నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 11:25వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "ఔదార్యముగలవారు పుష్టి నొందుదురు. నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును'' ప్రకారం మీరు కూడా ఔదార్యముగా దేవునికి ఇవ్వండి. అప్పుడు మీరు పుష్టి నొందుదురు. బైబిల్‌లో యేసు 5 వేలమందికి భోజనము పెట్టిన సంఘటన మనకు తెలిసియున్నది కదా! యేసు క్రీస్తు తన యొద్దకు వచ్చి బహు జనసమూహమును చూచి, ఆయన కనికరముతో కదిలించబడి, శిష్యులలో ఒకరిని ఈలాగున అడిగాడు. కాబట్టి యేసు కన్నులెత్తి బహు జనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను. కానీ, తాను యేమి చేయనై యుండెనో తానే యెరిగి యుండి ఫిలిప్పును పరీక్షించుటకు ఆలాగడిగెను. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఇంకను వీటిని కొనడానికి ఆరు నెలల సంపాదన అవసరమవుతుంది అని అతడు చెప్పాడు. అయితే, ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ, ఇక్కడ ఉన్న యొక చిన్న వాని యొద్ద అయిదు యవల రొట్టెలు మరియు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని, యింత మందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా అప్పుడు యేసు జనులను అక్కడ కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాల పచ్చిక యుండెను గనుక లెక్కకు ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతా స్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. ఆలాగున చేపలు కూడ వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను; వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి, వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన అయిదు యవల రొట్టెల ముక్కలు పోగుచేసి పండ్రెండు గంపలు నింపిరి.

నా ప్రియులారా, ఆ చిన్న బాలుడు ఇచ్చినటువంటి, రెండు చేపలు మరియు ఐదు రొట్టెలు యేసయ్య అభివృద్ధి నొందించి, ఐదు వేలమంది యొక్క ఆకలి తీర్చుటకు వారికి ఆహారమును ఇచ్చియున్నాడు. నా దగ్గర ఉన్నటువంటి ఈ కొంచెము ఆహారము ఈ ఐదు వేలమందికి ఎలాగున సరిపోతుందని ఆ బాలుడు అనుకొని ఉండవచ్చును. కానీ, ఔదార్యముగల హృదయముతో ఆ బాలుడు యేసునకు సంతోషముతో ఇచ్చాడు. యేసుక్రీస్తు తనకు ఉన్న ఔదార్య హృదయముతో ఆ రొట్టెలను మరియు చేపలను ఆశీర్వదించి, అభివృద్ధి నొందించునట్లు చేసి, వారికి ఇచ్చి, పండ్రెండు గంపలు మిగులునట్లుగా చేసెను. నా ప్రియులారా, ఈ రోజు మీరు ప్రభువు పరిచర్యలోనికి మీరు విత్తుచుండగా, నాకు ఉన్నది కొంచెమే కదా, నేను ఇప్పుడు ఏమి చేయాలి అని మీరు అనుకుంటున్నారేమో? పేదలకు ఆహారము పెట్టుచున్నప్పుడు, కొంతమందికే నేను ఆహారమును పెట్టుచున్నాను, నేను ఏలాగున ఒక మార్పును తీసుకొని రాగలను అని అనుకుంటున్నారా? నేను ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు ఆదరణ కలుగజేశాను, అదేలాగున ఒక గొప్ప మార్పు అవుతుందని అనుకుంటున్నారా? కానీ, స్నేహితులారా, ఔదార్య హృదయముతో మీరు అది చేసినప్పటికిని, అది చాలా కొంచెము అని మీరు అనుకుంటున్నను సరే, మీ హృదయములో ఉన్న ఔదార్యమును బట్టి మీరు అది జరిగించినప్పటికిని, మీ జీవితములో మీకు ఏదియు లేకపోయిననుసరే, ప్రభువు మిమ్మును అభివృద్ధి నొందిస్తాడు. అందుకు ప్రతిఫలంగా, మీరు అభివృద్ధి పొందుట మీరు చూచెదరు.

