నా ప్రశస్తమైన స్నేహితులారా, మనం 2025వ సంవత్సరములోనికి అడుగుపెట్టుచున్నప్పుడు, దేవుని హృదయం నుండి ఈ ప్రవచనాత్మక సందేశాన్ని మీతో పంచుకోవడానికి నా హృదయం ఎంతో ఆనందంతో ఉప్పొంగుచున్నది. ఈ నూతన సంవత్సరం కొత్త క్యాలెండర్‌తో ప్రారంభం మాత్రమే కాదు. ఇది మీ జీవితంలో ఒక నూతన సమయమును సూచించుచున్నది - అది దేవుని ఆశీర్వాదాలతో పొంగిపొర్లుతున్న వర్షం కురియు కాలము. ఈ నూతన సంవత్సరం మీ కొరకు ఆయన వాగ్దానంగా బైబిల్ నుండి యెహెజ్కేలు 34:26వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "...ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును.'' ఇది మీకు నిరీక్షణను కలిగించే ఒక ప్రకటన. కనుకనే, నేడు మీ విచారము, క్షామము మరియు నిరాశ రోజులు ముగిశాయి. దానికి బదులు, సమృద్ధిగా ఆనందం, పునరుద్ధరణ మరియు ఫలవంతమైన కాలం ఆసన్నమైనది. కనుకనే, గతించినవాటిని మరచి ప్రభువునందు సంతోషించండి. ఎందుకంటే, మీ జీవితములో ప్రభువు తన వాగ్దానాలను నెరవేర్చడానికి నమ్మదగినవాడుగా ఉన్నాడు!

బైబిల్ గ్రంథంలో, వర్షం తరచుగా ఆశీర్వాదాలు, పునరుద్ధరణ మరియు సమృద్ధిని సూచించుచున్నది. కరువు కాలం తరువాత, వర్షం ఎండి పోయిన భూమిని పునరుజ్జీవింపజేస్తుంది మరియు నూతన నిరీక్షణను తీసుకొనివస్తుంది. ఇందుకు నిదర్శనముగా, 1 రాజులు 18:41వ వచనములో చక్కగా ఉదహరించబడినది, అక్కడ ప్రవక్తయైన ఏలీయా ఇలాగున ప్రకటించాడు, "పిమ్మట ఏలీయా విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయుమని అహాబుతో చెప్పెను.'' అదేవిధముగా, దేవుడు ఈ 2025వ సంవత్సరములో మీ జీవితంలోని ప్రతి ఎండిన మరియు నిర్మానుష్యమైన ప్రాంతంలో తన ఆశీర్వాదాలను కురిపిస్తానని మీ పట్ల వాగ్దానం చేయుచున్నాడు. అది మీ సంబంధాలు, ఉద్యోగము, ఆరోగ్యం లేదా ఆధ్యాత్మిక ప్రయాణం అయినా, దేవుని దీవెనల వర్షపు జల్లులు మిమ్మును తాజాగా మార్చి మరియు నూతనపరుస్తాయి. కనుకనే, మీరు ధైర్యంగా ఉండండి.

అనేకసార్లు, సమృద్ధి కరువు కాలాన్ని అనుసరిస్తుంది. ఏలీయా కాలంలో, ప్రజలు దేవుని నుండి దూరమయ్యారు. కాబట్టి, ఆ దేశము భయంకరమైన క్షామమును ఎదుర్కొనినది. కానీ, వారి అవిశ్వాసంలో కూడా, దేవుని కృప ఎన్నటికిని వారిని విడిచిపెట్టలేదు. ఏలీయా ఒకటి రెండుసార్లు కాదు, ఏడుసార్లు అచంచలమైన విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు అతని ప్రార్థనకు జవాబిచ్చాడు. ఆయన ఆకాశమును తెరిచాడు మరియు వర్షం సమృద్ధిగా కురిపించాడు. క్షామమును అంతం చేసి ఆ దేశమును పునరుద్ధరించాడు. ఆలాగుననే, ప్రియులారా, ఈ నూతన సంవత్సరం, 2025, మీ జీవితంలోని ప్రతి క్షామమునకు ముగింపు పలికే సంవత్సరం. మీరు సమాధానము, స్వస్థత లేదా పునరుద్ధరణ కొరకు ఎదురు చూస్తున్నట్లయితే, యోవేలు 2:25వ వచనములో దేవుడు మీకు చేసిన వాగ్దానం స్పష్టంగా తెలియజేయబడుచున్నది, "మీరు కడుపార తిని తృప్తిపొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతలును గొంగళి పురుగులును పసరు పురుగులును చీడ పురుగులును అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును'' అని సెలవిచ్చెను. కాబట్టి, స్నేహితులారా, నేడు మీరు ఆయనను విశ్వసించండి, ఆయన మీ దుఃఖాన్ని ఆనందంగాను, మీ కొరతను పుష్కలంగాను, మీ క్షామమును వర్ధిల్లు కాలంగాను మారుస్తాడు.

