నా అమూల్యమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికి శుభములు. ఈరోజు జనవరి 2వ తేదీ గనుకనే, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. ఇంకను దేవుని ఆశీర్వాదములు మీ మీద కుమ్మరించాలని నేను మీ పట్ల కోరుచున్నాను. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 58:11వ వచనమును మనము నేడు ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "యెహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ యెముక లను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు'' అని చెప్పబడిన ప్రకారము మీరు ఈ నూతన సంవత్సరములో నిత్యము ఉబుకుచుండు నీటి ఊటవలె ఉంటారు.
ఇంకను బైబిల్‌లో చూచినట్లయితే, కీర్తనలు 31:3వ వచనములో కీర్తనాకారుడైన దావీదు విశ్వసించి చేసినటువంటి ఒక చిన్న ప్రార్థనను మనము చూడగలుగుతాము. ఆ వచనము, "నా కొండ నా కోట నీవే నీ నామమునుబట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయ దుర్గము నీవే'' అని చెప్పబడినట్లుగానే, నా స్నేహితులారా, ఇది ఒక చిన్న ప్రార్థనగా ఉంటుంది. కనుకనే, ఈ నూతన సంవత్సరము ప్రారంభములో మనము ఉంటుండగా, ఈ చిన్న ప్రార్థనతో ఈ నూతన సంవత్సరమును మనము ప్రారంభిద్దాము మరియు ప్రభువు మన జీవితాలు ఎలా కదిలించబడతాయో చూద్దాం.
ఆవిధంగా, మనము ప్రార్థించినప్పుడు ఏమి జరుగుతుంది? బైబిల్ నుండి మనము కీర్తనలు 23వ అధ్యాయములో చూచినట్లయితే, అన్నియు ఆశీర్వాదములో అందులో వ్రాయబడి ఉన్నాయి. అటువంటి ఆశీర్వాదములను పొందుకొనుటకు మనము ఏమి చేయాలి? అనగా, ఆ గొప్ప దేవుని మనము కాపరిగా కలిగి ఉండాలి. ఆయనే మనకు సమస్తముగా ఉండాలి. ఇంకను ఆయన మన నాయకుడుగాను మరియు మనలను నడిపించేవాడుగా ఉండాలి. ఇంకను ఆయన మనకు ఆశ్రయదుర్గమై ఉండాలి. హల్లెలూయా!! అటువంటి జీవితమును మీరు కలిగియున్నారా? నా ప్రియ స్నేహితులారా. ఇంకను దేవునితో అన్యోన్య సహవాసమును కలిగి ఉంటున్నారా? ప్రభువుతో మీరు అన్యోన్య సహవాసమును కలిగి ఉంటున్నారా? ఆయనే నాకు ఆశ్రయ దుర్గము అని నిశ్చయముగా చెప్పగలరా? ఆలాగున ఉన్నప్పుడు ఈ సంవత్సరమంతయు దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదములను మీరు పొందుకొని అనుభవిస్తారు.
కనుకనే, నా ప్రియులారా, మీ కుటుంబమునకు ఆయనను యజమానునిగా మీరు ఉంచుకొన్నట్లయితే, ప్రతిరోజు మీరు కుటుంబముగా కూడుకొని, ప్రభువు యొక్క ఆశీర్వాదములన్నిటిని ప్రార్థించి పొందుకొనండి. ఆ విధంగా మీరు చేసినప్పుడు, యెషయా 58:11వ వచనములో చెప్పబడినట్లుగానే, ప్రభువు క్షామ కాలమునందు మిమ్మును నిత్యము నడిపిస్తూ, మీకు ముందుగా ఆయన వెళ్లి, సమస్తమును మీ కొరకు చక్కపరుస్తాడు. కనుకనే, నేడు మన జీవితాలను ఆయన హస్తాలకు సమర్పించుకుంటూ, దావీదు వలె ఒక చిన్న ప్రార్థనను చేద్దామా? ఆలాగు చేసినట్లయితే, నిశ్చయముగా దేవుడు మనలను నేటి వాగ్దానము ద్వారా ఈ నూతన సంవత్సరమంతయు దావీదు వలె దీవించును గాక.
ప్రార్థన:
అమూల్యమైన మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, నీ యొక్క మారని నిత్యమైన వాగ్దానములను బట్టి, నీకు వందనాలు చెల్లించుచు న్నాము. ప్రభువా, మేమందరము ఏకమనస్సుతో మా యొక్క జీవితాలను నీ దివ్య హస్తములకు సమర్పించుకొనుచున్నాము. దేవా, నిన్ను దావీదు తన కాపరిగా ఉండునట్లు ఎలా ప్రార్థించాడో, ఆలాగుననే, నీవు మా కాపరిగా ఉంటూ, మాకు ముందుగా నీవు వెళ్లి, మమ్మును క్షామ కాలమందు నిత్యము నడిపించుము. దేవా, మా పక్షమున నీవే కార్యము సఫలము చేయుము. ప్రభువా, ఈ ఒక్కరోజు మాత్రమే కాకుండా, ఈ నూతన సంవత్సరమంతయు నీవు మాకు కాపరిగాను, మాకు తోడుగాను, మా కొండ, ఆశ్రయదుర్గముగా ఉండి, మమ్మును నడిపిస్తూ, మా కొరకు సమస్తమైన అద్భుతమైన కార్యములను జరిగించునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. ప్రభువా, క్షామ కాలములో మా ఆత్మను తృప్తిపరచుము మరియు నిత్యము ఉబుకుచుండు నీరు కట్టిన తోటవలె మమ్మును మార్చుము. దేవా, మేము వేయు ప్రతి అడుగులోనూ నీ నడిపింపును మరియు నీతో సన్నిహితంగా నడవడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ సమృద్ధికరమైన ఆశీర్వాదాలతో మమ్మును నింపుము మరియు నీ పరిపూర్ణ సమయంలో సమస్తమును చక్కగా మార్చుము. ప్రభువా, మమ్మును నిత్యము నడిపిస్తూ, మమ్మును ప్రతిదినము ఉత్తేజపరచుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.