నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 58:8వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును'' అన్న వచనము ప్రకారము నేడు మీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత మీకు శీఘ్రముగా లభించును. ఇది మీ కొరకైన దేవుని వాగ్దానము. మీ యొక్క అంధకారము వెలుగు వలె మార్చబడుతుంది. అవును, మీలో ఉన్న వెలుగు వేకువ చుక్క యొక్క వెలుగు వలె బహుగా ఉదయించును. ప్రతి అంధకారమును కూడా మీ నుండి వెళ్లిపోతుంది. అందుకే యోహాను 8:12వ వచనములో యేసు ఈలాగున సెలవిచ్చియున్నాడు, "మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.'' అవును, యేసు, 'నేనే జీవము, నేనే వెలుగు, నేనే మార్గము' అని సెలవిచ్చియున్నాడు. అవును, అన్నిటికంటె, మీకు యేసు చాలును. ఈ రోజు మీ హృదయమును ఆయన కొరకు తెరవజేయండి. ఆయనకు మొఱ్ఱపెట్టండి, "ప్రభువా, నేను అంధకారములో ఉన్నాను, నా యొక్క వ్యాధి నన్ను కబళించి వేయుచున్నది, నేను ఆ యొక్క బాధను భరించలేకపోతున్నాను' అని చెప్పినప్పుడు, ప్రభువు ఇప్పుడే మీ చెంతకు వస్తున్నాడు, అంధకారము ఫటాపంచలు చేయుచున్నాడు. యేసు ఇప్పుడు, మిమ్మును తాకి స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా!

తిరుపతి నుండి సహోదరి సునీత యొక్క ఒక అద్భుతమైన సాక్ష్యమును మీతో పంచుకోవాలని కోరుచున్నాను. ఆమెకు వివాహమైనది, ఒక బిడ్డ ఉన్నది. అయినప్పటికిని రెండవసారి గర్భము ధరించియున్న సమయములో, ఆమె నడుస్తుండగా, ఒక రాయి తట్టుకొని, ఆలాగునన పడిపోవడం జరిగింది. గర్భములో ఉన్న బిడ్డ మృతి చెందినది. అయితే, తీవ్రంగా రక్తస్రావము కలిగెను. అనేకమైన ఫైబ్రాయిడ్స్ వచ్చాయి. శస్త్ర చికిత్స చేయాలని డాక్టర్లు చెప్పారు. ఆ శస్త్ర చికిత్స చేయుచున్న సమయములో, ఒక కణితి పగిలిపోవడం జరిగింది. తద్వారా, తన యొక్క వెన్నెముకలోనికి ఆ చీము వెళ్లడము జరిగింది. ఆమె సుదీర్ఘ కాలముగా బాధపడుచుండెను. ఇంకను ఆమెకు ఆర్థిక సమస్యలు కూడా ఉండెను. కనుకనే, తన జీవనోపాధి కొరకు ఆమె ఉద్యోగమునకు వెళ్లవలసి వచ్చినది. ఆమెకు భయంకరమైన నడుము నొప్పి కూడా ఉండెను.

అటువంటి సమయములో, ఒక రోజు ఉదయకాలమున ఆమె యేసు పిలుచుచున్నాడు టి.వి. కార్యక్రమమును చూస్తుండెను. ఒక ఉదకాలమున ఆ కార్యక్రమములో నేను ప్రార్థన చేయుచుండగా, నేను ఆమె పేరు పెట్టి, సునీత అని పిలిచాను. " సునీతా, దేవుని హస్తము నీ మీదికి దిగివస్తుంది, నిన్ను రూపాంతరపరుస్తుంది. నీ యొక్క ఎముకలను స్వస్థపరుస్తుంది. నీవు శ్వాస పీల్చలేక ఆయాసముతో బాధపడుచున్నావు. కానీ, యేసు ఇప్పుడు మిమ్మును స్వస్థపరుస్తున్నాడు,'' అని చెప్పినప్పుడు, అత్యంత గొప్ప శాంతి, సంతోషము ఆమెను నింపినది. యేసు యొద్ద నుండి స్వస్థత ఆమె యొద్దకు వచ్చినది. ఆమె నూరు శాతము స్వస్థపరచబడెను. దేవునికే మహిమ కలుగును గాక.

