నా ప్రియమైన వారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 థెస్సలొనీకయులకు 5:23వ వచనములో ఈలాగున సెలవిచ్చుచున్నది, " సమాధానకర్తయ గు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందా రహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక'' ప్రకారం ఈ సందేశమును చదువుచున్న మనలో అనేకమందికి ఇటువంటి ఆకాంక్షనే కలిగియున్నారు కదా! మనము ఈ దుష్ట లోకములో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగోరుచున్నాము. కనుకనే, మనము పరిశుద్ధముగా జీవించాలి.

అదేవిధముగా, 1 థెస్సలొనీకయులకు 4:7లో చూచినట్లయితే, " పరిశుద్ధు లగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు'' అన్న వచనం ప్రకారం, మనము పరిశుద్ధులుగా ఉండుట కొరకే ఆయన మనలను పిలిచియున్నాడు. అందుకే దేవుడు ఈలాగున 1 పేతురు 1:16లో సెలవిచ్చుచున్నాడు, " నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది.'' అవును, దేవుడు మనలను తన స్వరూపములోనికి రూపాంతరపరచాలని మన పట్ల కోరుచున్నాడు. మనము కూడా కేవలము ఆయన వలె పరిశుద్ధులము కావలెనంటే, మనలను మనము స్వయంగా పరిశుద్ధపరచుకొనలేము. ఇంకను హెబ్రీయులకు 7:25 వ వచనములో చూచినట్లయితే, "ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు'' ప్రకారం మనము పరిపూర్ణమైన లోపరహితమైన వ్యక్తులము కావడము కొరకు దేవుడే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు. యేసు మనము పరిశుద్ధముగా ఉండవలెనని మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. యేసు ఏ రీతిగా ప్రార్థిస్తాడు? యోహాను 17:17వ వచనములో చూచినట్లయితే, " సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము'' ప్రకారం సత్యమునందు వారిని పరిశుద్ధపరచుము అని ప్రార్థించియున్నాడు. దేవుని యొక్క వాక్యము ద్వారా మనము పరిశుద్ధపరచబడుచున్నాము. యోహాను 17:19వ వచనములో చూచినట్లయితే, "వారును సత్యమందు ప్రతిష్ఠచేయబడునట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసికొనుచున్నా ను'' ప్రకారం మన నిమిత్తము ప్రార్థన చేయుటకును మరియు మన నిమిత్తము తనను తాను పరిశుద్ధపరచుకొనుట లేక ప్రతిష్ఠించుకొనుటను జరిగించే ఎంత ప్రియమైన యేసయ్యను కలిగియున్నాము. యేసు సిలువలో చేసిన త్యాగము ద్వారా మనము పరిశుద్ధులమై యున్నాము.

నా ప్రియులారా, పరిశుద్ధత అనేది పరిశుద్ధాత్మ యొక్క దేవుని కార్యమై ఉన్నది. అందుకే 2 కొరింథీయులకు 3:3వ వచనములో చూచినట్లయితే, "రాతి పలక మీదగాని సిరాతోగాని వ్రాయబడక, మెత్తని హృదయములు అను పలకల మీద జీవముగల దేవుని ఆత్మతో, మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై యున్నారని మీరు తేటపరచబడుచున్నారు'' అని చెప్పబడిన ప్రకారం "పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము పరిశుద్ధులముగా చేయబడుచున్నాము. ఇంకను 1 కొరింథీయులకు 6:11వ వచనమును చూచినట్లయితే, పరిశుద్ధుపరచు ప్రక్రియ పరిశుద్ధాత్మ ద్వారా జరిగించబడుచున్నది. ఆలాగుననే, 2 థెస్సలొనీకయులకు 3:3లో చూచినట్లయితే, " అయితే ప్రభువు నమ్మదగినవాడు; ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును'' ప్రకారం ఆయన మనలను పరిశుద్ధపరచిన తర్వాత, ఆయన మనలను స్థిరపరచును. ఆయన దుష్టుని నుండి మనలను భద్రపరచి, కాపాడును. 'పరిశుద్ధత' అనేది ఒక ప్రక్రియయై ఉన్నది. ఒక తోటమాలి వలె దేవుడు మన జీవితములో సమస్తమును జరిగించువాడై యున్నాడు. దేవుడు మన జీవితములో అత్యంత శ్రేష్టమైన తోటమాలి. తోటమాలి ఒక మొక్క యొక్క శక్తిని పాడు చేసే అనవసరమైన ఆ యొక్క కొమ్మల వంటి వాటన్నిటిని కూడా పూర్తిగా కత్తిరించి వేయుచున్నాడు. అదే రీతిగా మీ జీవితములో ఉన్న శక్తిని పీల్చి వేయుచున్న కొన్ని భాగములను ఆయన పూర్తిగా తీసివేస్తాడు. కొన్ని ఫర్యాయములు ఈ ప్రక్రియ గాయములను కలిగిస్తుంది. కానీ, ముగింపునకు వచ్చినప్పుడు, అది మీ యొక్క ప్రయోజనము నిమిత్తమే జరిగి ఉంటుంది. మనము పరిపూర్ణముగా పరిశుద్ధపరచబడునట్లుగా ప్రభువు ఈ రీతిగా మనలను చేస్తాడు. ఆయన మనలను పరిపూర్ణమైన వారినిగా ఉండాలని కోరుచున్నాడు. కనుకనే, మీరు ఆనందించండి.

