నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు వాగ్దానముగా బైబిల్ నుండి మత్తయి 2:10వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, " వారు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి, తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.'' అవును, నక్షత్రము చూచి వచ్చిన జ్ఞానులను గురించి మనము ఇక్కడ చదువుతాము. వారు అత్యానందభరితులైయ్యారు. ఒక నక్షత్రమును చూచి వారు ఎందుకు ఆనందముతో నిండుకున్నారు? మెస్సీయ రాకకు నక్షత్రము ఒక సూచనయై ఉంటున్నది. ఆయన ఇక్కడ ఉన్నాడు అని చెప్పుకొనుట కొరకు మాత్రమే. వారు మెస్సీయ గురించి ఎందుకు వేచియున్నారు? ఇశ్రాయేలు ప్రజలు వేర్వేరు రాజ్యముల క్రింద అనేక సంవత్సరములు బంధీలుగా ఉన్నారు. వారు హింసింపబడుతూ, బానిసలుగా ఉన్నారు. మీ బంధకముల నుండి విడిపించే ఒక రక్షకుడు వస్తాడు అని యెషయా ప్రవక్త ద్వారా ఒక ప్రవచనమును ప్రభువు ఇచ్చియున్నాడు.
మెస్సీయ రాక కొరకు ఇశ్రాయేలీయులు అనేక సంవత్సరాలు వేచియున్నారు. మెస్సీయ వచ్చియున్నాడు అనడానికి, నక్షత్రము ఒక సూచనయై యున్నది. కాబట్టి, వారు అత్యానందభరితులైయ్యారు. మమ్మును విమోచించడానికి ఒక వ్యక్తి వచ్చియున్నాడు, మమ్మును విడిపించడానికి, మమ్మును స్వతంత్రులనుగా చేయడానికొరకై ఒక రక్షకుడు వచ్చి యున్నాడని వారు అత్యానందాన్ని కలిగియున్నారు. అవును, నా ప్రియులారా, మీరు యేసయ్యను మీ సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నట్లయితే, మీలో ఆ నక్షత్రము నివసించుచూ, ఎల్లప్పుడు మీలో ప్రకాశిస్తుంది. ఇంకను మీ చుట్టు ఉన్న ప్రజల యెదుట ప్రకాశించే ఒక నక్షత్రము వలె ప్రభువు మిమ్మును వాడుకుంటాడు. మరియు పాపము అనే బంధకములలో చిక్కుకున్న వారి యెదుట, నిరాశలో ఉన్న వారి యెదుట, అంధకారములో ఉన్న వారి యెదుట, నిరీక్షణ లేని వారి యెదుట ప్రభువు మిమ్మును ప్రకాశింపజేస్తాడు. మెస్సీయను జీవముగల దేవుడని మీరు చూపించునట్లుగా, ఆయన వారి రోగముల నుండి మరియు భారముల నుండి, పాపముల నుండి విడిపించి, దేవుని మార్గము వైపునకు నడిపిస్తాడు. కనుకనే మీరే ఆ నక్షత్రమై ఉండబోవుచున్నారు. నిజ దేవుని యొద్దకు వారిని నడిపించబోవుచున్నాడు.