ఏలీయా యొక్క ఈ బైబిల్ సంఘటన అద్భుతాలు శ్రద్ధగల, విశ్వాసంతో నిండిన ప్రార్థనలను అనుసరించబడినవని మనకు గుర్తుచేయుచున్నది. ఏలీయా దేవుని వాగ్దానాన్ని ప్రకటించిన తర్వాత కూడా వర్షం వెంటనే రాలేదు. దేవుని వాక్యాన్ని పూర్తిగా విశ్వసిస్తూ, ఏలీయా ప్రార్థనలో మోకరిల్లినప్పుడు మాత్రమే ఆ వర్షము వచ్చింది. అహాబు భోజనము చేయబోయెను గాని, ఏలీయా కర్మెలు పర్వతము మీదికి పోయి నేలమీద పడి ముఖము మోకాళ్లమధ్య ఉంచుకొనెను (1 రాజులు 18:42). అవును, అతను పట్టుదలతోను మరియు ధృఢమైన విశ్వాసంతోను ప్రార్థించాడు. అదేవిధంగా, ఈ నూతన సంవత్సరములో మీరు ఈ సంవత్సరం హృదయపూర్వకంగా దేవుని వెదకుచున్నప్పుడు, మీ జీవితంలో ఆయన హస్తము బలంగా కదులుతుందని మీరు చూడగలరు. బైబిల్‌లో యాకోబు 5:16వ వచనములో మనకు ఈలాగున హామీ ఇస్తుంది, " మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును '' అని చెప్పబడినట్లుగానే, మీరు ధృఢమైన విశ్వాసముతో ప్రార్థించినట్లయితే, నిశ్చయముగా, మీరు కూడా మీ జీవితములో నూతన ఆశీర్వాదములను చూచెదరు.

నా ప్రియులారా, దేవుడు తన పిల్లల మొఱ్ఱలకు జవాబు ఇవ్వడంలో సంతోషిస్తాడని తెలుసుకుని, హృదయపూర్వక ప్రార్థనకు మిమ్మును మీరు సమర్పించుకొనండి. మీరు మీ హృదయాన్ని ఆయన చిత్తానికి అనుగుణంగా అమర్చినప్పుడు, ఆయన తన ఆశీర్వాదాలను నిర్ణీత సమయంలో మీ జీవితములో విడుదల చేస్తాడు. మీరు ఈ కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించుచున్నప్పుడు, విశ్వాసం మరియు నిరీక్షణతో నిండిన హృదయంతో అలాగున చేయండి. బైబిల్‌లో యెహెజ్కేలు 34:30వ వచనమును మనకు గుర్తుచేయుచున్నది, " అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు, ఇశ్రాయేలీయులైన తాము నా జనులైయున్నారనియు వారు తెలిసికొందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.'' నా ప్రియులారా, మీకు ఎలాంటి సవాళ్లు వచ్చినా, దేవుడు మీ ముందుకు వెళ్లి, మిమ్మును రక్షిస్తాడు మరియు మీ మీద తన ఆశీర్వాదపు జల్లులు కురిపిస్తాడు. ఆయన శాశ్వతమైన ప్రేమను విశ్వసించండి మరియు మీరు ఆయన శక్తివంతమైన చేతి పనిని చూచెదరు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును ఈ సంవత్సరమంతయు దీవిస్తాడు.

ప్రార్థన:
కృపాకనికరముగలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మేము 2025లో అడుగుపెడుతున్నప్పుడు, ఆశీర్వాద వర్షం కురిపిస్తానని నీ వాగ్దానానికై నీకు వందనాలు. ప్రభువా, నీవు నమ్మకమైన దేవుడవు కనుకనే, నీ దయ ఎన్నటికీ విఫలం కాదు. దేవా, మా జీవితంలోని ప్రతి ఎండిన మరియు వాడబారిన ప్రదేశంలో సమృద్ధిగా నీ యొక్క దీవెనకరమగు వర్షాన్ని కురిపించుము. ప్రభువా, మమ్మును బ్రతికించుము, మమ్మును పునరుద్ధరించండి మరియు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకొనునట్లుగా మా జీవితాలను పునరుద్ధరించుము. ప్రభువా, ఈ నూతన సంవత్సరం సమాధానము, ఆనందం మరియు ఫలభరితమైన కాలముగా ఉండునట్లుగా మార్చుము. దేవా, ఏలీయా వలె పట్టుదలతో ప్రార్థించుటకు మరియు నీ పరిపూర్ణ సమయములో విశ్వసించుటకు మా విశ్వాసాన్ని బలపరచుము. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ ద్వారా మా ఆత్మను ఉత్తేజపరచి, మా యొక్క ప్రతి సవాలులో మమ్మును నడిపించుము. తండ్రీ, మిడతలు తిన్న సంవత్సరాలకు తిరిగి చెల్లిస్తానని నీ వాగ్దానాన్ని నెరవేర్చుము. దేవా, మేము ఈ నూతన కాలములో అడుగుపెట్టుచున్నప్పుడు నీ యొక్క సన్నిధిలో మేము ఆనందించునట్లుగా మాకు గొప్ప నిరీక్షణను కలుగజేయుచూ, నూతన సంవత్సరమంతయు మమ్మును ఆశీర్వదించుమని సమస్త మహిమ, ఘనత మరియు నీకే స్తుతులు చెల్లించుచు యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.