నా ప్రియ స్నేహితులారా, నేడు మీకు శుభములు తెలియజేయుటలో నాకు ఎంతో ఆనందాన్ని కలిగించుచున్నది. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఆదికాండము 22:17వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను; నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచు కొందురు'' ప్రకారం అవును ప్రియులారా, ప్రభువు మిమ్మును నిశ్చయముగా ఆశీర్వదించి, విస్తరింపజేస్తానని వాగ్దానము చేయుచున్నాడు. కాబట్టి, భయపడకండి.

నా ప్రియులారా, నేడు మీలో అనేకులు గర్భఫలము కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తూ వేచియుండవచ్చును? అనేక సంవత్సరాలుగా ప్రభువు మంచి వరములతో మిమ్మును దీవించాలని కనిపెడుతూ, ప్రార్థిస్తూ ఉండవచ్చును. ఇంకను మీ చుట్టు ఉన్నవారు చక్కని కుటుంబాన్ని మరియు బిడ్డలను కలిగి ఉండుట చూచి, మీరు కూడ తల్లిదండ్రులు కావాలని కనిపెట్టుచున్నారేమో? ప్రజలు వచ్చి, మిమ్మును ఈ విషయములో ప్రశ్నించినప్పుడు, హృదయములో ఎంతో వేదన కలుగుచుండవచ్చును. మరికొంతమంది, మీ జీవితములో ఇటువంటి సంతోషాన్ని ఎప్పుడు కలిగి ఉంటావు? అని ప్రశ్నించవచ్చును. తద్వారా మీరు అందరి చేత తృణీకరింపబడియున్నారేమో? సంతానము లేకుండా మీరు అవమానమును ఎదుర్కొంటున్నారేమో? ఈ కారణముగా, ఇంటిని విడిచి బయటకు కూడ వెళ్లలేకపోతున్నారేమో? లేక మీలో అనేకులు జీవిత భాగస్వామి కొరకు కనిపెడుతూ, మీ కుటుంబ జీవితాన్ని ప్రారంభించడానికై వేచి యున్నారేమో? లేక మీ ఉద్యోగములో, వ్యాపారములో, మీ జీవితములో ఎటువంటి ఎదుగుదలను మీరు చూడలేకపోవుచున్నారేమో? మీ చదువులలో, మీ పరీక్షలలో మంచి ఫలితాలనే మీరు చూడలేకపోవుచున్నారేమో? అయితే, కలవరపడకండి.

ఇంకను నా ప్రియులారా, 'నా జీవితమంతా ఇక అయిపోయినది అన్నట్లుగా భావిస్తున్నారేమో? నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, భవిష్యత్తులో నేను ఏమి చేయాలి? నా జీవితములో నేను ఏమి చేయబోవుచున్నాను,' అని మిమ్మును మీరు ప్రశ్నించుకుంటున్నారేమో? ఆ పరిస్థితిలో ఎటువంటి నిరీక్షణ ఆధారము లేనప్పటికిని, మీ జీవితములో ఇది జరుగుతుంది, మీ జీవితములో ఇది జరుగుతుంది అనడానికి ఎటువంటి ఆధారము లేనప్పటికిని, వైద్యులు ఒకవేళ మిమ్మును ఇది అసాధ్యము అని అన్నారేమో? మీ బోధకులే మిమ్మును తృణీకరించియున్నారేమో? మీరు ఎవరినైతే, చాలా నమ్మారో, వారు మిమ్మును నిరాకరించారేమో? అయితే, ప్రభువు అబ్రాహాము శారాకు చేసిన వాగ్దానము ప్రకారం సమస్తమును వారి పట్ల నెరవేర్చాడు. ఆకాశ నక్షత్రముల వలె వారి యొక్క సంతానమును విస్తరింజేసాడు. ఇసుకవలె లెక్కింప శక్యము కానంతగా దేవుడు తన సంతానమును దీవించి విస్తరింపజేస్తాడు.

