నా ప్రియ స్నేహితులారా, నేటి దినమున దేవుని వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 126:5వ వచనము తీసుకొనబడినది. ఆ వచనములో ఇలాగున చెప్పబడియున్నది, " కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు '' ప్రకారం తనకు మొఱ్ఱపెట్టేవారికి దేవుడు అత్యంత సమీపముగా ఉంటాడు. వారు కార్చే ప్రతి కన్నీటిబొట్టును ఆయన లెక్కించియున్నాడు మరియు లెక్కిస్తా డు. ఇప్పుడు కూడ మీ కన్నీటికి ఆయన సమీపముగా ఉన్నాడు. లోకమైతే, దేవుడు మిమ్మును విడిచిపెట్టాడు, ఆయన మీ కన్నీటిని ఆలకించుట లేదు ' అని అంటుండవచ్చును. నా స్నేహితులారా, అట్టి మాటలను మీరు లెక్కచేయకండి, వాటిని త్రోసివేయండి. దానికి బదులుగా ఆయన మీ ప్రతి కన్నీటి బొట్టును లెక్కించు దేవుడై యున్నాడు. ఆయన మీ కొరకు న్యాయమును జరిగిస్తాడు. అవును పై వచనము ఈలాగున చెబుతుంది, 'అటువంటి కన్నీటితో విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు.' కాబట్టి, మీరు చింతించకండి.


ఒక అమ్మాయి 12వ తరగతి చదువుతున్నప్పుడు తన ఛాతీలో మూడు గడ్డలు ఉన్నాయి. ఆమె ఏ మాత్రము చదువుకోలేకపోయేది. డాక్టర్లు శస్త్ర చికిత్స చేయించుకోవాలని చెప్పారు. ఆ విధంగానే ఆమె ఆఫరేషన్ చేయించుకొనెను. కానీ, అది చాలా నొప్పితో కూడినది. తద్వారా ఆమెకు నిద్రపట్టలేదు. ఆమె ఏ మాత్రము చదువుకోలేకపోయినది. ఆమె నొప్పి చేత ఎప్పుడు ఏడుస్తూ ఉండేది. కానీ, మరల కొన్ని నెలలోనే మరియొక గడ్డ ఉన్నట్లుగా వారు గమనించారు. ఇవి మరల ఎందుకు వచ్చాయి? అని వారు నిర్ఘాంతపోయారు. మొదటిసారి చేసిన శస్త్ర చికిత్సనే భరించలేకపోయాను అని ఏడ్చినది. వైద్యులు మరల నీకు ఆఫరేషన్ చేయాలని చెప్పారు. మరల చేసినట్లయితే, ఎంతో నొప్పి మరియు బాధ కలుగుతుంది. కానీ, చివరికి వైద్యులు ఆఫరేషన్ చేశారు. ఆఫరేషన్ చేసిన మరొక నెలలోనే ఛాతీ మీద మరియొక గడ్డ వస్తున్నది అని చెప్పారు. అది గమనించిన ఆమె నేను ఇక ఈ బాధతో జీవించలేను. ఇక ప్రాణమును విడిచిపెడదాము అన్న పరిస్థితులలోనికి దిగజారెను. అంతమాత్రమే కాదు,' నా కుటుంబములో డబ్బు అంతయు నీళ్ల వలె కరిగిపోయినది' అని ఎంతో బాధ చెందినది. అదియుగాక, వైద్యులు నీకు ఇప్పుడు 17 గడ్డలు ఉన్నాయి, ఇవి నీకు ఎందుకు వస్తున్నాయో మాకు తెలియలేదు అని చెప్పారు. తద్వారా, ఆమె తన నిరీక్షణనంతటిని కోల్పోయి నిరుత్సాహము చెందినది.


అయితే, మేము కుటుంబ సమేతంగా రాంఛీ వస్తున్నాము అని ఒకరి ద్వారా ఆమె తెలుసుకున్నది. ఆమె నన్ను వ్యక్తిగతంగా కలుసుకొని, ప్రార్థన చేయించుకున్నారు. నేను ప్రార్థించినప్పుడు, దైవీకమైన శక్తి నన్ను నింపినదని ఆమె తెలియజేసెను. ఆమె తిరిగి వెళ్లి, వైద్యుల చేత పరీక్ష చేయించుకున్నప్పుడు, ఆ 17 గడ్డలకు ఉన్న సూచనలు ఏవియు కనబడలేదు, నొప్పి అంతయు అదృశ్యమై పోయినది. ఇక శస్త్ర చికిత్స అవసరం లేదని డాక్టర్లు చెప్పారు. అందుకు ఆమె, నేటి వరకు నేను ఎంతో ఆనందంగా, విడుదలతో జీవించుచున్నానని చెప్పెను. ఆ గడ్డలు మరల రాలేదు. అదే సమయములో మా అమ్మ ఆనందభాష్పములతో సంతోషగానము చేయుచున్నారు అని చెప్పినది. అవును, స్నేహితులారా, ప్రభువు ఆమెను తాకి యున్నాడు, ఆయన ఇప్పుడే మిమ్మును కూడ తాకుతాడు. మీ వ్యాధులను ముట్టి మీకు స్వస్థతను ఇస్తాడు. అంతమాత్రమే కాదు, మీ కన్నీటిని ఆనంద గానముగా మార్చివేస్తాడు. నా ప్రియులారా, ఇప్పుడే మన ప్రభువు మన కన్నీటిని ఆలకించాలని ఆయనను అడుగుదామా? ఆలాగున మన సమస్యలను మరియు వ్యాధులన్నిటిని ఆయన హస్తాలకు అప్పగించి, కన్నీటితో ప్రార్థించినట్లయితే, నిశ్చయముగా కన్నీటితో విత్తుచున్న మీరు సంతోషగానముతో పంటను కోస్తారు. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.


Prayer:
పరలోకపు మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, మా కన్నీళ్లు మరియు భారముతో నిండిన హృదయంతో మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. కన్నీటితో విత్తువారు ఆనందగానముతో పంట కోస్తారనే నీ వాగ్దానాన్ని మేము నమ్ముచున్నాము. ప్రభువా, నీవు కనికరము గలిగిన దేవుడై యున్నావు, నీ కనికరమును మా పట్ల చూపుము. దేవా, మా జీవితములో అద్భుతములు జరిగించుము మరియు ఈ సందేశాన్ని చదువుచున్న మా శరీరములో ఉన్న గడ్డలన్నియు ఇప్పుడు కనిపించకుండా పోవునట్లుగా చేయుము. ప్రభూ, నేను మా బాధలను, మా పోరాటాలను మరియు మా భయాలను నీ పాదాల వద్ద ఉంచుచున్నాము. మేము చిందించే ప్రతి కన్నీటి బొట్టును నీవు చూస్తున్నావని, మా బాధలో నీవు మాకు సమీపముగా ఉంటావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, దయచేసి నీ శాంతిసమాధానము మరియు సౌకర్యాలన్నిటితో మమ్మును నింపుము. దేవా, మా గాయాలను మరియు వ్యాధులను స్వస్థపరచి, మేము కోల్పోయిన ఆనందాన్ని మరల పునరుద్ధరించుము. ప్రభువా, మా కన్నీళ్లను ఆనంద గానముగా మార్చుము మరియు నీ ప్రేమ మరియు కనికరము మా జీవితంలో ప్రకాశింపజేయుమని యేసుక్రీస్తు అతి ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.