అవును నా ప్రియ స్నేహితులారా, యేసే మన నిరీక్షణయై మరియు మనకు విమోచకుడై యున్నాడు. అవును, నేటి నుండి ఆయన యొద్దకు మీరు అనేకులను నక్షత్రమువలె నడిపించబోవుచున్నారు. ఈ క్రిస్మస్ కాలములో, మీ చుట్టు ఉన్న వారి యెదుట మీరు ప్రకాశించాలని ఒక నిర్ణయము తీసుకొనండి. చీకటిలో ప్రకాశించే నక్షత్రమువలె ప్రతి ఒక్కరు చూడగలిగే అంత ప్రకాశవంతముగా మరియు యేసు వైపు వారిని నడిపించే విధంగా, మిమ్మును ప్రకాశింపజేస్తాడు. యేసే ప్రకాశవంతమైన నక్షత్రమై యున్నాడు. చీకటిలో మనకు నిరీక్షణ కలిగించే దేవుడై యున్నాడు. ఈ క్రిస్మస్ కాలములో ఈ గొప్ప కార్యము కొరకై మనలను మనము ప్రతిష్టించుకుందామా? ఆలాగైతే, నేడు మీరు కూడా ఈ లోకములో ప్రకాశించే నక్షత్రముగా ఉండాలనగా, మిమ్మును ప్రకాశింపజేయుటకు వచ్చి, మెస్సీయకు మీరు మీ జీవితాలను సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, చీకటిలో ఉన్న మీ జీవితాలను వెలుగులోనికి నడిపించే నక్షత్రముగా ఆయన మిమ్మును మారుస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును ఇతరులకు వెలుగుగా ఉండునట్లుగా ప్రకాశింపజేయును గాక.
ప్రార్థన:
మహిమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీవే మా యొక్క అతికాంతవంతమైన నక్షత్రమై ఉన్నందుకై నీకు వందనాలు. దేవా, మాకు నిరీక్షణను ఇచ్చువాడవు నీవే, మరియు మా యొక్క పాపముల నుండి, మా యొక్క ప్రతి రోగముల నుండి మమ్మును విడిపించే దేవుడవు నీవే, మా జీవితానికి కారణము నీవే. కనుకనే, దేవా, ఈ క్రిస్మస్ ఆనందానికి కారణము నీవే ప్రజలను మీ యొద్దకు నడిపించే నక్షత్రము నీవే. ప్రభువా, ప్రజలను నీ యొద్దకు నడిపించే నక్షత్రము వలె మేము ఉండడానికి మాకు సహాయము దయచేయుము. యేసయ్యా, నీ మంచితనమును మరియు నీ పరిశుద్ధతను మేము ఇతరులకు ప్రతిబింబింపజేయు కృపను మాకు అనుగ్రహించుము. దేవా, నీవు ప్రజలకు ఏమి చేయాలనుకుంటున్నావో, మేము దానిని అనుకరించే కృపను మాకు దయచేయుము. యేసయ్యా, ఈ చీకటి ప్రపంచములో మా వెలుగును ప్రకాశింపజేయుము. దేవా, మా ద్వారా ప్రజలు రక్షింపబడునట్లు చేయుము. ప్రభువా, నీవు మా ద్వారా రక్షింపబడిన ప్రజలలోనికి ప్రవేశించి, వారి చీకటి జీవితాలను వెలుగుగా మార్చుము. యేసయ్యా, ఈ క్రిస్మస్ కాలములో ఈ గొప్ప పనికై మమ్మును మేము నీకు ప్రతిష్టించుకొనుచున్నాము. దేవా, నీ రాజ్యవ్యాప్తి కొరకు మమ్మును వాడుకొనుము. ప్రభువా, ఇతరులను నీ ప్రేమ వైపు నడిపించునట్లుగాను, నీ ఆనందం మరియు ఉద్దేశ్యంతో మమ్మును నింపుము మరియు చీకటి మరియు నిరాశతో బాధపడుతున్న వారికి నిరీక్షణను తీసుకురావడానికి ప్రభువా, మమ్మును ఉపయోగించుకొనుము. ఈ క్రిస్మస్ కాలములో మా మాటలు మరియు క్రియలు నీ ప్రేమ మరియు సత్యాన్ని ప్రతిబింబించునట్లు చేయుము. దేవా, నీ సమాధానము మరియు విమోచన పాత్రగా ఇతరులకు సేవ చేస్తూ నీకు లోబడి నడుచుకొనుటకు మాకు నేర్పుము. ప్రభువా, చీకటిలో ప్రకాశించే నక్షత్రమువలె మమ్మును చేయుమని యేసుక్రీస్తు మహిమగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.