నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు మీకు శుద్ధ హృదయమును మరియు ఆయన మీకు స్థిరమైన ఆత్మను అనుగ్రహించుచున్నాడు. కాబట్టి, ఈ రోజు, మీరు పరిశుద్ధమైన హృదయం కొరకు మరియు మీరు దేవుని చూడటానికి మిమ్మును అనుమతించే పవిత్రత కొరకు ఎదురు చూస్తుండవచ్చును. పవిత్రతను మీరు కలిగియున్నట్లయితే, మీరు దేవుని చూచెదరు. ఆయన సన్నిధిని అనుభూతి చెందడానికి ఎంతగానో వేచియున్నారేమో? ఆయన చిత్తము ఎరుగునిమిత్తము ఎదురు చూస్తున్నారేమో? అందుకొరకై పవిత్రమైన హృదయము మీకు కావాలి. దేవుడు మీ హృదయమును పవిత్రముగా ఉంచుతాడు. ఒకవైపు ఏమో, లోకసంబంధమైన శోధనలు, శరీరాశ, నేత్రాశ, ఆలాగుననే, జీవపు డంబము, మన హృదయములో ఉన్న పవిత్రతను నాశనము చేస్తాయి. మరొక వైపున విచారములు, భయములు, ఆలాగే బాధ, గాయములు, మన హృదయానికి సంబంధించిన పవిత్రతకు నాశనమును తీసుకొని వస్తుంటాయి. ఇంకను శోధనలు వస్తుంటాయి. కానీ, అటువంటి వాటన్నిటిని తొలగించి, ఈ రోజున దేవుడు మీకు పవిత్ర హృదయమును ఇవ్వాలని మీ పట్ల కోరుచున్నాడు. 'నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని' ఆయన సెలవిచ్చుచున్నాడు. కనుకనే, ఈ లోకములో మీరు పరిశుద్ధులై ఉండాలని దేవుడు మీ పట్ల కోరుచున్నాడు. కాబట్టి, మీరు దేనికిని చింతించకండి.

నా ప్రియులారా, మనము ఇట్టి పవిత్రత కొరకై దేవునికి మొఱ్ఱపెడతాము. అదే సమయములో, 'మీలో నూతనమైన ఆత్మను పుట్టించెదనని' దేవుడు మీకు సెలవిచ్చుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 51:10వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనములో చూచినట్లయితే, "దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము.'' అవును, అనేక ఫర్యాయములు మన ఆత్మ చంచలత్వముతో నిండి ఉంటుంది, 'నేను ఇది చేయవచ్చునా? నేను ఈ వ్యక్తిని సంతోషపరచకపోయినట్లయితే, అతడు నాకు విరుద్ధముగా మరలుకుంటాడేమో, ఒక వ్యక్తిని సంతృప్తిపరచడానికి ఆమెకు గానీ, అతనికి గానీ, ఈలాగున చేయకపోయినట్లయితే, వారు నాకు సహాయము చేయరేమో? లేక, నేను ఈలాగున చేయకపోయినట్లయితే, నేను సాఫల్యతను పొందలేనేమో?' అని అటువంటి విధానములో దేవుని యందు సరైన మార్గమును మనము కోల్పోతుంటాము. కానీ, నేడు దేవుడు మనకు స్థిరమైన మనస్సును అనుగ్రహించును. ఇంకను ఆయన యందు నమ్మిక యుంచడానికి మరియు యేసు నన్ను ప్రేమించుచున్నాడు అనుకోవడానికి మనకు స్థిరమైన మనస్సును అనుగ్రహిస్తాడు. ఇంకను, 'నేను లేఖనముల ప్రకారము సరైన కార్యమును జరిగించెదను, నేను దేవుని కొరకు వేచి ఉండెదను, ' అని ఇంకను మీరు ఆలాగున చేయుచుండగా, ఇట్టి స్థిరమైన మనస్సును ద్వారా మీరు గొప్ప సఫలతను చూచెదరు. కనుకనే, భయపడకండి. మీరు కలిగియున్న పవిత్రత ద్వారా దేవుని చూచెదరు. అంతమాత్రమే కాదు, మీరు స్థిరమైన ఆత్మను కలిగియుంటూ, ఈ లోకములో బలవంతులుగా ఉండెదరు. ప్రభువే మిమ్మును నడిపించును. మీరు కలిగియున్న సమస్తము కూడా వర్థిల్లును.