ఆలాగుననే, నా ప్రియ స్నేహితులారా, నేడు మిమ్మును కూడ దీవించి, విస్తరింపజేస్తాడు. అది జరుగుతుంది అని ఎటువంటి ఆధారము లేనప్పటికిని, ప్రభువు వాగ్దానము చేసినదంతయు నిశ్చయముగా సమస్తమును మీ పట్ల జరిగిస్తాడు. ఒకవేళ మీరు ఒంటరిగా ఉన్నారని చింతించుచుండవచ్చును, కానీ, మిమ్మును దీవించి, విస్తరింపజేస్తాడు. ఆయన మిమ్మును తన మంచితనమునకు సాక్షులుగా నిలబెట్టుకుంటాడు. హెబ్రీయులకు 6:14-16వ వచనములలో ఈలాగున వ్రాయబడియున్నది, "దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటె ఏ గొప్పవానితోడు అని ప్రమాణము చేయలేకపోయెను. గనుక తన తోడు అని ప్రమాణముచేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానఫలము పొందెను.'' ఆలాగుననే, నిశ్చయముగా, మిమ్మును కూడ ఆశీర్వదించును. ఆలాగుననే, మీరు ఎంతకాలము నుండి వేచియున్నటువంటి గర్భఫలమును ప్రభువు మీకును అనుగ్రహిస్తాడు. మీ కుటుంబ జీవితమును ప్రభువు దీవిస్తాడు. మీరు దేని కొరకైతే, పని చేయబోవుచున్నారో? ఆ పనిని ప్రభువు దీవించి, విస్తరింపజేస్తాడు. ఈ గొప్ప వరమును ప్రభువు యొద్ద నుండి మనము పొందుకుందామా? అదేవిధంగా నేటి వాగ్దానము ద్వారా ప్రభువు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
దీవెనలకు కర్తవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసయ్యా, ఈ రోజు నీవు మాకిచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనాలు. దేవా, నిశ్చయముగా మమ్మును దీవించి, విస్తరింపజేయుము. గర్భఫలము కొరకు కనిపెట్టుచున్న మా జీవితాలలో ఇప్పుడే ఒక చక్కటి బిడ్డను దయచేసి మమ్మును మరియు మా ప్రియులైన వారిని ఆశీర్వదించుము. ప్రియమైన ప్రభువా, నీవు మమ్మును ఆశీర్వదించాలని మరియు మమ్మును విస్తరింపజేయాలని నీవు చేసిన వాగ్దానము ప్రకారము, మా జీవితములో అద్భుతాలను జరిగించుము. దేవా, మా జీవితంలో నీ యొక్క మంచితనానికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. సమస్త శుభాలకూ కర్తవు ఇప్పుడు కూడా, ప్రభువా, నీవు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడవని నమ్ముతూ మేము నీకు సమీపముగా వచ్చుచున్నాము. దేవా, మా పరిస్థితులు మాకు వ్యతిరేకంగా అనిపించినప్పటికిని, నీవు మా జీవితంలో గొప్ప అద్భుతాలు చేయగలవని మేము ఇప్పటికిని నిన్ను నమ్ముచున్నాము. ప్రభువా, వెలిచూపుతో కాకుండా విశ్వాసంతో నడవడానికి మరియు జీవితంలోని ప్రతి క్షణంలో నీ మహిమను అనుభవించడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా జీవితంలో ఒక మంచి పనిని ప్రారంభించా వని మా హృదయంతో విశ్వసిస్తున్నాము మరియు నీవు వాగ్దానం చేసినట్లుగా నే మమ్మును ఆశీర్వదించడానికి మరియు మమ్మును విస్తరింపజేయడానికి ఎంతైన నీవు నమ్మగదినవాడని మేము నీ యందు ఉంచిన నమ్మకమును బట్టి, మా పట్ల సమస్త గొప్ప కార్యములను జరిగించుమని యేసుక్రీస్తు అద్భుతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.