నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు 'ఇమ్మానుయేలుగా' దేవుడు మీతో కూడా ఉన్నాడు. 'ఇమ్మానుయేలు' అను మాటకు అర్థము, "దేవుడు మనకు తోడుగా ఉన్నాడు.'' ఇంకను ఆయన మీ ప్రక్కన సన్నిహితముగా నడవాలని మీ పట్ల కోరుచున్నాడు. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 94:19 వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము ప్రకారము ఆయన తన ఆశీర్వాద వచనమును ఈరోజు మనతో ఈలాగున మాట్లాడుచున్నాడు, " ప్రభువా, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది.'' అవును, ఇది ఎంత చక్కటి వచనము కదా. ఇది దేవుని యొక్క సారాంశాన్ని సంగ్రహించే వచనమై ఉన్నది. ఆయన ఉపరితలం వైపు చూడడు-మన బాహ్య రూపాన్ని లేదా మన బలవంతంగా లేదా నకిలీ చిరునవ్వులను చూడడు.

ఆయన మన ఆత్మను చూస్తాడు. మన ఆత్మను బాధించునది ఏమై యున్నదో ఆయన దానిని చూస్తాడు. మన హృదయం మరియు ఆత్మ పిరికితనముతోను, భయముతోను, దుఃఖం మరియు ఆందోళనతో బాధపడటం దేవుడు కోరుకోడు. మనలను పైకి లేవనెత్తడానికి, మనల్ని ఆదరించడానికి మరియు మన ఆత్మలను పునరుద్ధరించడానికి ఆయన పక్షమున ఉన్నాడు. నా స్నేహితులారా, దేవుడు ఇక్కడ మనలను ఆదరించుటకు 'ఇమ్మానుయేలుగా' మనకు తోడుగా ఉన్నాడు.

నా ప్రియులారా, అయినను దేవుడు ఇక్కడ మన పట్ల జాగ్రత్త వహిస్తాడు మరియు ఆత్మను గురించి జాగ్రత్త వహిస్తాడు. ఆయన గొప్ప దేవుడై యున్నాడు. అయినను ఆయన మన చిన్న ఆత్మ కొరకు జాగ్రత్త వహిస్తాడు. కొందరు ప్రజలు ప్రార్థన కొరకు అని నా యొద్దకు వస్తుంటారు. వారు ప్రార్థన కొరకు ప్రార్థన విన్నపములను సుదర్ఘీమైన పట్టికను ఇస్తారు. అది చూచినప్పడు నా గుండె బ్రద్దలైపోతుంది. ఆలాగుననే, ఎన్నో వివిధరకములైన శ్రమల గుండా వారు వెళ్లుచున్నారు కదా! నేను దానిని ఊహించలేకపోతాను. కొంతమంది స్త్రీలు వారి యొక్క సమస్య కొరకు నేను ప్రార్థన చేసిన తర్వాత, వారు మరియొక సమస్యను గురించి చెప్తుంటారు. ఒకదాని వెంబడి ఒకటి సమస్యలు చెబుతూనే ఉంటారు. వారు ఎంతో భారమును అనుభవిస్తున్నారు కదా! వారు ఎంతో విచారమును అనుభవిస్తున్నారు కదా! ప్రార్థనా సమయములో కూడ నాకు ఎంతో కలతగా ఉంటుంది. వారి హృదయాల యొక్క భారము నిజంగా అత్యధికంగా ఉంటుంది మరియు కొన్నిసార్లు, వారి బాధ యొక్క లోతును ఊహించలేము.

నా ప్రియ స్నేహితులారా, వారి హృదయ విచారములు అనేకములుగా ఉన్నప్పటికిని, ఈ రోజున దేవుని గొప్ప ఆదరణ వారికి సంతోషమును ఇచ్చుచున్నది. అది మిమ్మును ఆదరిస్తుంది. నా ప్రియులారా, బైబిల్‌లో మత్తయి 11:28వ వచనమునందు ఈలాగున చెబుతుంది, "ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.'' మరియు కీర్తనలు 23:4వ వచనములో చూచినట్లయితే, " గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును'' అని చెప్పబడినది. దేవుడు మనకు ఒక కాపరిగా ఉంటూ, మనలను ఆదరిస్తాడు, కాపరి తన గొఱ్ఱెలను ఆదరించినట్లుగా, దేవుడు మనలను కూడా ఆదరిస్తాడు.

