నా ప్రియమైన స్నేహితులారా, ఈరోజు వాగ్దానంగా బైబిల్ నుండి కీర్తనలు 27:1వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, ఇలాగున చెబుతుంది, "యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?'' ప్రకారం ఈ లోకంలో మనలను భయపెట్టుచున్న అనేక విషయాలు ఉండవచ్చును. అవి మనకు తెలియని భయాలు, నిరాశ, మన ఆలోచనలలో, మన దృష్టిలోను బలమును కోల్పోవడం, దుష్టుల దాడులు, శరీర కోరికలు, అపరాధ భావనలు మరియు వైఫల్యాలు. తద్వారా, మనం చిన్న చిన్న వైఫల్యాలను ఎదుర్కొన్నప్పుడు కూడా, మన బలమంతా తరిగిపోయినట్లుగా మనకు అనిపించవచ్చును. కనుకనే, మనం ప్రతిసారీ ఓడిపోవాల్సిందే అని అనుకొనుటకు ప్రారంభిస్తాము.

అయితే, లేఖనాలలో పౌలు అనే భక్తుడు తాను బాధలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టుకున్నాడు. అతను ఎదుర్కొన్న ప్రతి దాడి తనను నిరంతరం కొరికే ముల్లులాగా, సాతాను దాడిలాగా అనిపించిందని మనకు స్పష్టంగా తెలియజేయబడినది. అతడు " ఈ ముల్లును తీసివేయుము'' అని ప్రభువును ముమ్మారు వేడుకున్నాడు. కానీ, ప్రభువు అతని దగ్గరకు వచ్చి, పౌలు, "అందుకు నా కృప నీకు చాలును, (యేసు యొక్క బలము)నీ బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన అతనితో చెప్పెను.'' ఇంకను దేవుడు పౌలుతో, 'నా కృప నీకు చాలును. పౌలు, నీ బలహీనతను ఎక్కువ చేసుకొనవద్దు. నీ లోపాలను గురించి చింతిస్తూ, భయపడుతూ నీ సమయాన్ని వృధా చేసుకొనవద్దు. అందుకు బదులుగా, యేసు అనే నేను లేచి నిన్ను నింపడానికి నీ సమయమంతా వెచ్చించు. జయించే శక్తి నా దగ్గర ఉన్నది. ప్రతిదానిలోనూ నిన్ను హెచ్చించేలా చేయగల శక్తి నా యొద్ద కలదు. కాబట్టి, నీలో నేను పైకి లేవడానికి నన్ను అనుమతించు' అని ప్రభువు సెలవిచ్చాడు. అందుకే పౌలు తరువాత, "కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను'' అని చెప్పగలిగాడు. మరియు ఆ క్షణం నుండి, అతను కేవలం అన్నిటికంటె అత్యధికమైన విజయమును పొందుకున్నాడు. అతని ద్వారా, ఈ లోకమంతయు దేవుని ప్రేమను పొందుకొనినది. నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు కూడా ఇటువంటి ప్రేమను మరియు నిరీక్షణను పొందుకొనవచ్చును. మీరు పౌలు వలె మార్చబడవచ్చును. మీరు సమస్తమును చేయుటకు సమర్థులుగా ఉంటారు.


కాబట్టి, నా ప్రియులారా, నేడు మీరు కూడా పౌలు వలె ప్రభువునకు మొఱ్ఱపెట్టండి, " ప్రభువా, నేను నిన్ను నాలో పైకి లేవనెత్తుతాను. నీవు వచ్చి నన్ను లేపుట కాదు; నేను నిన్ను నాలో పైకి లేవనెత్తుతాను '' అని చెప్పండి. ' ప్రభువా, నాలో జ్ఞానంతో, నాలో బలంతో, నాలో దయతో పైకి లేవబడాలి, నా జీవితానికి సంబంధించిన నిబంధనలతో పైకి లేవబడాలి. నాలో నుండి విజయంతో లేచి, నీవు మరణాన్ని గెలిచి, మృతులలో నుండి సజీవంగా లేచావు. కాబట్టి, నీవు నాలో నుండి పైకి లేచెదవు'' అని మీరు దీనిని నిరంతరం ప్రకటిస్తున్నప్పుడు, యేసు మీలో హెచ్చింపబడతాడు మరియు మీ భయాలన్నీ మరుగైపోతాయి. అయినను మిమ్మును ప్రేమించినవాని ద్వారా మీరు వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుకుంటారు.

