నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కొలొస్సయులకు 3:3వ వచనమును మనము ధ్యానించుకుందాము. ఆ వచనములో, "మీ జీవము క్రీస్తుతో కూడ దేవుని యందు దాచబడియున్నది'' అని వ్రాయబడియున్నది. 'మీరు చనిపోయారు' అని చెప్పబడియున్నదని ఈ వచనమును గురించి మీరు ఆలోచిస్తుండవచ్చును. కానీ బైబిల్‌లో, గలతీయులకు 2:20 వ వచనమును చూచినట్లయితే, పౌలు ఇలా ప్రకటించుచున్నాడు, " నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను'' అని పౌలు చెప్పబడినట్లుగా వ్రాయబడియున్నది, "నాలో లోకసంబంధమైన ప్రతిదానిని, నేను చంపుకుంటాను. కొన్ని లోకపరమైన వైఖరులను, అవాంఛిత అలవాట్లను, నా గత పాపాలను, నా కోపాన్ని, నా చేదును, మరియు దేవునికి ఇష్టములేని ప్రతి కార్యమును నేను చంపుకుంటాను. నేను అన్నింటిని చంపుకున్నాను. కాబట్టి, ఇకపై జీవించువాడను నేను కాదు కానీ, క్రీస్తు నాలో జీవించుచున్నాడు'' అని పౌలు చెప్పినట్లుగా వ్రాయబడియున్నది.

నా ప్రియులారా, మన జీవితాలలో క్రీస్తు నూరుశాతము ఉండుట వలన ఎంతటి మహిమాన్వితమైన జీవితం కదా! అందుకే బైబిల్‌లో యోహాను 11:25వ వచనములో చూచినట్లయితే, యేసు ఇలాగున అంటున్నాడు, "నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకుతాడు'' అని వ్రాయబడియున్నది. అవును, మనం దేవుని విశ్వసించినప్పుడు, మనం ఎప్పటికి నిజంగా మరణించము. కానీ, మనం క్రీస్తుతో కూడా జీవిస్తాము! బైబిల్‌లో, 2 కొరింథీయులకు 2:14వ వచనమును చూచినట్లయితే, "మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము'' ప్రకారం ఆయన క్రీస్తుతో విజయోత్సవ ఊరేగింపులో మనలను చక్కగా నడిపిస్తాడు. ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితం, ఒక మర్మముగా ఉన్న జీవితం, దానికి ఆధారము దేవునిలో మాత్రమే కలదు. ఆయనలో, మనందరికి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు కలవు. అందుకే పౌలు, " నా మట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము'' అని ఫిలిప్పీయులకు 1:21వ వచనములో చెప్పబడియున్నట్లుగానే, మనము బ్రతకడం అంటే, క్రీస్తు మాత్రము అని ప్రకటించియున్నాడు. అపొస్తలుడైన పౌలు, అపొస్తలుల కార్యములు 17:28 వ వచనములో చెప్పినట్లుగానే, క్రీస్తు లేకుండా మనం ఈ లోకంలో నిజంగా జీవించలేము: "మనమాయన యందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలె మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు '' ప్రకారం ప్రభువు మిమ్మును క్రీస్తుతో బ్రతికించడానికి అనుమతిస్తాడు గాక! క్రీస్తుతో, మీరు ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్నవారుగాను మరియు విజయము పొందుకున్నవారై జీవించెదరు.