ఆలాగుననే, తుఫానులో తన శిష్యులు భయపడినప్పుడు యేసు వారిని ఎలా నిమ్మళపరిచాడో మనము జ్ఞాపకము చేసుకొనగలము. దోనె అలల చేత, గాలిచేత కొట్టబడుచున్నప్పుడు యేసు తన శిష్యులను ఆదరించినట్లుగా మనము చూడగలము. యేసు ప్రభువు, శిష్యులను చూచి, " నేను మీతో కూడా ఉన్నాను, మీరెందుకు భయపడుచున్నారు'' అని సెలవిచ్చాడు. అదేవిధంగా, అగ్ని గుండములో విసరవేయబడిన ష్రదకు, మేషాకు, అబేద్నెగోలతో అగ్నిగుండంలో పడద్రోయబడినప్పుడు, దేవుడు నాలుగవ వ్యక్తిగా వారితో నిలబడి, 'నేను మీతో కూడా ఉన్నాను. భయపడకండి' అని చెప్పాడు. ఏలీయా భయం మరియు నిరాశతో నింపబడి ఉన్నప్పుడు, 'ఏలీయా, విశ్రాంతి తీసుకో మరియు భోజనము చేయుమని' చెప్పుటకు ఆయన తన దేవదూతను పంపి, అతనిని ఆదరించాడు. దేవుడు మీరు మంచిగా ఉండాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. దేవుడు మనము కలత చెందు సమయములో, మనకు ఆయన ధైర్యమునిచ్చి, ఆదరణనిచ్చి, మన పట్ల జాగ్రత్త వహిస్తాడు. దేవుని సంరక్షణ మరియు కనికరము ఎప్పుడూ విఫలం కావు. మీరు దేవుని ఆదరణను పొందుకొని, విశ్రమించండి, దేనికిని భయపడకండి.

నా ప్రియ స్నేహితులారా, అదేవిధంగా ఆయన మీకును కూడా జరిగిస్తాడు. కనుకనే, మీరు ఎంతగా కలత చెంది ఈలాంటి పరిస్థితులలో వెళ్లతారో, ప్రభువు యొద్ద నుండి గొప్ప ఆదరణ రావడము మీరు చూస్తారు. ప్రభువే స్వయంగా మిమ్మును ఆదరిస్తాడు. మా తాతగారు తీవ్రమైన శ్రమల గుండా, అనారోగ్యముగా వెళ్లినప్పుడు,కూడా దేవుడు ఆయనకు తోడుగా ఉండి నడిపించాడు. దేవుడు స్వయంగా ఆయనకు ప్రత్యక్షపరచుకున్నాడు. మా తాతగారిని ఆదరించడానికి, పరలోకమందును, పరలోకమందలి పరిశుద్ధులను మా తాతగారికి చూపించాడు. ఆలాగుననే, దేవుడే మీకు స్వయంగా ప్రత్యక్షమై మిమ్మును ఆదరిస్తాడు. మీరు సంతోషముతో నింపబడడానికి ఆయన మీ యొద్దకు వస్తాడు.

నా ప్రియులారా, నేడు మీ యొక్క శ్రమలలో మీరు ఆయనను చూస్తారు. ఆమేన్. మీరు కొంత కాలము శ్రమపడుచున్నారేమో, కానీ, «ధైర్యము తెచ్చుకొనండి, మీ దుఃఖము ఆనందముగా మారుతుంది. మీ బాధలో, మీరు ఆయనను చూస్తారు. మీరు కొంతకాలం కష్టాలను భరించినప్పటికీ, ధైర్యాన్ని కలిగి ఉండండి - మీ దుఃఖం ఆనందంగా మారుతుంది. దేవుడే మీకు ఆదరణగా ఉంటాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, ప్రేమ మరియు ఓదార్పు యొక్క నీ విలువైన వాగ్దానానికి మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, ప్రస్తుతం, మా పట్ల శ్రద్ధ వహించమని మేము నిన్ను కోరుచున్నాము. ప్రభువా, మా చుట్టూ ఉన్న నీ ఓదార్పునిచ్చే ఉనికిని అనుభవించాలని మేము కోరుకుంటున్నాము. దేవా, మా హృదయములో విచారము హెచ్చగా నీ ఆదరణను మా హృదయంలోనికి తీసుకొని వచ్చి మమ్మును ఓదార్చుము. యేసయ్యా, తల్లి తన బిడ్డను ప్రేమిస్తున్నట్లుగా నీవు మమ్మును నీ ప్రేమతో ఆదరించుము. ఈ సమయంలో, ఆదరణ లేదా సహాయం కొరకు ఎవరూ ఆశ్రయించనందున మేము ఒంటరిగా ఉన్నాము. దేవా, నీవు మా శాంతికి ఏకైక ఆధారం. మా ఏకైక ఆశ్రయం. కాబట్టి, ప్రభువా, నీ ప్రేమగల చేతులతో మమ్మును సమర్పించుకొనుచున్నాము. నీవు గిలాదులోని ఔషధతైలంవలె నీ ప్రేమ ద్వారా మా గాయాలను స్వస్థపరచుము మరియు మా విరిగిన హృదయాలను సరిచేయుము. దేవా, నీ ఆదరణ నదివలె మా జీవితాలలో ప్రవహించునట్లుగాను, మా ప్రతి ఆందోళన మరియు భయాన్ని తొలగించుము. దేవా, మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచుము. ప్రభువా, నీ అద్భుతం చేయగల శక్తి మా జీవితంలో కుమ్మరించుమని యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.