అరవింద్ జయరామన్ అను సహోదరుని సాక్ష్యమును మీతో పంచుకోవాలని కోరుచున్నాను. అతను ఒకే ప్రయత్నంలో రెండు స్థాయిల చార్టర్డ్ అకౌంటెన్సీలో ఉత్తీర్ణుడయ్యాడు. కానీ అతను చివరి స్థాయికి ప్రయత్నించినప్పుడు, అతనికి బ్రెయిన్ ఫాగ్ వచ్చినది. కనుకనే, అతడు చదువులలో ఏకాగ్రత పెట్టలేకపోయాడు మరియు భయం అతనిని ఆవరించినది. అతనికి అత్యుత్తమ చికిత్స అందించబడినప్పటికిని, ఏ వైద్య చికిత్స కూడా అతనిని నయం చేయలేకపోయినది. నిరాశలో, నా జీవితాన్ని అంతము చేసుకోవాలని అతను అనుకున్నాడు. భవిష్యత్తు భయం అతనిని వేధించింది. కానీ దేవునికి అతని పట్ల ఒక ప్రణాళిక ఉన్నది. అతని తల్లిదండ్రులు యేసు పిిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమును గురించి విని అతనిని అక్కడికి తీసుకెళ్లారు. ప్రార్థనా యోధులు అతనితో కూర్చుని, యేసు ద్వారా అతనిని ఓదార్చారు మరియు యేసు అతని కొరకు ఏమి చేయగలడో వారు అతనికి తెలియజేశారు మరియు అతని కొరకు ఎంతో భారముతో ప్రార్థించారు. అప్పుడు అతని తల్లిదండ్రులు అతనిని యేసు పిలుచుచున్నాడు యౌవన భాగస్థునిగా నమోదు చేసుకున్నారు. ప్రతిరోజూ, మేము ప్రార్థనా గోపురములో యౌవన భాగస్థుల కొరకు ప్రార్థిస్తాము మరియు ఒక కుటుంబంగా, మేము వారిని ప్రార్థనలో పైకి లేవనెత్తాము. యౌవన భాగస్థులు ఏ కానుకలు అందించినా, యేసు పిలుచుచున్నాడు పరిచర్య ద్వారా లక్షలాది మందికి ఉచితంగా పరిచర్య చేయవలెనని మేము ప్రార్థించుచున్నాము. మరియు ప్రభువు ఆ ఆశీర్వాదాలను తీసుకొని యౌవన భాగస్థుల మీద మరల ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు, వారి జీవితాలను బహుగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి, అరవింద్‌ను యౌవన భాగస్థునిగా నమోదు చేశారు. అప్పటి నుండి అతను బైబిల్ చదవడం మరియు యేసును ప్రార్థించడం ప్రారంభించాడు. అద్భుతమైనది అతని జీవితంలో ఏదో జరిగింది. యేసు పిలుచుచున్నాడు పత్రికలో ఆశీర్వదించబడిన వ్యక్తుల యొక్క సాక్ష్యాలను అతను చదువుతున్నప్పుడు, విశ్వాసం అతని హృదయాన్ని నింపింది. అతను మెల్లగా కోలుకున్నాడు. ఆత్మహత్య ఆలోచనలు అతనిలో నుండి మరుగైపోయాయి. అతను తన దృష్టిని తిరిగి పొందుకున్నాడు, సిఎ ఫైనల్ పరీక్షలు రాశాడు మరియు గొప్ప విజయాన్ని సాధించాడు! నేడు, అతను చార్టర్డ్ అకౌంటెంట్‌గా ఉన్నాడు. " యెహోవా నాకు వెలుగును రక్షణయునై యున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?'' అని చెప్పగలిగాడు. ఆలాగుననే, యేసు మీకు కూడా సహాయం చేస్తాడు. కనుకనే, నేడు మీ జీవితాన్ని ఆయనకు అప్పగించండి. ఆయన మీలో పైకి లేవనెత్తబడడానికి అనుమతించండి. ఆయనను స్తుతించండి. ఎందుకంటే, ఆయన మీ జీవితానికి ప్రభువు. ఇక మీదట మీరు కాదు, క్రీస్తే మీలో జీవిస్తాడు. ఇకమీదట మీ విజయం కాదు. మీలో యేసు మాత్రమే, విజయం నిచ్చే నిరీక్షణగా ఉన్నాడు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును విజయవంతులనుగా చేసి దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, నీవే మా ప్రాణదుర్గము, మా ఆశ్రయం మరియు మా బలం. కనుకనే, దేవా, భయం మరియు వైఫల్యం మమ్మును అధిగమించడానికి ప్రయత్నించినప్పుడు, నీ కృప మాకు చాలునని నేడు నీవు మాకు గుర్తు చేయుము. యేసయ్యా, నీవు పౌలును బలపరచినట్లుగానే, మా బలహీనతలో నీ శక్తి పరిపూర్ణం చేయబడునట్లు చేయుము. దేవా, మా పోరాటాలను గొప్పగా చేయకుండ, మా జీవితంలో నిన్ను గొప్పగా చేయుటకు మాకు నీకృపను అనుగ్రహించుము. ప్రభువా, మాలో నీవు పైకి లేచి నీ జ్ఞానం, బలం మరియు అనుగ్రహంతో మమ్మును నింపుము. దేవా, నీ సన్నిధి మా సందేహాలను, మా భయాలను మరియు శత్రువు యొక్క ప్రతి దాడిని జయించునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, మా చింతలను నీకు అప్పగించుచుచున్నాము. మా జీవితంలోని ప్రతి ప్రాంతంలో నీ నామం మహిమపరచబడునట్లుగా చేయుము. దేవా, నీవు మాలో హెచ్చింపబడాలి, మేము తగ్గించబడాలి. ప్రభువా, నీ బలమును మాకు దయచేయగలవని మేము నిన్ను పరిపూర్ణముగా నమ్ముచున్నాము. దేవా, మమ్మును ప్రేమించిన నీ ద్వారా మేము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుకొనునట్లుగా చేయుమని యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.