ఇక్కడ ఒక అద్భుతమైన సాక్ష్యము ఉన్నది. అరుళ్‌మొళి మరియు ఆమె యొక్క భర్త ముత్తమిళ్ సెల్వన్ వారు పొందుకున్న అద్భుతమైన సాక్ష్యమును ఈలాగున పంచుకున్నారు. వారు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. ఆమె భర్త మద్యపానమునకు బానిసయ్యాడు. కుటుంబములో శాంతి లేదు. ఆర్థికపరమైన కష్టములు మరియు పోరాటాల వెంబడి పోరాటములు, తిరుచ్చిలో ఉన్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమునకు ఆమె వెళ్తుండేవారు. ప్రజలు అక్కడ ఆమెతో కలిసి ప్రార్థించేవారు. యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురములో చేయబడిన ప్రార్థన ద్వారా ఒక సహోదరి యొక్క భర్త మద్యపాన వ్యసనము నుండి విడిపించబడిన సాక్ష్యమును ఆమె ఆలకించెను. అది ఆమె హృదయమును బలపరచినది. ఆమె తన కోసమే అని అట్టి అద్భుతమును స్వీకరించెను. కానీ, ఆమె యింటికి వెళ్లినప్పుడు, ఆమె భర్త కామెర్ల వ్యాధి చేత రోగ గ్రస్థుడయ్యాడు. చాలా ప్రమాదకరముగా ఉన్నది. సంబంధము లేని మాటలను మాట్లాడుచుండెను. వైద్యులైతే, మేము సహాయము చేయలేము అని విడిచిపెట్టారు. అటువంటి సమయములో ఆమె ప్రార్థనా గోపురము వైపునకు పరుగెత్తుకొని వచ్చారు. ప్రార్థనా యోధులు ఆమె కొరకు ఎంతో భారముతో ప్రార్థించారు, 'ప్రభువా, ఈ సహోదరునికి రెండవ అవకాశము ఇవ్వమని మొఱ్ఱపెట్టారు. దేవుడు జోక్యము చేసుకొని, అతని పట్ల అద్భుతకార్యమును నిర్వహించాడు. కామెర్ల వ్యాధి నుండి రక్షించాడు. కామెర్ల వ్యాధి నుండి అతడు బయటకు వచ్చినప్పుడు మధ్యపానము వ్యసనము లేకుండా బయటకు వచ్చాడు.

నా ప్రియమైనవారలారా, నేడు దేవుడు మీకును మరియు మీ కుటుంబ సభ్యులకును స్థిరమైన ఆత్మను మరియు శుద్ధమైన హృదయమును అనుగ్రహించును. ఆయన మీ కళ్ళు తెరుచును గాక, మీతో నడిచి, యేసు నామములో మిమ్మును ఒక ప్రత్యేకమైన మరియు చక్కటి మార్గంలో నడిపించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా హృదయంలో పరిశుద్ధత కొరకు ఎదురు చూస్తూ, మేము నీ సన్నిధికి వచ్చుచున్నాము. ప్రభువా, మమ్మును నీ సన్నిధి నుండి వేరు చేయుచున్న ప్రతిదాని నుండి మమ్మును శుభ్రపరచుము. యేసయ్యా, మాలో స్థిరమైన ఆత్మను పునరుద్ధరించు ము, తద్వారా మేము స్థిరమైన ఆత్మతో నిన్ను విశ్వసించునట్లు చేయుము. ప్రభువా, ఈ లోక శోధనల నుండి మా హృదయాన్ని కాపాడుము మరియు పవిత్రతలో మమ్మును బలపరచుము. దేవా, మాలో ఉన్న సందేహాలు మరియు భయాలు మమ్మును దారి తప్పింపజేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా మేము స్థిరంగా నీలో నిలబడడానికి సహాయం చేయుము. యేసయ్యా, నీ ప్రేమ, జ్ఞానం మరియు శాంతితో మమ్మును నింపుము. ఇంకను మేము నీతిలో నడవడానికి మమ్మును సరైన మార్గములో నడిపించుము. ప్రభువా, నేడు మా ప్రియులైన వారిని కూడా అదే పవిత్రత మరియు స్థిరమైన ఆత్మతో ఆశీర్వదించుము. దేవా, మమ్మును నీ పరిపూర్ణమైన చిత్తంలోనికి నడిపించుము మరియు మా జీవితం నీ మహిమను ప్రతిబింబింపజేయునట్లు చేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.