నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కొలొస్సయులకు 2:6,7వ వచనములను మనము ధ్యానించుకొనబోవుచున్నాము. ఆ వచనములు, "కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు, ఆయన యందుండి నడుచుకొనుడి'' అని చెప్పబడిన ప్రకారం, యేసులో కట్టబడుట మరియు క్రీస్తులో వేరుపారి ఉండుట ఎంత ధన్యకరమైన జీవితము కదా! ఇంకను ఆయనలో దాగి వుండడం నిజంగా అంతకంటె గొప్ప ధన్యకరమైన జీవితం.
అయితే, క్రీస్తులో ఎలాగున వేరుపారినవారై యుండాలి? అని మనము చూచినట్లయితే, లూకా సువార్త 6:47వ వచనములో యేసు ఈలాగున మనకు జవాబిచ్చుచున్నాడు. చూడండి, "నా యొద్దకు వచ్చి, నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలెనని యుండి లోతుగా త్రవ్వి, బండ మీద పునాది వేసినవాని పోలి యుండును. వరద వచ్చి ప్రవాహము ఆ యింటి మీద వడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడినందున దాని కదలింపలేక పోయెను'' ప్రకారం, అలాంటి వారు తమ ఇంటిని స్థిరమైన బండ మీద పునాది వేసి కట్టబడిన వారిని పోలి ఉంటారని ఆయన స్పష్టముగా తెలియజేయుచున్నాడు. ఆయన మాట వినడం ద్వారా మరియు దానిని ఆచరణలో పెట్టడం ద్వారా మాత్రమే మనం క్రీస్తులో లోతుగా వేరుపారగలం. బైబిల్‌లో చూచినట్లయితే, లూకా 6:48వ వచనములో చెప్పినట్లుగానే, మనం ఇలాగున చేసినప్పుడు, ఆయన మనలను బలపరుస్తాడు. బండ మీద కట్టబడిన ఇల్లువలె, జీవితపు తుఫానులచే మనం కదిలించబడకుండా స్థిరంగా నిలిచి ఉండునట్లుగా చేస్తాడు.
ఇంకను నా ప్రియులారా, బైబిల్‌లో యెషయా 61:3వ వచనములో ఈలాగున చెప్పబడియున్నది, "యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును '' ప్రకారం, మనం క్రీస్తులో వేరుపారినవారమైనప్పుడు, మనం "నీతి అను మస్తకి వృక్షములుగా'' అవుతాము అని చెప్పబడియున్నది. ఈ చెట్లు క్రీస్తులో లోతుగా నాటబడి, ఆయన నుండి నిత్యము పోషింపబడుచున్నాయి. గలతీయులకు 5:22-23 చెప్పినట్లుగానే, ఈ వృక్షములు క్రమంగా ఫలాలను అనుగ్రహిస్తాయి, ఆత్మ ఫలాలను ఉత్పత్తి చేస్తాయి. మనం క్రీస్తులో బలపడి, ఈ బలమైన వృక్షములవలె మారినప్పుడు, మన చుట్టూ ఉన్న వారికి విశ్రాంతి మరియు ఆశ్రయం కల్పిస్తాము.
నా ప్రియులారా, మొదట మనము క్రీస్తులో వేరుపారినవారమై యుండాలి. రెండవదిగా మనము క్రీస్తులో కట్టబడియుండాలని బైబిల్ చెబుతుంది. అందుకే బైబిల్‌లో ఎఫెసీయులకు 2:20 వ వచనములో ఈలాగున సెలవిచ్చుచున్నది, "క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాది మీద మీరు కట్టబడియున్నారు.'' అవును, మనము ఆయనలో లోతుగా వేరుపారినప్పుడు మరియు నిత్యము నిలిచి యుండు కట్టడము వలె మనము ఉంటాము. దీని కొరకు, మనం కృతజ్ఞతతో నింపబడి ఉండాలి, అందుకే మనం కృతజ్ఞతతో విస్తరింపబడతాము అని కొలొస్సయులు 2:7 చెబుతుందిలా, " మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతా స్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు, ఆయన యందుండి నడుచుకొనుడి'' అని వ్రాయబడియున్నది. దేవుడు మనకు క్రీస్తుపై గొప్ప విశ్వాసాన్ని అనుగ్రహించి యున్నాడు మరియు మనం ఈ లోకములో ఒక పాదాన్ని మరియు మరొక పాదమును క్రీస్తులో ఉంచి, ఆయనలో వేరుపారి ఉండలేము కదా. కనుకనే, ఆయనలో మాత్రమే మనం సంపూర్ణంగా వేరుపారినవారమై కట్టబడాలి. ఈ క్షణం నుండి క్రీస్తులో లోతుగా వేరుపారునట్లుగా మరియు కట్టబడేలా ప్రభువు మిమ్మును అనుమతిస్తాడు. అంతమాత్రమే కాదు, ఆయన మిమ్మును బలవంతులనుగా చేయును గాక! కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా మీరు క్రీస్తుయేసులో వేరుపారినవారుగా ఉండునట్లు చేసి, మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీలో లోతుగా వేరుపారాలని కోరుతూ ఈరోజు నీ యొద్దకు వచ్చుచున్నాము. దేవా, నీ మాటలు వినడానికి మరియు వాటిని ఆచరణలో పెట్టడానికి మాకు సహాయం చేయుము. తద్వారా మా జీవితం నీ సత్యం అను స్థిరమైన బండపై కట్టబడునట్లు చేయుము. ప్రభువా, ఆలాగుననే, మా జీవితంలో మేము ఎదుర్కొంటున్న తుఫానులచే కదల్చబడకుండా ఉండుటకు మమ్మును బలపరచుము. దేవా, నీ సన్నిధితో మమ్మును నిరంతరం పోషించుము, తద్వారా మేము నీ ఆత్మ ఫలాలను అనుభవించునట్లు చేయుము. ప్రభువా, మేము నీలో బలపడుచున్నప్పుడు మా జీవితం ఆశ్రయం మరియు అవసరంలో ఉన్నవారికి విశ్రమ స్థానముగా ఉండునట్లుగా మార్చుము. యేసయ్యా, నీవు మాకు మూలరాయి ఉంటూ, మేము నీ యందు విశ్వాసంతో కట్టబడుటకు మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, మేము ప్రతిరోజు నీతో నడుచునట్లుగాను మరియు మా హృదయాన్ని కృతజ్ఞతతో నింపుము. ప్రభువా, ఈ లోకపు మార్గాలలో కాకుండా నీలో మేము వేరుపారినవారమై ఉండునట్లుగాను, నీ బలాన్ని ఎల్లప్పుడూ మాలో ప్రవహించునట్లు చేయుమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.