అవును నా ప్రియులారా, నేడు మీరు ఏది విత్తుతారో, అదే తిరిగి పొందుకుంటారు అని ప్రపంచము చెప్పవచ్చును. మీ హస్తములో ఏమి లేకపోయినను సరే, మీరు విత్తినప్పుడు, ప్రభువు దానిని అభివృద్ధి నొందిస్తాడు. గంపలు మిగులునంతగా ప్రభువు మిమ్మును అభివృద్ధి చేస్తాడు. ఎంతో మంది వారికున్న భూములను అమ్ముకుని, వచ్చిన డబ్బులో నుంచి, ప్రభువు పరచర్యలో విత్తడానికి మేము చూస్తూ ఉంటాము. రెండు స్వంత గృహములను నిర్మించుకొనే అంతగా ప్రభువు వారిని దీవిస్తాడు. ఆ రోజు సంపాదించుకున్న వందరూపాయలలో నుంచి 10 రూపాలు దేవునికి ఇచ్చే వారుగా ఉంటారు. ప్రభువు దానిని ఆశీర్వదించి, పరిచర్యను జరిగిస్తాడు. ఇచ్చినవారికి కూడా ఆశీర్వాదములను కలుగజేస్తాడు. వారి బిడ్డలకు చదువు చెప్పించడానికి ప్రభువు కృపను చూపిస్తాడు. వారి గృహ నిర్మాణము కొరకు, వారి జీవితములో వారు పైకి ఎదగడానికి, ఏమి లేని పరిస్థితులలో నుండి వారు విత్తగా ఇంతటి గొప్ప ఫలితాన్ని వారు పొందుకుంటారు. మీరు కూడా మీ హృదయ ఔదార్యమును పొందుకుని, మీరు ఇచ్చినప్పుడు ప్రభువు మిమ్మును అభివృద్ధి నొందిస్తాడు. పొంగిపొర్లునంతగా ప్రభువు మిమ్మును దీవిస్తాడు. మీరు ఇతరులను పోషింపగా, మీరు పోషింపబడతారు. కాబట్టి, ప్రభువు రాజ్యములో విత్తడాన్ని ఆపివేయకండి, ప్రభువు మిమ్మును నిశ్చయముగా అభివృద్ధి నొందిస్తాడు. ప్రభువు మిమ్మును పోషిస్తాడు. మిమ్మును దీవిస్తాడు. ఈ రోజు ఈ వాగ్దానమును ప్రార్థించి పొందుకుందాము. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, ఔదార్యవంతులు అభివృద్ధి పొందుతాడని మరియు ఇతరులను ఉత్సాహపరచేవారు ఉత్తేజపరచబడతారని వాగ్దానం చేసినందుకు కృతజ్ఞతలు. ప్రభువా, నీ రాజ్యములోనికి విత్తుచున్న మమ్మును ఆశీర్వదించుము. దేవా, మా డబ్బును, సమయమును, శ్రమను విత్తుచున్న మమ్మును, ఇతరులకు దీవెనకరముగా ఉండునట్లు మార్చి, మమ్మును ఆశీర్వదించి, అభివృద్ధి నొందించుము. దేవా, ఇంకను గంపలు మిగులునంతగా మమ్మును దీవించుము. దేవా, మా చుట్టు ఉన్న వారందరికి ఒక సాక్ష్యముగాను మరియు దీవెకనరముగా ఉండునట్లుగా మమ్మును మార్చుము. తండ్రీ, మా చేతి పనులను ఆశీర్వదించి, అభివృద్ధి పొందునట్లుగా చేయుము. ప్రభువా, ఇప్పుడు కూడా, మా దగ్గర ఉన్నదంతయు, అది ఎంత చిన్నదిగా అనిపించినా, మేము దానిని నీకు సమర్పించుచున్నాము. దేవా, మేము ఇష్టపూర్వకంగా మరియు ప్రేమగల హృదయంతో దానిని మీకు అందించుచున్నాము. ప్రభువా, దయచేసి నీ మహిమ కొరకు దానిని విస్తరింపజేసి, అది అనేకమంది జీవితాలను ఆశీర్వదించునట్లుగా చేయుము. యేసయ్యా, మాకు కొంచెముగా ఉన్నప్పుడు కూడా నీకు ఇవ్వడం మాకు నేర్పించుము. ప్రభువా, నీకు ఇచ్చుట ద్వారా నీవు అభివృద్ధిని తీసుకొనివస్తావని నమ్ముతూ విశ్వాసంతో విత్తడానికి మాకు సహాయం చేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.