ఈ రోజు సహోదరి సునీత సీషా ద్వారా పేదలకు సహాయము చేయుటలో యేసునకు తమ సేవలు అందించెను. సీషా బాధపడుచున్నవారికి, పేదలైనవారికి, చదువుకునే బిడ్డల కొరకు, మరియు విధవరాలైన వారి కొరకు మేము సహాయము చేయుచున్న ఒక పరిచర్య. దేవుడు మీకును ఆలాగుననే జరిగిస్తాడు. నేడు మీకు స్వస్థత శీఘ్రముగా లభిస్తుంది. మీ జీవితము వెలుగుచేత నింపబడి ఉంటుంది. లోకమునకు వెలుగై ఉన్న యేసు మీ జీవితమును స్వాధీనము చేసుకుంటాడు. అయినప్పటికిని, లోకము యొక్క అంధకారము ఈ లోకాన్ని నింపుచున్నది. అందుకే బైబిల్‌లో యోహాను 9:4-5వ వచనములను చూచినట్లయితే, " పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను'' ప్రకారము అంధకారములో ఉన్నవారందరి యొద్దకు నేను దేవుని యొక్క వెలుగును తీసుకొని రావలసి ఉన్నదని యేసు సెలవిచ్చుచున్నాడు. ఆలాగుననే, నేడు అట్టి అత్యావశ్యకతను మనము కలిగియున్నాము. లోకమును నింపుచున్న ఇట్టి అంధకారము మధ్యలో దేవుని వెలుగును మనము మోసుకొని వెళ్లవలసి యున్నది. అందుచేతనే, యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురము ద్వారా 24 గంటలు సేవలు అందించుచున్నాము. 24 గంటలలో ప్రజలు ఏ సమయమైన ఫోన్ ద్వారా సంప్రదించినప్పుడు, మేము వారి నిమిత్తము ప్రార్థన చేయుచున్నాము. దాదాపు ప్రతి నెల మూడున్నర లక్షల మంది ప్రార్థనా గోపురమునకు మాకు కాల్ చేస్తుంటారు. లక్షలాది మంది ఉత్తరములు వ్రాస్తుంటారు. ప్రార్థన కొరకై లక్షలాది మంది ప్రార్థనా గోపురమునకు వస్తుంటారు. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ప్రజలకు అంధకారమును నుండి విడుదల కలిగించుట కొరకు, వెలుగును ప్రకాశించుచున్నాము. ప్రార్థన చేయడము కొరకు శిక్షణను అనుగ్రహించుచున్నాము. వేల మంది మాతో కలిసి పరిచర్య చేయుచున్నారు. ఈ సేవా పరిచర్యలో భాగస్థులై, ఈ పని కొరకు ప్రతి నెల సహాయమందించుచున్నారు. నా ప్రియులారా, నేడు మీరు కూడా అంధకారములో ఉన్నవారికి మాతో కలిసి యేసు యొక్క వెలుగును తీసుకొని రావచ్చును. అప్పుడు మీ యొక్క వెలుగు వేకువ చుక్కవలె ఉదయించడం జరుగుతుంది. దేవుడు అటువంటి కృపను నేడు మీకు ఇచ్చును గాక. నేడు అద్భుతమైన దినముగా మీరు కలిగి ఉండండి. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మహోన్నతుడవైన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, నీ యొక్క వెలుగు మా మీద ప్రకాశించాలని తృష్ణకలిగి ఉంటూ, మేము నీ ముందుకు వచ్చుచున్నాము. ప్రభువా, మా జీవితంలోని ప్రతి చీకటిని తొలగించి, నీ స్వస్థత వేకువ చుక్క వలె మాలో విరజిమ్మునట్లుగా చేయుము. యేసయ్యా, నీవు ఈ లోకానికి వెలుగుగా ఉన్నావు. కనుకనే, మా అడుగులు వెలుగులోనికి నడిపించి, నిరాశ నుండి మమ్మును బయటకు విడిపించుము. యేసయ్య, మేము మా హృదయాన్ని నీవైపునకు తెరచుచున్నాము. దేవా, దయచేసి మమ్మును జీవపు వెలుగుతో నింపుము. ప్రభువా, మాలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని, ప్రతి దుఃఖాన్ని తొలగించుము మరియు దేవా, నీ ప్రకాశవంతమైన సన్నిధితో మమ్మును పునరుద్ధరించుము. యేసయ్యా, చీకటిలో ఉన్నవారికి మేము నిరీక్షణను తీసుకురావడానికి నీ వెలుగు మా ద్వారా ప్రకాశింపజేయుము. ప్రభువా, మాకు స్వస్థత శీఘ్రముగా లభిస్తుందని నీ వాగ్దానాన్ని మేము నమ్ముచున్నాము. దేవా, నీ కృప ద్వారా నీ సత్యపు వెలుగులోని ధైర్యంగా నడవడానికి మమ్మును బలపరచుమని మా ప్రభువైన యేసు క్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.