నా ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలములో మీకు శుభములు తెలియజేయుటలో నాకు ఎంతో ఆనందముగా ఉన్నది. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 52:12వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనములో, ‘‘మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవురీతిగా వెళ్లరు. యెహోవా మీ ముందర నడచును ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును’’ అన్న వచనం ప్రకారం దేవుడు నేడు మీకు ముందుగా పోవుచున్నాడు. కనుకనే మీరు దేనినిమిత్తము కూడా భయపడకండి. కనుకనే, నా ప్రియులారా, ప్రభువు మీ ముందర నడుచుచున్నాడు మరియు మీ యొక్క వంకర మార్గములన్నిటిని సరాళము చేస్తాడు. ఇంకను మీరు నడవవలసిన మార్గమును ఆయన సిద్ధపరుస్తాడు.
ఒక కాపరి చిత్రమును మనము చూచినట్లయితే, కొన్నిసార్లు గొఱ్ఱెలు వెనుకటి భాగమును చూడగలము. లేక గొఱ్ఱెల మంద మధ్యలో ఉండుట మనము చూస్తాము. ఇంకను గొఱ్ఱెలన్నియు చుట్టు ఉంటాయి. కానీ, నిజ జీవితములో కాపరి ఎప్పుడు గొఱ్ఱెల ముందే నడుస్తాడు. గొఱ్ఱెలు ముందు నడుస్తూ, వాటిని నడిపిస్తాడు. ఎందుకంటే, వాటికి ఏదైన హాని ఆ మార్గములో వస్తుందేమో అని జాగ్రత్తగా చూచుకుంటాడు. అంతమాత్రమే కాదు, వేటాడే జంతువులు ఏవైన వస్తున్నాయా అని జాగ్రత్తగా చూసుకుంటూ ముందు వెళ్తుతూ ఉంటాడు. ఆ కాపరి నడుస్తున్న మార్గము గొఱ్ఱెలకు సరైనదా!కాదా! అని ముందుగా వెళ్లుతూ ఆ మార్గమును పరీక్షించుకుంటాడు. ఇంకను ఆహారము మరియు నీరు వాటికి దొరుకుతుందా? లేదా అని కూడా చూసుకుంటాడు. గొఱ్ఱెలు నడవవలసిన మార్గమును సిద్ధపరుస్తూ, వాటికి ముందుగా వెళ్లుతుంటాడు. అంతమాత్రమే కాదు, నడిపించుచున్న కాపరి వెనుకనే గొఱ్ఱెలన్నియు నడుస్తాయి. కాపరి స్వరమును ఆలకించుచూ, గొఱ్ఱెలన్నియు కూడా అతనిని వెంబడిస్తాయి.
అదేవిధంగా ప్రియ స్నేహితులారా, ప్రభువు మన ముందర నడుస్తాడు, జీవితములో వంకర మార్గములన్నిటిని సరిచేస్తాడు. మనము నడువవలసిన మార్గమున ఆయన మనలను నడిపిస్తాడు. చీకటిలో మనలను నడిపించే దేవునిగా ఉంటాడు. ఇంకను ఆయన మనలను చూచి, ‘నా బిడ్డా, నన్ను వెంబడించు ’ అని చెబుతాడు. కారణము, గొఱ్ఱెలు తన కాపరి యొక్క స్వరమును ఆలకించినట్లుగానే, బైబిల్‌లో యోహాను 10:27వ వచనములో మనము చూచినట్లయియతే, ‘‘నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. గొఱ్ఱెలు నన్ను ఎరుగును’’ ప్రకారము మనము యేసయ్య స్వరమును వింటూ ముందుకు నడవగలుగుతాము. ఆయన మనకు ముందుగా నడుస్తాడు. ఆయన మనకు వెనుకటి భాగమున కావలిగా ఉంటాడు. మనకు ఏ హాని తాకకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు.
