నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాము.ఈ దినము యోహాను 14:14వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును'' అన్న వచనము ప్రకారం, యేసుక్రీస్తు నామమున మీరు ఆయనను ఏమి అడిగినను ఆయన మీకు చేస్తాడని చెప్పబడియున్నది. మరియు 1 యోహాను 5:14వ వచనములో చెప్పబడిన ప్రకారము, "మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలంకించునని మన మెరిగిన యెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము '' అన్న వచనము ప్రకారం, దేవుడు మన మనవిని ఆలకిస్తాడని మనము గుర్తించుకోవాలి.
కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు ప్రార్థనలో ఏది అడిగినను, ఆయన నామములో మీరు ప్రార్థన చేసి అడగవలెను. యేసుక్రీస్తు నామములో మీకు ఈ ఆశీర్వాదము కావాలని, మీరు ప్రార్థనలో అడగవలెను. నిర్గమకాండము 6:3వ వచనములో ప్రభువు ఈవిధంగా సెలవిచ్చుచున్నాడు, "నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడ లేదు'' ప్రకారం, మన దేవుడు ఎంతో గొప్ప దేవుడై యున్నాడు. కనుకనే, 'ప్రభువా, నా మీద కృప చూపించుమని' ఆయన నామమున అడగవలెను. ఆయన సర్వశక్తివంతుడైన దేవుడు. కాబట్టి, ఆయన నామమున మీరు ఏది అడిగినను, ఆయన దానిని చేస్తాడు.
బైబిల్‌లో న్యాయాధిపతులు 13:17-18వ వచనములను మనము చదివినట్లయితే, సమోస్సును అను ఒక వ్యక్తి ఉండేవాడు. సమోస్సును కాదు గానీ, అతని తండ్రియైన మానోహ, దేవునిని ' నీ పేరు ఏమిటి?' అని అడిగినప్పుడు, ఆయన, ' నా నామము ఎంతో అద్భుతమైనదని' ప్రభువు సెలవిచ్చియున్నాడు. అందుకే బైబిల్‌లో చూడండి, "మానోహ నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించునట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా, యెహోవా దూత నీ వేల నా పేరు అడుగుచున్నావు? అది చెప్పశక్యముకానిదనెను.'' అవును, నా ప్రియ స్నేహితులారా, ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఇంకను యోహాను 16:24వ వచనములో చెప్పబడినట్లుగానే, "ఇది వరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును'' ప్రకారం సమస్తమును ఆయన పేరట మీరు అడగవలెను. అప్పుడు మీరు ఆయన యొద్ద నుండి సమస్తమును పొందుకొనినప్పుడు, మీ సంతోషమును పరిపూర్ణమగుతుంది.
ఇంకను, బైబిల్‌నందు మత్తయి 7:11లో చూచినట్లయితే, " పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యావుల నిచ్చును'' ప్రకారం, మీరు ఏది అడిగినను ప్రభువు మంచి యీవులన్నిటిని మీకు నిశ్చయముగా అనుగ్రహించును. అదియుగాక, ఆయన మంచితనం మరియు కృపాక్షేమములు మన బ్రతుకు దినములన్నిట మనలను వెంబడిస్తుంది మరియు ఇంకను మీరు అడిగి ఊహించినదానికంటే, మీ అవసరతలన్నిటిని చక్కటి మార్గములో మీకు తీరుస్తాడు. ఆలాగుననే, ఎఫెసీయులకు 3:20వ వచనములో కూడ మనము దానినే చదువుతాము. ఇప్పుడే యేసు నామమున అడుగుదామా? ఆలాగున నేడే మీరు యేసు నామమున దేనినైనను అడిగినట్లయితే, తప్పకుండా, ఆయన మీకు అనుగ్రహించి, మీ సంతోషాన్ని పరిపూర్ణము చేసి, మిమ్మును ఆశీర్వదిస్తాడు. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
అమూల్యమైన మా ప్రేమగల పరమ తండ్రీ, నీ వాక్యము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, నీ యొద్దకు వచ్చి, నీ యందు గుప్తములై యున్న నీ దీవెనలన్నియు మేము పొందుకొనవలెనని ఆశించుచున్నాము. 'అడుగుడి మీకియ్యబడును' అని వాగ్దానము చేసియున్నావు, ఆలాగుననే, మేము నీ నామమున అడుగుచున్నాము. ప్రభువా, మా అవసరతలన్నిటిని తీర్చమనియు మరియు మా వ్యాధులన్నియు స్వస్థపరచమని మేము కన్నీటితో యేసు నామమున అడుగుచున్నాము. దయతో దేవా, మా పట్ల నీవు వాగ్దానము చేసినట్లుగానే, మా అవసరతలన్నిటిని తీర్చుము మరియు మా వ్యాధులన్నిటిని స్వస్థపరచుము. యేసయ్యా, ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడవు, కనుకనే, నీ బిడ్డలైన మా మొర్రలను ఆలకించుము మరియు మా అవసరతలన్నిటిని తీర్చుము. మా హృదయములో ప్రార్థించినదానికంటెను, అధికముగా, అద్భుతముగా అనుగ్రహించుము. దేవా, ఇదిగో మేము నీ యెదుట సాష్టాంగ పడుచున్నాము, మా విన్నపములను నీకు తెలియజేయుచున్నాము. దేవా, నీవు మా ప్రదాత, మా సమాధాన కర్తవు, మా స్వస్థపరచే దేవుడు, మా విమోచకుడవు మరియు మా రక్షకుడవు. కాబట్టి, నేడు నీవు ప్రార్థనకు జవాబిచ్చి, దయచేసి మా మొరను ఆలకించి, మా కష్టాల నుండి మమ్మును విడిపించి, మా తలను పైకి లేవనెత్తుమని సమస్త మహిమను నీకే చెల్లించుచు యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.