నా ప్రశస్తమైన స్నేహితులారా, నేడు బైబిల్ నుండి 1 కొరింథీయులకు 15:57 నుండి తీసుకొనబడిన ప్రభువు వాగ్దానాన్ని మీకు తెలియజేయడం నాకు చాలా ఆనందంగా ఉన్నది, ఆ వచనము ఇలాగున చెబుతుంది, "అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక'' ప్రకారం నేడు దేవుడు మీకు జయమును అనుగ్రహిస్తాడు. కాబట్టి, మీ దృష్టిని యేసుపై నిలిపినట్లయితే, ఆయన మీతో నడుస్తాడు, మీ జీవితంలోని ప్రతి రంగంలోను ఆయన మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రభువు మీకు విజయాన్ని అనుగ్రహించినప్పుడు, అది సంపూర్ణమైనది మరియు సర్వవ్యాప్తమైనదిగా ఉంటుంది. అంతమాత్రమే కాదు, మీరు మీ శత్రువులపై విజయం సాధిస్తారు. ఈ శత్రువులు అనేక రూపాలను కలిగి ఉంటారు. కొంతమంది మీ స్వంత ఇంటి నుండి రావచ్చును. అందుకే మీకా 7:6 లో చూచినట్లయితే, " కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికిని, కోడలు అత్త మీదికిని లేచెదరు, ఎవరి ఇంటివారు వారికే విరోధులగుదురు.'' ఇంకను యోహాను 15:18వ వచనము ప్రకారము మీరు యేసును అనుసరించడం వలన ఇతరులు మిమ్మల్ని ద్వేషించవచ్చును. మరికొందరు కీర్తనలు 69:4వ వచనమును చూచినట్లయితే, "అసూయతో మిమ్మల్ని ఎటువంటి కారణం లేకుండా ఇష్టపడకపోవచ్చును. అయితే, మీరు దేవునికి విధేయత చూపినప్పుడు, ఇతరులను క్షమించినప్పుడు మరియు ఆయన పట్ల కృతజ్ఞత గల హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు మీ మీద వారికి ఉన్న అధికారం శూన్యమవుతుంది. కనుకనే, మీరు మీ శత్రువును చూచి భయపడకండి.


ఇంకను నా ప్రియులారా, మీ కష్టాలపై కూడా మీరు విజయమును సాధిస్తారు. మీ జీవిత కష్టాలు అధికంగా అనిపించినప్పటికి, మీరు యేసు యొక్క అచంచలమైన ప్రేమపై నమ్మకం ఉంచాలని ఎంచుకున్నప్పుడు, మీరు వాటికంటే ఉన్నతముగా పైకి ఎదుగుతారు. 1 యోహాను 5:4వ వచనము మనకు నమ్మకాన్ని కలిగిస్తుంది. అదేమనగా, "దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే'' అన్న వచనము ప్రకారం అపవాది మీ హృదయాన్ని భయం మరియు దుఃఖంతో నింపడానికి ప్రయత్నించవచ్చును. కానీ, దేవుని ప్రేమ మీలో నివసించినప్పుడు, ఎటువంటి శోధనలు కూడా మిమ్మల్ని ఓడించలేవు. అంతేకాదు, మీరు దయ్యాల ఆత్మలపై కూడా విజయం సాధిస్తారు. అందుకే యోహాను 10:10వ వచనములో శత్రువు ఉద్దేశ్యాన్ని బైబిల్ బయలుపరుస్తుంది, "దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు; గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.'' అవును, మన ప్రభువు శత్రువుపై మనకు విజయమునిచ్చి, సమృద్ధి జీవమును కలుగజేస్తాడు.