కాబట్టి, ధైర్యము వహించండి నా ప్రియ స్నేహితులారా, మీరు ఎప్పుడు ఒంటరి వారు కాదు, ‘‘నేను ఎక్కడికి వెళ్లుచున్నానో నాకు తెలియలేదు అని అంటున్నారేమో? నాకు ముందుగా ఏమున్నదో నాకు తెలియలేదు, నా భవిష్యత్తు ఏమవుతుందో నాకు తెలియదు’’ అని మీరు అనుకుంటున్నారేమో? కానీ, నా ప్రియులారా, యేసయ్యకు అన్నియు తెలుసు. కాబట్టి, మీ జీవిత సవాళ్ల మధ్యలో కూడా మీరు ధైర్యముతో ముందుకు నడవండి. నిబ్భరము కలిగి ఉండండి, ధైర్యముగా ఉండండి. యేసయ్య, మీకు ముందుగా నడుస్తున్నాడు. ప్రార్థించి, ఆయనకు వందనాలు చెల్లించుదామా? ఆలాగున చేసి, మనము ఆయన స్వరము విన్నట్లయితే, నిశ్చయముగా, దేవుడు మీకు ముందుగా నడుస్తూ, మీ సైన్యపు వెనుకటి భాగమునకు కాపలాగ ఉంటూ, మిమ్మును ముందుకు కొనసాగునట్లుగా చేసి, నేటి వాగ్దానము ద్వారా మిమ్మును దీవిస్తాడు.
ప్రార్థన:
ప్రేమగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, మాకు ముందుగా నడుస్తూ మా మార్గములన్నిటిని సిద్ధపరుస్తున్నందుకై నీకు వందనాలు. దేవా, మా అనిశ్చితమైన పరిస్థితులలో కూడా, నీవు మాకు ముందు చీకటిగా ఉన్నదని మేము భయపడుచున్నప్పుడు, మాకు ముందుగా ఇదివరకే వెళ్లావు అందును బట్టి నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, నీవు మాకు ముందుగా వెళ్లి మాకు మార్గమును స్థిరపరుస్తూ, మాకు ముందుగా ఉన్న వంకర మార్గములన్నిటిని మరియు మాకు ముందుగా ఉన్న రాళ్లన్నిటిని తొలగించి, మా మార్గమును సరాళము చేయుము. ప్రభువా, మా కొరకు అన్నిటిని సరిచేసి, మమ్మును అనుదినము సరైన మార్గములో నడిపించుము. దేవా, మేము నీ మెల్లనైన స్వరమును వినగలిగే కృపను మాకు దయచేయుము. యేసయ్యా, అనుదినము నీ పాద సన్నిధిలో కూర్చుని మేము నీ స్వరమును వినుటకు మా చెవులను తెరువుము. దేవా, నీవు మమ్మును నడిపించే మార్గమును మేము గుర్తెరిగి, నీ మార్గములలో నడవగలిగే కృపను మాకు సహాయము చేయుము. యేసయ్యా, నీవే మమ్మును నడిపించే వెలుగై ఉన్నావు, కనుకనే, మాకు ముందుగా ఉన్న చీకటిని తొలగించి, మా జీవితాలను వెలుగు మార్గములో నడిపించుము. ప్రభువా, నీ బిడ్డలైన మమ్మును సమస్త కీడు నుండి కాపాడి, పచ్చిక గల చోట్లకు మరియు శాంతికరమైన జలముల యొద్దకు మమ్మును నడిపించుము. ప్రభువా, భయం లేదా అనిశ్చితి మమ్మును ముంచెత్తినప్పుడు, మా భవిష్యత్తును నీవు తెలుసుకుని, దానిని సురక్షితంగా ఉంచుకున్నానని మాకు గుర్తు చేయుము. దేవా, నీవు ఇప్పటికే మాకు ముందుగా వెళ్లుచున్నావని తెలుసుకుని, విశ్వాసంలో ధైర్యంగా నడవడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, చీకటి మధ్యలో కూడా నీ ప్రణాళికను విశ్వసించే ధైర్యాన్ని మాకు దయచేయుము. దేవా, మమ్మును నమ్మకంగా నడిపించే మా కాపరిగా ఉంటూ, నీ అంతులేని ప్రేమ మరియు శ్రద్ధకు మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, నీవు మాకు ముందుగా వెళ్లుచూ, మా అవసరతలన్నిటిని తీర్చుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.