నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి జెకర్యా 10:12వ వచనములో ప్రభువు ఏమని సెలవిచ్చుచున్నాడనగా, "నేను వారిని యెహోవా యందు బలశాలురగా చేయుదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు...'' అన్న వచనం ప్రకారం యెహోవా యందు మనలను బలశాలురగా చేస్తాడు. ఇదే లేఖన భాగము యెషయా 40:31వ వచనమునకు సమపోలికగా ఉన్నది. ఆ వచనము, "యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు'' అని చెప్పబడిన ప్రకారం దేవుని యందు నిరీక్షణ ఉంచిన వారందరు దేవుని యందలి బలము చేత వారందరు నడుచుదురు.
దావీదు సిక్లగు అను ప్రాంతములో ఉన్నప్పుడు, శత్రువులైన వారు సిక్లగు అను ప్రాంతము మీద దాడి చేసి, దానిని పూర్తిగా కాల్చి వేశారు. దావీదు కలిగిన సమస్తమును మరియు దావీదు యొక్క స్నేహితుల భార్యలను మరియు వారి బిడ్డలనందరిని కూడా చెరపట్టుకొని వెళ్లిపోయారు. అతడు మరియు అతని స్నేహితులందరు కూడా ఇక ఏడ్వలేనంతగా ఏడ్చియున్నారు. అట్టి నిస్పృహకు గురికావడం ద్వారా దావీదు స్నేహితులు, దావీదును రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. దావీదు తన ఆత్మలో ఎంతగానో నిరాశకు మరియు నిస్పృహకు గురియయ్యాడు. కానీ, 1 సమూయేలు 30:6వ వచనములో చూచినట్లయితే, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవానుబట్టి ధైర్యము తెచ్చుకొనెను'' అని చెప్పబడిన ప్రకారముగా, అవును, దావీదు ఎల్లప్పుడు కూడా దేవుని నామమునందు నడుచుకొనుచున్న ఒక వ్యక్తి. అందుచేతనే, కీర్తనలు 23:3 వచనములో ధైర్యముగా ఈ రీతిగా సెలవిచ్చాడు. ఆ వచనము, "నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు '' ప్రకారము, దావీదు ఎల్లవేళల, దేవుని బట్టి, తనలో తాను ధైర్యము తెచ్చుకున్నాడు. కనుకనే, నీతిమార్గములో దేవుడు దావీదును నడిపిస్తాడన్న ధైర్యముతో ముందుకు సాగిపోయాడు.
ఆలాగుననే, మా తండ్రిగారు కూడా, దేవుని యందలి బలము చేత నడుచుకొనియున్నారు. మా నాన్నగారు ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్లిపోయారు. కానీ, ఆయన నేడు మన మధ్యలో లేరు. మా తల్లిగారు చాలా అనారోగ్యమునకు గురియై, వైద్యము చేయించుకుంటూ ఉన్న సమయములో మా తండ్రిగారు ఎంతగానో నిరాశకు గురియైయ్యారు. ఆయన ఎంతగానో తన ధనమంతటిని కోల్పోయారు. ఆర్థికంగా మా తండ్రిగారు ఎంతగానో బాధపడ్డారు. అటువంటి సమయములోనే, నాకు వివాహ కార్యక్రమము గొప్పగా జరిగించబడినది. మా యొక్క బంధువులు మా తండ్రిగారిని చూచి, మీరు ఏలాగున ఈ యొక్క వివాహమును జరిగిస్తారు? అని అడిగారు. కానీ, మా తండ్రిగారు ఏమని చెప్పారనగా, 'నా దేవుడు మా కొరకు సమస్త కార్యములను సంపూర్తి చేయుటకు శ్రద్ధ వహిస్తాడు' అని ధైర్యంగా చెప్పారు. అటువంటి నిరాశ నిస్పృహ సమయములలో మా తండ్రిగారు ప్రభువులో తన్ను తాను బలపరచుకున్నారు. మా తండ్రిగారు నాకెంతో మాదిరిగా ఉండిపోయారు. కనుకనే, మా తండ్రిగారి యొక్క దేవుడు నాకును దేవుడుగా ఉన్నాడని నేడు నేను ధైర్యముగా చెప్పగలుగుచున్నాను. దేవునికే మహిమ కలుగును గాక.