నా ప్రియులారా, మనపై దాడి చేయడానికి సాతాను వివిధ ఉపాయాలను ఉపయోగిస్తాడు. అపవాది మనలను శోధించి, మన విశ్వాసాన్ని బలహీనపరుస్తాడు మరియు దేవుని ప్రేమను సందేహించేలా చేయడానికి ప్రయత్నిస్తాడు. కొన్నిసార్లు, సాతాను యొక్క పన్నాగాలు కుతంత్రంగా ఉంటాయి, మన హృదయాలను లోక కోరికలు మరియు భౌతిక వస్తువుల వైపు ఆకర్షించునట్లు చేస్తుంది. వాని అంతిమ లక్ష్యం మనలను యేసు నుండి వేరుచేయడమే. కానీ, మనకొక శుభవార్త ఏమిటంటే, మన శత్రువైన అపవాది దొంగిలించడానికి, హత్యచేయడానికి మరియు నాశనం చేయడానికి ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తాడో, అంత ఎక్కువగా యేసు తన సమృద్ధియైన జీవంతో మనలను నింపుతాడు. మనలో ఉన్న ఆయన శక్తి మనము ఎదుర్కొంటున్న ప్రతి దాడిని అధిగమించడానికి మనకు సహాయపడుతుంది. కాబట్టి, నా ప్రియులారా, నేడు మీ దృష్టిని యేసు మీద ఉంచండి. మీరు ఆయన స్వభావాన్ని ప్రతిబింబించినప్పుడు, మీరు మీ శత్రువులచే కదిలించబడరు లేదా అపవాది కుట్రలచేత మోసపోరు. అందుకు బదులుగా, మీరు ప్రతి సవాలును అధిగమిస్తారు మరియు అన్ని విధాలుగా విజయం సాధిస్తారు. దేవుని ఆశీర్వాదాల వర్షం మీ కొరకు వేచి ఉన్నది. నా ప్రియ స్నేహితులారా! నేడు మీకు ఆయన ఇచ్చిన వాగ్దానాలను గట్టిగా పట్టుకొని, అందులో ధైర్యంగా ముందుకు నడవండి మరియు ఆయన అనుగ్రహించు విజయంలో జీవించండి! నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందు తండ్రీ, మా రక్షకుడవైన యేసుక్రీస్తు ద్వారా నీవు మాకు ఇచ్చిన విజయానికి మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, మా మీద ఎలాంటి శత్రువులు లేచినా, మమ్మును రక్షించి, విడిపించే నీ శక్తివంతమైన అధికారము మీద మేము నమ్మకం ఉంచుచున్నాము. దేవా, మేము నీ సన్నిధిలో విధేయతతో నడవడానికి, ఇతరులను క్షమించడానికి మరియు నీ పట్ల కృతజ్ఞతతో నిండిన హృదయాన్ని కలిగి ఉండటానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మమ్మును శోధనలు ముంచెత్తినప్పుడు, మేము నీ నుండి పుట్టానని మరియు లోకాన్ని జయిస్తానని మాకు గుర్తు చేయుము. దేవా, నీ పరిపూర్ణ ప్రేమ మా హృదయంలో నివసిస్తూ, మా భయాలను మరియు దుఃఖాన్ని పారద్రోలునట్లు చేయుము. తండ్రీ, శత్రువుల కుట్రల నుండి మమ్మును కాపాడి సంరక్షించుము. దేవా, మా హృదయం లోక కోరికల వైపు ఆకర్షితులవకుండా కాపాడుము మరియు యేసుపై మాత్రమే మా దృష్టిని కేంద్రీకరించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, దయచేసి నీ కుమారుడైన యేసుక్రీస్తు మాకు వాగ్దానం చేసిన సమృద్ధియైన జీవంతో మమ్మును నింపుము మరియు ప్రతి చీకటి సంకెళ్లను బ్రద్ధలు చేయుము. దేవా, మేము చెప్పుచున్న మరియు చేయుచున్న ప్రతిదానిలో మేము ఎల్లప్పుడూ నీ స్వభావాన్ని ప్రతిబింబించునట్లు మరియు సంపూర్ణ విజయంలో నడుచునట్లుగా చేయుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.