నా ప్రియులారా, దీనిని జ్ఞాపకముంచుకోండి: యేసు నామమున మీరేమి అడిగినను, దానిని మీరు పొందుకొనెదరు. దేవుని యొద్ద నుండి ఏమి అడగవలెనో తెలుసుకొనుటకు పరిశుద్ధాత్మ మీకు సహాయము చేయును. లేఖనముల ప్రకారం, పరిశుద్ధాత్మ మీకు సహాయకుడైయున్నాడు. ‘‘అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు’’ అని రోమా 8:26 సెలవిచ్చుచున్నది. మీరు సవాళ్లను లేక అనిశ్చయతను ఎదుర్కొనుచున్నప్పుడు, దేవుని చిత్తమును ఏవిధంగా గుర్తించగలరు? పరిశుద్ధాత్మ మీ వద్దకు వచ్చి, ఆయన చిత్తమును మీకు చూపించును. దేవుని చిత్తము బయల్పరచబడవలెనని ఎప్పుడైతే మీరు వెదకుదురో, అప్పుడే దానిని మీరు తెలుసుకొనునట్లుగా ఆయన చేస్తాడు. ఎవరిని పెండ్లి చేసుకోవలెను, ఏ ఉద్యోగము చేయవలెను, ఏ కోర్సు చదవవలెను మరియు ఎక్కడ పని చేయవలెను అనే విషయములలో సరిగ్గా వివేచించుటకు నేడు ఆయన కృపను మీరు కలిగియున్నారు.
నేటి వాగ్దానము, లూకా 12:12 వచనము నుండి తీసుకొనబడినది, ‘‘మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పును’’. కొన్ని సమయములలో ఏమని ప్రార్థన చేయాలో కూడ మీకు తెలియకపోవచ్చును, కానీ ఏవిధంగా ప్రార్థన చేయవలెనని పరిశుద్ధాత్మ మీకు బోధించును. మీ అధికారులతోను లేక విచారణ కమిషన్‌తోను లేక బోర్డు మీటింగ్‌లోను లేక కుటుంబ విషయములతోను వ్యవహరించుచున్నప్పుడు, పరిశుద్ధాత్మ మీ ద్వారా మాటలాడి, మిమ్మల్ని నడిపించును. నేడు, పరిశుద్ధాత్మ మీలో నింపబడుటకు సిద్ధముగా ఉన్నాడు మరియు యేసు నామమున ఆయన కృప మీ మీదికి దిగిరావలెనని నేను ప్రార్థన చేయుచున్నాను. ఇతరులను కూడ నడిపించునట్లుగా దేవుడు తన ఆత్మతో మిమ్మల్ని అభిషేకించును.
స్ఫూర్తిదాయకమైన ఒక సాక్ష్యమును ఇక్కడ చూడండి. విశాఖపట్నమునకు చెందిన సహో॥ ప్రసన్న కుమార్‌గారు తన కథను మాతో పంచుకొన్నారు. చాలా కాలముగా ఆయన ఒక మంచి ఉద్యోగము కొరకు వెదకుచున్నారు మరియు రాజమండ్రిలో నిర్వహించబడిన యేసు పిలుచుచున్నాడు కూటములలో పాల్గొన్నారు. ఆ కూటములో ప్రార్థన సమయములో, నేను, ‘‘ప్రభువా, ఉద్యోగములేని వారు, రేపు మరల ఈ కూటమునకు వచ్చినప్పుడు, వారి చేతిలో ఒక ఉద్యోగము ఉండవలెను’’ అని ప్రార్థన చేశాను. అశ్చర్యకరముగా, అదే రాత్రి, బాంబేలోని ఐ.ఐ.టి. ఆస్పిరెంట్స్ కోచింగ్ సెంటర్ నుండి, సంవత్సరమునకు 35 లక్షల జీతముతో ఒక ఉద్యోగ అవకాశమును అందించుచు, అతనికి ఫోన్ వచ్చింది. అది అతను ఊహించని విధంగా జరిగింది. అది చాలా గొప్ప అవకాశము అయినప్పటికీ, దానిని అంగీకరించవలెనా లేదా అనే సందేహం అతనికి కలిగింది. మరుసటి రోజు, భాగస్థుల కూటములో, నేను సందేశమును అందించుటకు ముందుగా, ‘‘ఇప్పటి వరకు మీరు మీ యెదుట నున్న ఉద్యోగమును అంగీకరించవలెనా లేదా అనే సందేహముతో ఉన్నారు. కానీ దేవుడు మీకు సలహా ఇచ్చును మరియు సూచనలిచ్చును. మీరు వెళ్లవలసిన మార్గమును మీకు చూపించును’’ అని ప్రవచనాత్మకముగా చెప్పాను. వెంటనే, అతను ఆ ఉద్యోగమును అంగీకరించవలెనని నిర్ణయించుకోవాలని అనుకొన్నాడు మరియు అతను ఆ కంపెనీలో చేరాడు. నిజంగా ఇది, దేవుని ఆత్మ చేత నడిపించబడిన ఒక గొప్ప ఆశీర్వాదము!
నా ప్రియులారా, పరిశుద్ధాత్మను బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించండి. ప్రస్తుతము మీరు ఉద్యోగము కొరకు వెదకుచున్నట్లయితే, మీరు ఊహించినదాని కంటె అధికముగా ఉదారమైన జీతమును అందించే ఒక మంచి ఉద్యోగమును దేవుడు మీకు అనుగ్రహించునని విశ్వసించండి. యేసు నామమున ఈ ఆశీర్వాదము మీ మీదికి దిగిరావలెనని నేను ప్రార్థన చేయుచున్నాను.
ప్రార్థన:
ప్రియ తండ్రీ, నా జీవితము కొరకు నీ యొక్క చిత్తమును నాకు తెలియపరిచెదవనే సత్యమును నాకు బోధించినందుకు నీకు స్తోత్రములు. నీ చిత్తమును గూర్చిన జ్ఞానముతో నేను నింపబడవలెనని నీవు ఆశించుచున్నావు. నా బలహీనతలన్నిటి యందు నాకు సహాయము చేయుటకును మరియు నాకు మంచి వివేచనను అనుగ్రహించుటకును అమూల్యమైన పరిశుద్ధాత్మను నా కొరకు పంపించినందుకై నీకు స్తోత్రములు. ఇప్పుడు నేను నా జీవితములోని చిన్న చిన్న విషయములతో సహా నా జీవితమంతటిని నీ యొక్క ప్రేమగల హస్తములకు సమర్పించుకొనుచున్నాను. దయతో నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపుము. నా జీవితములో క్రియ చేయుటకు నేను పరిశుద్ధాత్మను అనుమతించుచున్నాను గనుక, సమస్త సత్యమునందు ఆయన నన్ను చక్కగా నడిపించుననియు మరియు నీ యొక్క ఉన్నతమైన ప్రణాళికలను నాకు బయల్పరచుననియు నేను విశ్వసించుచున్నాను. నా జీవితములోని ప్రతి కార్యమునందు, నీ స్వరమును వినుటకును మరియు నీ నడిపింపును అనుసరించుటకును నీ కృపను, బలమును నాకు అనుగ్రహించమని నేను ప్రార్థన చేయుచున్నాను. నా ఆశీర్వాదముల వైపు నన్ను నడిపించుటకు నాకు తోడై యున్నందుకై ప్రభువా నీకు స్తోత్రములు చెల్లించుచు, యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రీ, ఆమేన్.