నా ప్రశస్తమైన స్నేహితులారా, ఈ నూతన మాసములోనికి ప్రవేశించిన మీ జీవితములో దేవుని యొక్క సమృద్ధికరమైన దీవెనలు కుమ్మరించబడాలని నేను మీ పట్ల కోరుచున్నాను. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 37:4 వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును.'' ఇది మీ కొరకైన దేవుని వాగ్దానమై యున్నది. నేడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మీ పట్ల కోరుకుంటున్నాడు. కానీ, ఆయన అనుగ్రహించు ఆశీర్వాదాలను పొందడానికి మార్గం, మనం ఆయనలో ఆనందించడమే. ప్రభువునందు ఆనందించుట మీ హృదయము నుండి వస్తుంది. ఒకవేళ, మీ మనస్సు విచారముతో కలవరపడి ఉండవచ్చును, చింతలు, బాధ, భయం మరియు ఓటమి ఆలోచనలతో నిండి ఉంటూ, మీ హృదయం ఆనందించలేకపోవచ్చును. కానీ, మీరు ఆయన వాక్యమును ధ్యానిస్తూ, ఆయన ఆనందించినట్లయితే, మీ హృదయం వాటన్నింటికంటె ఉన్నతంగా హెచ్చించబడి ఉంటుంది. దేవుడు మీ హృదయాన్ని ఎంతగానో ఆదరిస్తాడు. ఎందుకంటే, ఆయన దానిని తన ఆలయంగా చేసుకొనియున్నాడు. కనుకనే, మీరు ధైర్యంగా ఉండండి.
అనేక సంవత్సరముల క్రితం, దేవుని పరిచర్యలో వాడబడిన ఒక శక్తిమంతుడైన దైవసేవకుడైన స్మిత్ విగ్గల్స్‌వర్త్, విశ్వాసములో తాను అనుభూతి చెందిన ఒక ప్రాముఖ్యమైన గొప్ప సమయం అది. ఒక కుటుంబము వారు, మరణిస్తున్న తన బిడ్డ కొరకు ప్రార్థించడానికి అతనిని అత్యవసరంగా పిలిచారు. అతను ప్రార్థన చేయడానికి ఆ గదిలోనికి ప్రవేశించే వరకు కుటుంబ సభ్యులు క్రిందనే వేచియుండిరి. కానీ, అతను ఆ బిడ్డపై చేయి పెట్టి ప్రార్థించిన వెంటనే, ఆ బిడ్డ చనిపోయింది. ఆ సమయంలో, సాతాను తనకు ప్రత్యక్షమై అతనిని అవహేళన చేయుచూ, 'స్మిత్, ఇప్పుడు నీ యేసును చూడుము. నీవు వచ్చావు, ఆ బిడ్డ చేతులు పెట్టి ప్రార్థించావు. కానీ, ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయింది. మరి ఇప్పుడు నీవు ఏమి చేస్తావు? నువ్వు బయటకు అడుగు పెట్టినట్లయితే, నీ ప్రార్థనే ఆ బిడ్డ మరణానికి కారణమైందని ప్రజలు నిన్ను నిందిస్తారు. అంతమాత్రమే కాదు, వారు నీ పరిచర్యను, నీ పిలుపును అనుమానిస్తారు. ఇక నీ భవిష్యత్తు ముగిసిపోయింది' అని తెలియజేసెను. కానీ, అతనిలో ఏదో ఒక బలమైన శక్తి చలించినది. దేవుని ఆత్మ, తనలో నుండి పైకి లేచి, అతనితో ఇలాగున మాట్లాడెను, 'స్మిత్, బహుశా! నీవు ఇప్పుడు ఓడిపోయినట్లు అనిపించవచ్చును. కానీ, నీ హృదయములో ఉన్న దేవుడు, ఎర్ర సముద్రాన్ని రెండుపాయలుగా చీల్చాడు. కనుకనే, నీవు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించు, ఆయన యొర్దానును రెండుగా చేసి, తన ప్రజలైన ఇశ్రాయేలీయులను నడిపించాడు. ఆయనకు కృతజ్ఞతలు చెల్లించు, అరణ్యంలో ఆయన తన శక్తి ద్వారా మన్నాను కురిపించి, అనేకులకు ఆహారం పెట్టి వారిని పోషించాడు. ఆయనకు కృతజ్ఞతలు చెల్లించు అని చెప్పెను. ఇంకను, పరిశుద్ధాత్మ దేవుడు, యేసు జరిగించిన అద్భుత కార్యాలను అతనికి గుర్తుచేసెను. ఆలాగుననే, స్మిత్ విగ్లెస్‌వర్త్ ప్రతి ఒక్కొక్కదాని కొరకు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు, దేవుని శక్తి అతనిలోని నుండి ఉద్భవించాడు. అతను ప్రభువు శక్తి మరియు ప్రేమను పొందుకొని, ఆయనను ఆరాధించుటకు ప్రారంభించాడు. దేవుని సన్నిధి ఎంతగానో అతనిలో ఉప్పొంగినందున, అతను బలహీనంగా సొమ్మసిల్లి, కుప్పకూలిపోయాడు. కానీ, అతను మేల్కొన్నప్పుడు, అతడు చక్కటి పియానో సంగీతాన్ని విన్నాడు. వెంటనే, అతడు ఆ బిడ్డ ఉన్న పడక వైపు చూచినట్లయితే, ఆ బిడ్డ కనిపించలేదు. తక్షణమే, అతడు కిందకు పరిగెత్తుకుంటూ వెళ్లి చూచినప్పుడు, ఆ అమ్మాయి సజీవంగా బ్రతికి ఉన్నందున, ఆనందంగా పియానో వాయిస్తూ కనిపించింది. హల్లెలూయా! దేవునికే మహిమ కలుగును గాక.
