. పరలోకమందున్న దేవుడు ఎప్పటికి కూడ నన్ను ఓటమి పాలు కానివ్వలేదు. నేను నిత్యము పరలోకమందున్న దేవుని వైపు చూశాను కనుకనే, ఆయన నన్ను ఎప్పుడూ కూడ నిరాశపరచలేదు. ఇది ఎంత గొప్ప అద్భుతమైన సాక్ష్యం, కాదా? నిజంగా నా ప్రియ సోదరీ, సోదరులారా, యవ్వనబిడ్డలారా, దేవుడు మీకును కూడా ఆలాగుననే సహాయము చేస్తాడు. రండి కలిసి మనము ఆయనకు ప్రార్థన చేద్దాము. ఆలాగుననే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును కూడా ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, నీవు మాకు సహాయం చేస్తావని వాగ్దానము చేసినందుకై నీకు కృతజ్ఞతలు. ప్రభువా, దావీదు వలె, నీపై మా నమ్మకాన్ని ఉంచడానికి మరియు నీవు మా పట్ల జరిగించబోతే అద్భుతం కొరకు ఓపికగా వేచి ఉండటానికి మాకు సహాయం చేయుము. దేవా, మా జీవితములో సమస్తమును నూతనంగా చేయు దేవుడవు నీవే. ప్రభువా, మా జీవితం నుండి ప్రతి అవమానం, పాపం, శాపం మరియు ఒత్తిడిని తొలగించుము. దేవా, గత బాధలు ఏవియు కూడ మా మనస్సులో లేదా జీవితంలో నిలిచిపోకుండా ఉండునట్లుగా నీ శక్తితో సమస్తమును నూతనంగా చేసి, మా జీవితమంతా నీ మంచితనాన్ని రుచి చూచునట్లు చేయుము. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మేము నీకు నమ్మకంగా సేవ చేయడానికి మరియు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి మాకు సహాయం చేయుము. దేవా, నీ యొక్క అద్భుతమైన కనికరమును మరియు సహాయమును మాకు దయచేయుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.