నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఈ రోజు, 2 కొరింథీయులకు 9:8 వ వచనమును గురించి ధ్యానించుకుందాం, ఈ వచనం ఇలాగున చెబుతుంది, "మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు'' అని ఈ లేఖనము సెలవిచ్చుచున్నది. దేవుడు మీకు సమృద్ధిగా ఆశీర్వాదాలు ఇవ్వాలని మీ పట్ల కోరుకుంటున్నాడని గుర్తుంచుకోండి. కాబట్టి, నేడు దేవుడు మీ పట్ల సమస్త విధములైన కృపను విస్తరింపజేస్తాడు.
నా ప్రియులారా, బైబిల్‌లో కొలొస్సయులకు 1:10వ వచనమును చూచినట్లయితే, "ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు,'' ప్రకారము మీరు ప్రభువుకు తగిన విధంగా నడుచుకోవాలని, అన్ని విధాలుగా ఆయనను సంతోషపెట్టాలని, ప్రతి మంచి పనిలో ప్రతిఫలములను ఇచ్చుచూ, దేవుని గురించిన జ్ఞానంలో అభివృద్ధి చెందాలని ప్రోత్సహించుచున్నది. అవును, ప్రియులారా, మీరు ప్రభువుకు ఇష్టులుగా నడుచుకున్నప్పుడు, మీరు ఆయనను సంపూర్ణంగా సంతోపెట్టగలరు మరియు దేవుని యెదుట ఘనత గల పాత్రగా మీరు మార్చబడతారు. ఇంకను బైబిల్‌లో చూచినట్లయితే, రోమీయులకు 9:22-23లో, రెండు రకముల పాత్ర లను మనము చూడగలము. అవి ఒకటి, ఉగ్రతాపాత్ర మరియు రెండవది, కరుణాపాత్రలను గురించి ప్రస్తావించబడియున్నది: అదేమనగా, "ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్చయించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు ధీర్ఘశాంతముతో సహించిన నేమి? మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటముల యెడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక, అన్యజనములలో నుండియు ఆయన పిలిచిన మన యెడల, తన మహిమైశ్వర్యము కనుపరచవలెననియున్న నేమి?'' అని చెప్పబడినట్లుగానే, ఉగ్రతాపాత్ర నుండి కరుణాపాత్రగా మారుస్తాడు.
నా ప్రియులారా, ఉగ్రతాపాత్ర మనలను నాశనానికి నడిపిస్తుంది. కానీ మనము కరుణాపాత్రతో నింపబడినప్పుడు, మన జీవితాలలో దేవుని యొక్క మహిమైశ్వర్యమును కలిగి ఉంటాము. హల్లెలూయా! కరుణాపాత్రగా మారడం ఎంత అద్భుతమైన జీవితం కదా. ఇది జరగాలంటే, మనం ప్రభువునకు యోగ్యులముగాను నడుచుకోవాలి, ఆయనను పరిపూర్ణంగా ఇష్టపెట్టు పాత్రగా మనము జీవించాలి. అందుకే బైబిల్‌లో కీర్తనలు 23:5 ఇలాగున చెబుతుంది, "నా శత్రువుల యెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది'' అన్న వచనం ప్రకారం, మీ గిన్నె నిండి పొర్లుచున్నట్లుగా మీరు నడుచుకున్నప్పుడు, దేవుడు మిమ్మును పొంగిపొర్లుచున్న పాత్రగా మార్చబడతారు. బైబిల్‌లో చూచినట్లయితే, రోమీయులకు 2:7 ఇలా చెబుతుంది, " సత్‌క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్యజీవము నిచ్చును'' అన్న వచనము ప్రకారము, సత్‌క్రియలు చేయుటలో ఓపికగా కొనసాగుతూ, మహిమను, ఘనతను మరియు అక్షయతను వెదకు వారికి దేవుడు నిత్యజీవమును ఇస్తాడు.
అవును, నా ప్రియ స్నేహితులారా, ఇప్పుడు ప్రభువు మిమ్మును మహిమ గల పాత్రగా మహిమైశ్వర్యముతో నేడు ఆశీర్వదించాలని కోరుచున్నాడు. కనుకనే, దయచేసి మీ జీవితాన్ని ప్రభువు హస్తాలకు సమర్పిస్తారా? ఆలాగైతే, ఆయన హస్తములలో మీరు సర్వసౌందర్యవంతులుగా మారతారు. అందమైన వ్యక్తులుగా మిమ్మును మారుస్తాడు. ఆయన మిమ్మును మహిమతో నింపబడిన పాత్ర మిమ్మును మారుస్తాడు. దానిని మీరు పొందుకోవడానికి మనము కలిసి ప్రార్థన చేద్దామా? కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
మా ప్రశస్తమైన పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీవు మాకు అనుగ్రహించుచున్న అద్భుతమైన జీవితానికి మేము కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, ఈ మహిమైశ్వర్యముగల జీవితాల కొరకు నీకు వందనాలు. ప్రభువా, నీ బిడ్డలైన మమ్మును మహిమకు పాత్రులనుగా మరియు ఆశీర్వాదాల పాత్రలుగా మమ్మును మార్చుము. యేసయ్యా, అనవసరమైన విషయాలన్నిటిని మా జీవితాల నుండి తొలగించుము. దేవా, అనవసరమైన విషయాలకు ఒక ముగింపును దయచేయుము, ఇంకను మాలో ఉన్న అపరిశుద్ధమైన వాటిని తొలగించి, మాకు నూతన జీవాన్ని దయచేయుము. దేవా, ఉగ్రతా పాత్రగా ఉన్న మా జీవితాలను కరుణాపాత్రగా మార్చి, మహిమైశ్వర్యముతో మమ్మును నింపుము. ప్రభువా, నీ యెదుట నీకు సంతోషాన్ని కలిగించే పాత్రగా మమ్మును మార్చుము. దయచేసి మమ్మును ఆశీర్వాద పాత్రగా, నీ సన్నిధిని మోసుకొని వెళ్లుటకును మరియు నీ మహిమతో నింపబడిన పాత్రగా, నీ కృప కొరకు ఎన్నుకోబడిన పాత్రగా, పరిశుద్ధాత్మ శక్తితో పొంగిపొర్లుతున్న పాత్రగా మార్చుము. ప్రభువా, దయచేసి మా జీవితంలో నీకు ఆయాసరకమైన వాటిని తొలగించి, మమ్మును నూతన సృష్టిగా మార్చుమని యేసుక్రీస్తు మహిమగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.