జాన్ అనే ప్రియ సహోదరుడు ఒకసారి తన జీవితం గురించి సాక్ష్యమిచ్చాడు. అతను మద్యానికి ఎంతగానో బానిసయ్యాడు, ఉదయం నుండి రాత్రి వరకు తాగుతూ ఉండేవాడు. తరచుగా, అతను మద్యం సేవించేటప్పుడు తన శరీరంపై బట్టలు ఉన్నాయో, లేదో కూడా అతనికి తెలియదు. ఇటువంటి స్థితిలో, అతని కుటుంబ సభ్యులు అతనికి వివాహము ఏర్పాటు చేశారు. అయితే, రెండు సంవత్సరాల తర్వాత, కుటుంబంలో నిరంతర తగాదాల కారణంగా, అతని భార్య అతనిని విడిచిపెట్టి వెళ్లిపోయింది. తద్వారా, అతను మద్యపానానికి బానిసయ్యాడు. చివరికి అతను మంచం పట్టాడు. ఇటువంటి నిస్పృహ స్థితిలో, ఒక సహోదరుడు అతనిని వానగరం ప్రార్థన గోపురానికి ఆహ్వానించాడు. అక్కడ, ప్రార్థనా యోధులు, అతనిని తరచుగా ప్రార్థన గోపురాన్ని సందర్శించమని అతనికి సలహాలు ఇచ్చారు. ఆలాగుననే, అతడు ప్రార్థన గోపురమును సందర్శించుటకు ప్రారంభించాడు. అక్కడ చేసిన ప్రార్థనల ద్వారా, అతను గొప్ప ఆదరణను పొందుకున్నాడు. అదే సంవత్సరం, అతని భార్య అతని వద్దకు తిరిగి వచ్చినది. ఆమె గర్భం దాల్చి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ మరుసటి సంవత్సరం, 2015వ సంవత్సరంలో, వారికి మరో బిడ్డ, ఒక ఆడపిల్ల పుట్టింది. నేడు, అతను మద్యం నుండి పూర్తిగా విడుదలను పొందుకున్నాడు! అతడు ఒక చక్కటి కుటుంబ జీవితాన్ని ఆనందముతో గడుపుచున్నాడు. అంతమాత్రమే కాదు, ఉద్యోగమును సంపాదించుకున్నాడు మరియు అతడు ఒక సొంత వ్యాపారాన్ని కూడా నడుపుతున్నాడు. మనకు ఎంత మంచి దేవుడుగా ఉన్నాడు, కాదా!

నా ప్రియులారా, మనం యేసు దగ్గరకు వచ్చినప్పుడు, మన జీవితాలు రూపాంతరం చెందుతాయి. ప్రభువు మనలను తనలో దాచుకుని, ఉన్నత శిఖరాలకు హెచ్చించాడు. అవును, దేవుడు మన దాగు స్థలం. ఆయన మనలను విమోచన గానములతో ఆవరించియున్నాడు. కనుకనే, నా ప్రియులారా, నేడు మీరు కూడా మీ జీవితంలో గొప్ప మార్పును చూచెదరు! నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
సర్వశక్తిమంతుడైన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, క్రీస్తుయేసులో దాచబడియున్న మా జీవము ఒక అమూల్యమైన బహుమతిగా ఇచ్చినందుకై మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, మాలో నీకు ఆయాసరకమైన ప్రతి కార్యాన్ని చంపడానికి మరియు నీ కొరకు పరిపూర్ణమైన జీవితమును జీవించడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీవు ఎల్లప్పుడు మాలో రాజ్యం చేయునట్లుగా మమ్మును నీ సన్నిధితో నింపుము. దేవా, మా హృదయం నీ యొక్క ప్రేమ, సమాధానము మరియు నిన్ను గుర్తెరగడం వలన కలుగుచున్న ఆనందంతో పొంగిపొర్లునట్లుగా చేయుము. ప్రభువా, మమ్మును క్రీస్తు యేసునందు విజయోత్సవ ఊరేగింపుము. దేవా, మమ్మును ఆధ్యాత్మిక రీతిగా ఉన్నత శిఖరములకు హెచ్చించుము. ప్రభువా, క్రీస్తుయేసులో ప్రత్యక్షమగు సమస్తవిధములైన పరలోక సంపదలతో మమ్మును ఆశీర్వదించుము. దేవా, మా జీవితం నీ మహిమ కొరకు జీవముగల సాక్ష్యంగా ఉండునట్లుగా చేయుము. ప్రభువా, మమ్మును నీలో దాచబడియుండునట్లుగా, మేము నీలో సురక్షితంగా ఉండునట్లుగాను మరియు విమోచన గానములతో మమ్మును ఆవరించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.