అవును నా ప్రియులారా, మనము ప్రభువులో నడుస్తున్నప్పుడు, అతి కష్టమైన సమస్త కార్యములలో కూడా ఆయనే యాజమాన్యము వహించు కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంతమాత్రమే కాదు, దేవుడు మీ జీవితములో కూడా, మీ జీవితము యొక్క ఒడిదుడుకుల మరియు ఎత్తు పల్లముల మార్గములలో కూడా మీరు సాఫల్యతగా నడుచునట్లుగా చేస్తాడు. అప్పుడు మీరు కూడా, ధైర్యముగా, ఈలాగున చెప్పగలుగుతారు, "నన్ను బలపరచు క్రీస్తునందు మాత్రమే నేను సమస్తమును చేయగలను''అని చెబుతారు. అవును, ప్రియులారా, నేడు ప్రభువు మిమ్మును కూడా దేవుని బలములో నడుచునట్లుగా చేయును గాక. మీరు ఆయన నామములో పైకిని మరియు క్రిందికిని, ఇంకను ఎత్తు మరియు పల్లములలో కూడా ఆలాగున నడవగలుగుతారు. కనుకనే, ధైర్యముగా ఉండండి. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, నీ యొక్క వాక్కు ప్రకారము నీ బిడ్డలైన మమ్మును బలపరచుము. ప్రభువా, ఈ లోక ప్రజలు మమ్మును కించపరచవచ్చును. అయినప్పటికిని, నీ బిడ్డలైన మమ్మును బలపరచుము. దేవా, మా జీవితములో మాకు అసాధ్యమైనది నీవు సాధ్యపరచి, మమ్మును నీ కృపలో బలపరచుము. ప్రభువా, నీ బలమును మా మీదికి వచ్చునట్లుగా చేయుము. దేవా, మేము నీలో సమస్తమును జరిగించునట్లుగా మాకు కావలసిన సామర్థ్యమును దయచేయుము. ప్రభువా, మేము నీ సన్నిధిలో నడుచునట్లుగా మాకు కావలసిన నీ యొక్క బలమును అనుగ్రహించుము. ప్రభువా, దావీదు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నందున, మేము కూడా నీ యందు భయభక్తులు కలిగి జీవించునట్లుగా చేయుము. దేవా, బలహీనంగా మరియు నిరుత్సాహంగా ఉన్నప్పుడు మాకు బలంగా ఉన్నందుకై నీకు వందనాలు. ప్రభువా, దావీదు తన గాఢాంధకారపు లోయలో చేసినట్లుగా, నిన్ను పూర్తిగా విశ్వసించుటకు మాకు నేర్పించుము. ప్రభువా, నీ శక్తిపై నమ్మకంతో జీవిత సవాళ్లను ఎదుర్కోవడానికి మమ్మును బలపరచుము. దేవా, మేము ఓడిపోయినట్లుగా అనిపించినప్పుడు, నీవు మాకు లంగరువుగాను ఉన్నానని మాకు గుర్తు చేయుము. యేసయ్యా, మాకు సంబంధించిన ప్రతిదానిని నీవు సంపూర్తి చేస్తావని మరియు మమ్మును మరొకసారి సంతోషపరుస్తావని నమ్ముతూ, నీ నామంలో ఈ హెచ్చు తగ్గుల జీవితాన్ని నడిపించడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీ యొక్క అద్భుతమైన శక్తి ద్వారా మమ్మును అనుదినము ఆదరించి, సరాళమైన మార్గములో మమ్మును నడిపించుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.