నా ప్రియులారా, "యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును'' అని చెప్పబడినట్లుగానే, మనము ఆయన యందు సంతోషించినట్లయితే, నిశ్చయముగా, ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడు. అయితే, ప్రభువునందు మనం ఎలా ఆనందించగలం? దేవుని వాక్యములో ఆనందించాలని వ్రాయబడియున్నది. బైబిల్‌లో కీర్తనలు 1:2వ వచనమును చూచినట్లయితే, " యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచుదివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు'' అని సెలవిచ్చుచున్నది. దేవుని వాక్యమే జీవం; మీరు దానిని ధ్యానించినప్పుడు, ఆయన వాగ్దానాలు మీ జీవితములో వాస్తవమవుతాయి. కనుకనే, ఆయన సన్నిధిలో ఆనందించండి. మీరు ప్రభువునందు ఆనందించినప్పుడు, ఆయన మిమ్మల్ని ఉన్నత స్థలములపైకి ఎక్కిస్తాడని యెషయా 58:14 వ వచనములో మీకు వాగ్దానమును చేయుచున్నది. ఎందుకంటే, దేవుడు తన రక్తంతో మిమ్మును విలువపెట్టి కొన్నాడు. మరియు మీరు ఆయనలో వారసత్వంను కలిగి ఉన్నారు. బైబిల్‌లో నిర్గమకాండము 23:20వ వచనము ప్రకారం ఆయన మీ కొరకు ఇదివరకే ఒక దైవీకమైన మార్గాన్ని సిద్ధపరచియున్నాడు.ఆయన దూత మీకు ముందుగా వెళ్లుచూ, మిమ్మును కాపాడుతాడు మరియు ఆయన ఆత్మ మిమ్మును సరాళమైన మార్గములోనికి నడిపిస్తుంది. కనుకనే, మీరు ఆయన లోబడుచూ, ఆయనలో ఆనందించండి. ప్రభువు పట్ల భయభక్తులతో నడవడం అంటే ప్రతిరోజు ఆయన చిత్తానికి లోబడడము. అందుకే, మనం ఇలా ప్రార్థిస్తాము: "నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.''
నా ప్రియులారా, నేడు మీరు కూడా ప్రభువునందు ఆనందించి, శ్రమలు మరియు శోధనల ద్వారా ముందుకు సాగిపోయినప్పుడు, దేవుడు మీ హృదయంలోని ప్రతి కోరికను నెరవేరుస్తాడు. అందుకే బైబిల్‌లో చూచినట్లయితే, కీర్తనలు 112:1-10 వచనములను చూచినట్లయితే, ఆయన ఆశీర్వాదాలను గురించి మాట్లాడుతుంది: " యెహోవాను స్తుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతివారు భూమిమీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపువారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని యింట నుండును వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును'' అని సెలవిచ్చుచున్నది. ఇంకను యెషయా 60:1-3 వ వచనములలో ఈ వాగ్దానాన్ని ధృవీకరిస్తుంది. నేడు, మీరు కూడా ఈ ఆశీర్వాదాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. మీ ఆశీర్వాదాలను లెక్కించండి, వాటిని ఒక్కొక్కటిగా పేర్కొనుచూ, మరియు దేవుడు చేసిన గొప్ప కార్యములను తలంచి, ఆయనను స్తుతించండి. మీ ఓటమిని చూచి మీరు భయపడవద్దు. మీరు ప్రభువుయందు ఆనందించండి, ఆయన మీ హృదయ వాంఛలను మీకు తీరుస్తాడు. ఆయన పునరుత్థానుడైన దేవుడు. ఆయన మిమ్మల్ని బ్రతికిస్తాడు. ఆలాగుననే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీ హృదయ వాంఛలను తీర్చి, ఈ నూతన మాసమంతయు దీవించును గాక.
ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మేము నీలో ఆనందించునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. ఎందుకంటే, నీవే మా ఆనందం మరియు మా బలం. ప్రభువా, మా ప్రతి భయం మరియు సందేహాన్ని అధిగమించి మేము నీలో పైకి లేవనెత్తబడునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించి, మా హృదయాన్ని నీ సన్నిధితో నింపుము. దేవా, నీ వాక్యాన్ని మా జీవితములో పునాదిగా చేసుకుని, దానిని దివారాత్రములు ధ్యానించుటకు మాకు నేర్పించుము. యేసయ్యా, నీవు మా కొరకు సిద్ధపరచి మార్గంలో మమ్మును నడిపించుము మరియు మా జీవితంలో నీ చిత్తం నెరవేర్చుము. దేవా, అపవాది కుయుక్తి నుండి నన్ను కాపాడి రక్షించి, మమ్మును నీతి మరియు సత్య మార్గములోనికి నడిపించుము. ప్రభువా, మా ఇంటిని సమాధానముతోను, మా చేతుల కష్టార్జితమును సమృద్ధితోను, మా హృదయాన్ని అచంచలమైన విశ్వాసంతో దీవించుము. దేవా, మేము చేయుచున్న ప్రతి పనిలోనూ నిన్ను మహిమపరచగలిగేలా చీకటిలో కూడా మా వెలుగును ప్రకాశింపజేయుము. ప్రభువా, మేము నీ వాగ్దానాలను విశ్వసిస్తున్నాము, కనుకనే, నేడు మా హృదయ కోరికలను నీవు నెరవేరుస్తావని నమ్మునట్లుగా, మా హృదయమును బలపరచుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.