నా ప్రియమైన స్నేహితులారా, దేవుని నామమున మీకు వందనాలు. మిమ్మును కలుసుకోవడం నాకు ఎంతో సంతోషముగా ఉన్నది. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 138:8వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును'' ప్రకారము ఈ రోజు మీ జీవితములో దేనిని గురించి చింతించుచున్నప్పటికిని, ప్రభువు దానిని సఫలము చేస్తానని వాగ్దానము చేయుచున్నాడు. 50శాతము లేక 70 శాతము కాదు కానీ, నా ప్రియులారా, వంద శాతము చక్కగా దేవుడు మీ పట్ల సమస్తమును సంపూర్ణంగా చేస్తాడు.

ఒకవేళ నా ప్రియులారా, ఒకవేళ మీరు, ప్రభువా, నేను వైఫల్యము వెంబడి వైఫల్యమును ఎదుర్కొంటున్నాను, నాకు ఫలితము ఎప్పుడు వస్తుంది? అని మీరు అడుగుచుండవచ్చును. ఈ రోజు ఆ సాఫల్యత మీ జీవితములోనికి రాబోతుంది, నా ప్రియులారా, మీరు ధైర్యంగా ఉండండి, యేసులో నూరు శాతము విశ్వాసముంచండి. ఆ వందశాతము మీకున్నప్పుడు, ఆ వందశాతము ద్వారా మీరు ఆ సాఫల్యతను కలిగియుంటారు. చిన్న పిల్లలు దేవునిపై ఎంతో విశ్వాసమును కలిగి ఉంటారని ఎల్లప్పుడు చెబుతుంటారు కదా! ఆలాగుననే, నేను కేటి జీవితములో దానిని చూశాను. ఈ మధ్య కాలములో ఎత్తైన సోఫా నుండి నేలపైకి ఎగిరి దూకడము తను నేర్చుకుంది. ప్రతిసారి ఎగిరి దూకేముందు, 'యేసయ్యా, నాకు సహాయము చేయి' అని చెబుతుంది. ఆలాగున అని చెప్పిన వెంటనే, ఎగిరి దూకిన తర్వాత, నా దగ్గరకు వచ్చి, 'అమ్మా నేను ఎరిగి దూకాను, కానీ, నాకు ఏమి దెబ్బలు తగలలేదు, యేసయ్య నాకు సహాయము చేశాడు' అని చెబుతుంది. అది చిన్నపాటి విశ్వాసము.

నా ప్రియులారా, ఈ రోజు మీకు ఆలాంటి కొద్ది పాటి విశ్వాసము ఉన్నను కూడా, దేవుడు మీకు సాఫల్యతను అనుగ్రహిస్తాడు. మీ జీవితములో మీరు సరైన జీవిత భాగస్వామి కొరకు ఎదురు చూసున్నట్లయితే, ప్రభువు సరైన సమయములో మీకు తగిన జీవిత భాగస్వామిని మీ యొద్దకు నడిపిస్తాడు. మీ స్వంత గృహ నిర్మాణము కొరకు మీరు వేచి ఉన్నను సరే, ఇంకను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే, నేడే మీ గృహమును నిర్మించుటకు ప్రభువు మీకు కావలసిన ధనమును సమృద్ధిగా సమకూరుస్తాడు. ఇజ్రాయేలు ప్రార్థనా గోపురమును కొనాలి అనుకున్నప్పుడు, ఇది జరిగినది. ఇజ్రాయేలు దేశమునకు పరిచర్యను వ్యాప్తి చెందించాలని అనుకున్నప్పుడు, స్థలము దొరకడం ఎంతో కష్టతరముగా ఉండెను. అయితే, ఆఖరి తేదీకి కంటె ముందుగానే, ప్రభువు సరియైన సమయములో కావలసిన ధనమును సమకూర్చి, ఆ దేశములో కూడా దేవుడు పరిచర్యను వ్యాప్తి చేయుటకు ప్రభువు మాకు సహాయము చేశాడు. అవును, పరిపూర్ణమైన ఆశీర్వాదములు. ఈ రోజు ఆ ప్రార్థనా గోపురము ద్వారా లక్షలాది మంది ఎన్నో విధాలుగా ఆశీర్వాదములను పొందుకుంటున్నారు. నా ప్రియులారా, యేసయ్య యొద్ద నుండి ఇటువంటి పరిపూర్ణమైన ఆశీర్వాదాలను పొందుకొనండి. ఈ రోజు మీ యొక్క పరిపూర్ణమైన ఆశీర్వాదముల వైపు చూడండి, నేటి వాగ్దానము ద్వారా ఈ ఆశీర్వాదాలను పొందుకొనండి. నేడు దేవుడు వందశాతము సమస్తమును పరిపూర్ణమైన ఆశీర్వాదములతో మిమ్మును నింపును గాక.

ప్రార్థన:
అమూల్యమైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసయ్యా, నీ యొక్క పరిపూర్యమైన ఆశీర్వాదములు మా మీదికి దిగివచ్చునట్లుగా చేయుము. 50శాతము లేక 70 శాతము కాదు కానీ, ప్రభువా, వంద శాతము సమస్తమును సంపూర్ణంగా మా పట్ల జరిగించుము. ప్రశస్తమైన ప్రభువా, మమ్మును బాధించే ప్రతిదానినీ పరిపూర్ణం చేస్తానని నీ వాగ్దానంపై నమ్మకం ఉంచి మేము నీ ముందుకు వచ్చుచున్నాము. ప్రభువా, మా జీవితంలో పాక్షికంగా కాకుండా వందశాతము పరిపూర్ణ ఆశీర్వాదాలను తీసుకొని వస్తావని మేము తెలుసుకుని, మా చింతలను మరియు వైఫల్యాలను నీ చేతుల్లోకి అప్పగించుచున్నాము. దేవా, నీవు సరైన సమయంలో మరియు సరైన మార్గంలో సమస్తమును సమకూరుస్తావని మేము నమ్ముచున్నాము, దేవా, చిన్న పిల్లలవలె మేము నిన్ను విశ్వసించడానికి మా విశ్వాసాన్ని బలపరచుము. ప్రభువా, మా యొక్క ప్రతి ఆలస్యానికి, మాకు ఓపికను అనుగ్రహించుము, ప్రతి నిరాశకు, మాకు శాంతిని దయచేయుము మరియు ప్రతి అవసరానికి, నీ పరిపూర్ణమైన ఏర్పాటును మాకు పంపించుము. దేవా, మా మేలు కొరకు తెరవెనుక పనిచేసినందుకు, మా యొక్క ఆవగింజంత పరిమాణంలో విశ్వాసం నుండి పరిపూర్ణతను తీసుకొని వచ్చునట్లుగా మా విశ్వాసము స్థిరపరచుము. దేవా, నేడు కృతజ్ఞతతో మరియు నిరీక్షణతో నిండిన హృదయంతో మేము ఈ రోజు నీ యొక్క పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందుకొనునట్లుగా, మాకు నీ కృపను అనుగ్రహించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.