అందుచేతనే,యోబు 23:10లో చూచినప్పుడు, యోబు ఈ ప్రక్రియను అర్థం చేసుకున్నాడు. యోబు 23:10వ వచనములో ఏమని చెప్పబడియున్నదనగా, " నేను నడచు మార్గము ఆయనకు తెలియును ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలె కనబడుదును'' ప్రకారం సువర్ణము పవిత్రమైనదిగా ఉండునట్లుగా ఎన్నో ప్రక్రియల ద్వారా అది ప్రయాణించవలసి ఉంటున్నది. ఆలాగుననే, నా ప్రియ స్నేహితులారా, మీరు కూడా పవిత్రముగా ఉండాలంటే, మీరు కూడా ఇటువంటి ప్రక్రియల గుండా వెళ్లవలసి ఉంటుంది. కానీ, ముగింపునకు వచ్చినప్పుడు, మీరు కూడా సువర్ణము వలె చేయవలసి వుంటుంది. ఆలాగున దేవుడు మనలను శుద్ధి చేస్తాడు, తద్వారా మనం నిందారహితంగా ఆయన యెదుట నిలువబడగలము. దేవుడు మీ ఆత్మను మాత్రమేకాకుండా, ప్రాణమును, జీవమును, పరిపూర్ణంగా చేయగలడు. కాబట్టి, ప్రభువు ఇప్పుడు కూడా మిమ్మును పరిశుద్ధులనుగా చేయును గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మాకు ప్రియమైన పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. మా మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించుము. ప్రియమైన ప్రభువా, నీ రూపాంతరపరచు కృపకు మా హృదయం తెరవబడి మేము నీ యొద్దకు వచ్చునట్లు చేయుము. మేము నీ రాకడలో నిందారహితముగా నిలబడగలిగేలా మా ఆత్మ, జీవమును మరియు శరీరాన్ని పవిత్రం చేయుము. దేవా, మమ్మును నీ యొక్క సత్యంలో పవిత్రం చేసే నీ అమూల్యమైన వాక్యానికి మరియు సిలువపై తన్ను తాను అర్పించుకున్న మా రక్షకుడైన యేసు కొరకు మరియు ఇప్పటికి మా పవిత్రత కొరకు నీవు విజ్ఞాపనము చేయుచున్నందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ శక్తితో, నీతో మా నడకకు ఆటంకం కలిగించే వాటన్నిటినీ తొలగించి, సువర్ణము వలె మమ్మును శుద్ధి చేయమని కోరుచున్నాము. దేవా, ఈ ప్రక్రియలో మమ్మును బలపరచుము మరియు నీ మార్గాలలో మమ్మును స్థిరపరచుము. దయచేసి దుష్టుని నుండి మమ్మును కాపాడి సంరక్షించి మరియు నీ పవిత్రతను ప్రతిబింబించేలా మరియు ప్రతిరోజు నీ వలె మారడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మేము నిన్ను మా పరిపూర్ణమైన తోటమాలిగా నమ్ముచున్నాము. దేవా, మమ్మును సంపూర్ణంగా మార్చడానికి విశ్రాంతిలేకుండా మేము శ్రమించుటకు మాకు అటువంటి కృపను దయచేయుము. యేసయ్యా, నీ పవిత్రమైన ప్రేమకు లోబడునట్లుగా మాకు నీ అనుగ్రహమును దయచేయుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.