నా ప్రియ స్నేహితులారా, ఈ నూతన సంవత్సరములో నేను అడుగుపెట్టుచున్నప్పుడు ఎంతగానో ఉత్సాహభరితుడను అయ్యాను. దేవుడు మన జీవితాలలో ఆవిష్కరించబోయే చక్కటి విషయాల కొరకు నిరీక్షణతో నిండిపోయాను. అందుకే నేడు బైబిల్ నుండి కీర్తనలు 91:11వ వచనమును మనకు వాగ్దానముగా చేయుచున్నాడు. ఆ వచనము, "నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును'' ప్రకారము దేవుని ప్రజల నిమిత్తము ఆయన వారిని కాపాడుట కొరకై తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. కనుకనే, మీరు విచారించకండి. అవును, ఆయన తన దూతల చేత మిమ్మును భద్రపరుస్తాడు.

నా ప్రియులారా, దేవుని వాక్యములో విభిన్నమైన మార్గములలో దేవుడు ఈలాగున చేసినట్లుగా మనము చూడగలము. దేవుడు దీనిని అసాధారణ మార్గాలలో ఎలా చేశాడనే దానికి ఉదాహరణలతో బైబిల్‌లో సమృద్ధిగా కలవు. అనేక ఫర్యాయములు ఇశ్రాయేలు దేశముల పక్షమున పోరాడడానికి దేవుడు తన దూతలను పంపించియున్నాడు. దేవదూతలు వారి కంటే ముందుగా వెళ్లి, దేవుని ప్రజల కొరకు యుద్ధాలు చేసి విజయాలు సాధించారు. ఆలాగుననే, దైవసేవకుడైన ఏలీయా ఎంతగానో నిరాశలో ఉండి విశ్వాసమును కోల్పోవుచున్న సమయములో కూడా, భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా క్షీణించినట్లు గుర్తించాడు. కనుకనే, దేవుడు అతని విశ్వాసాన్ని బలపరచడానికి ఒక దూతను పంపించాడు. తన దేహమును దేవుని కొరకు పరుగులు తీయునట్లుగా దేవుడు అతనిని తన దూతల చేత బలపరచాడు. అతని శరీరాన్ని పునరుద్ధరించా డు మరియు ముందుకు సాగడానికి అతనిని సిద్ధం చేశాడు. అతడు తన విశ్వాసము ను కోల్పోకుండా, దేవుడు అతని మార్గములను బలపరచాడు. దేవుడు ఏలీయా మార్గాన్ని కాపాడాడు, అతను నిరీక్షణ కోల్పోకుండా చూసుకున్నాడు.

అదేవిధముగా, యేసు ప్రభువు తల్లియైన మరియకు ప్రధానము చేయబడిన యోసేపు కూడా వారి యొక్క వివాహమునకు ముందుగానే, మరియ గర్భమును ధరించియున్న సంగతిని తెలిసికొన్నప్పుడు, అతడు ఆమెను వివాహము చేసుకొనకూడదని నిర్ణయించుకున్నప్పుడు, ఇది సామాన్యమైన బిడ్డకాదు అని తెలియజేయడం ద్వారా ఆ మార్గములో యోసేపును కాపాడడానికొరకై దేవుడు తన దేవదూతను పంపించాడు. ఇంకను, ' ఆమె నా ఆత్మ ద్వారా గర్భమును ధరించినది. అది పరిశుద్ధమైన బిడ్డ, కనుకనే, నీవు మరియను వివాహము చేసుకొని భవిష్యత్తులో మీరు కుటుంబముగా జీవించండి' అని దేవదూత యోసేపునునకు ఆజ్ఞాపించాడు. ఆలాగుననే, కుటుంబముగా వారి యొక్క దైవీకమైన పిలుపును అనుసరించమని అతనిని ప్రోత్సహించెను. ఆలాగుననే, దేవుడు యోసేపు మార్గమును భద్రపరచాడు.

నా ప్రియులారా, కొన్నిసార్లు మనలను భద్రపరచడానికి మరియు బలపరచడానికి దూతలు దర్శనములో ప్రత్యక్షమవుతారు. కొన్ని ఫర్యాయములు బైబిల్‌లో ఉన్నట్లుగానే, దేవుడు స్వయంగా దూతవలె మన యొద్దకు వస్తాడు. కొన్ని ఫర్యాయములు మనకు సహాయము చేయుట కొరకై మానవాళిని దూతల వలె మన యొద్దకు పంపిస్తాడు. అందుకే, మీ మార్గములన్నిటిలో మిమ్మును కాపాడుటకు ఆయన మిమ్మును గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఆయన మీ పాదమును త్రొటిల్లనియ్యడు. అయినప్పటికిని, వీటన్నింటి ద్వారా, మీ మార్గాలన్నిటిలోను మిమ్మును కాపాడమని మీ గురించి తన దేవదూతలకు ఆయన ఆజ్ఞాపిస్తానని సెలవిచ్చిన ఈ మార్పులేని వాగ్దానం మనము కలిగియున్నాము. కనుకనే, ఈ వాగ్దానము కొరకై ఆయనను స్తుతించి, పొందుకుందామా? నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును సురక్షితముగా కాపాడి భద్రపరచును గాక.

ప్రార్థన:
ప్రేమగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, మేము నూతన సంవత్సరంలోనికి అడుగుపెడుతున్నప్పుడు, నీ వాగ్దానాల పట్ల మాకు నమ్మకము కలిగించినందుకై నీకు కృతజ్ఞతలు. ప్రభువా, మమ్మును కాపాడుమనియు మరియు మా మార్గాన్ని రక్షించమని నీ దేవదూతలను ఆజ్ఞాపించినందుకై నీకు వందనాలు. దేవా, నీవు మమ్మును భద్రపరచే దేవుడవై యున్నందుకు నీకు వందనాలు. దేవా, మా మార్గములో తప్పిపోకుండా, నీవు మమ్మును గమనించుచున్నావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, నీ దూతలను మా నిమిత్తము పంపించుచున్నందుకై నీకు వందనములు. దేవా, మా జీవిత పోరాటల ద్వారా మేము దారి తప్పిపోకుండా మరియు మా విశ్వాసాన్ని కోల్పోకుండా నీ దూతలను మా యొద్దకు పంపించి, మమ్మును సరైన మార్గములో నడిపించుము. ప్రభువా, నీవు ఏలీయాకు చేసినట్లుగానే మా విశ్వాసాన్ని బలపరచుము మరియు నీవు యోసేపును నడిపించినట్లుగానే మమ్మును కూడా నడిపించుము. యేసయ్యా, నీ ఏర్పాటుపై నమ్మకం ఉంచడానికి మాకు సహాయం చేయుము. దేవా, మమ్మును చుట్టుముట్టిన నీ యొక్క సన్నిధికి మరియు మా పట్ల బాధ్యత వహిస్తున్న దేవదూతల సమూహమును బట్టి నీకు కృతజ్ఞతలను తెలియజేయుచున్నాము. ప్రభువా, నీవు మా కాలు జారిపోకుండునట్లుగా, మా పాదములను చక్కగా నిలువబెట్టుము. దేవా, నీ కృప కొరకు మేము మా హృదయ పూర్వకంగా స్తుతించునట్లుగా చేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.