నా ప్రియమైన స్నేహితులారా, నేడు నేను మీతో కలిసి మాట్లాడడము మరియు మీతో కలిసి ప్రభువును వెదకడం నాకెంతో సంతోషముగా ఉన్నది. మనము ఈ రోజు ఎంతగానో ఆనంద భరితులముగా చేయబోవుచున్నాము. కనుకనే, నేటి దినమున వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 23:4వ వచనము తీసుకొనబడినది. ఆ వచనములో, "గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును'' చెప్పబడిన ప్రకారం ప్రభువు మనకు తోడైయున్నాడు. ప్రభువు యొక్క దుడ్డుకఱ్ఱయు ఆయన దండమును మనలను ఆదరించును. అవును, ప్రభువు యొక్క దుడ్డుకఱ్ఱయు ఆయన దండమును మనలను ఏలాగున ఆదరించును? ఎందుకనగా, కీర్తనలు 23వ అధ్యాయములో దేవుడు తన గొఱ్ఱెలకు ఏ రీతిగా కాపరిగా ఉంటాడో తెలియజేయబడుచున్నది. ఒక కాపరి యొక్క దుడ్డుకఱ్ఱ మరియు దండము ద్వారా గొఱ్ఱెలు ఏ రీతిగా ఆదరించబడతాయి? మేము చిన్న పిల్లలముగా ఉన్నప్పుడు, మేము ప్రతి రాత్రి కూడా పడకకు వెళ్లకముందు కాపల దారుని యొక్క కర్ర శబ్దము ప్రతిరోజు రాత్రి మాకు వినబడుతుంది. రాత్రివేళ ఆ కాపల దారుని యొక్క చేతిలో ఒక పెద్ద కర్ర ఉంటుంది. అతడు యింటి చుట్టు తిరుగుచున్నప్పుడు, ఆ కర్రను నేల మీద కొడతాడు. ఎందుకు అతడు ఆలాగున చేస్తాడు? ఎందుకంటే, ఇంట్లో ప్రవేశించడానికి ప్రయత్నించే ఏ దొంగయైన సరే, కాపలదారుడు గమనించుచున్నాడని తెలియజేయడం కొరకు మాత్రమే ఆలాగున చేస్తాడు. వారు ఈ శబ్దమును విని, ఎవరో అక్కడ ఉన్నాడు అని అనుకోవడము మాత్రమే కాదు, ఎవరో ఒకరు ఉన్నారు అని ఆ విధంగా వారు భయపడతారు. మనలను కాపల కాయుచున్నాడు అనే భద్రతా భావమును మనము కూడా కలిగియుండుట మాత్రమే కాదు, ధైర్యంగాను, నెమ్మదిగాను నిద్రిస్తాము.
అవును, నా ప్రియులారా, అదే రీతిగా గొఱ్ఱెలు కూడా ఒక కాపరి మమ్మును కాపాల కాయుచున్నాడు అని గుర్తెరుగుతాయి. మనము కూడా ప్రభువు యొద్ద నుండి ఇట్టి సూచన పొందుకుంటాము. మనము కూడా కుటుంబముగా ఏ సంగతి గురించియైన ఒత్తిడికి లోనగుచున్నప్పుడు, ఒక కుటుంబముగా దేని గురించియైన చింతించుచున్నప్పుడు, అక్షరాల అదే సమయములో దేవుడు తన సేవకులను పంపించి, ప్రవచనాత్మకంగా మనతో మాట్లాడడము జరుగుతుంది. వారు ఇలాగున చెబుతారు, " మీరు ఈ రీతిగా వెళ్లబోవుచున్నారని దేవుడు తెలియజేయుచున్నాడు. కానీ, దేవుడు ఈ రీతిగా మిమ్మును లేవనెత్తబోవుచున్నాడని తెలియజేస్తారు.'' అది విన్నవెంటనే ఎంతగానో మనకు సంతోషమయంగా ఉంటుంది కదా.
నా ప్రియులారా, కొన్ని ఫర్యాయములు ప్రజలు వచ్చి, మీ ప్రార్థన ద్వారా ఈ అద్భుతమైన మహాత్కార్యములను అనుభూతిచెందాము అని వారు పొందుకున్న సాక్ష్యములను చెబుతుంటారు. అది మనలను ఎంతగానో ప్రోత్సహిస్తుంది. కొన్ని ఫర్యాయములు అట్టి గాఢాంధకారపు సమయములలోనే, దేవుడు ఒక అద్భుతాన్ని మన జీవితములో జరిగిస్తాడు. అది మనలను ఆదరిస్తుంది. ఈ సూచనలన్నిటి ద్వారా ఆయన మనలను ఆదరిస్తాడు. అదేవిధముగా, ఆయన మిమ్మును కూడా ఆదరిస్తాడు. ఇశ్రాయేలీయుల ప్రజలు అరణ్య భూభాగములో నడుస్తున్నప్పుడు, వారు అరణ్యములో ఉన్నప్పటికిని, అగ్ని స్తంభము మరియు మేఘ స్తంభము వారిని నడిపించెను. తద్వారా వారు ఆదరింపబడియున్నారు. అత్యంత గాఢాంధకారపు లోయలలో కూడా ఆయన మీతో కూడా ఉన్నాడన్న సూచనను మీకు కనుపరుస్తాడు. కనుకనే, ఈ అద్భుతమైన ఆశీర్వాదమును మరియు ఆదరణను మనము నేడు పొందుకుందామా? ఆలాగున పొందుకోవాలనగా, మనకు కాపరిగా ఉన్న ప్రభువు యొద్ద మన జీవితాలను గొఱ్ఱెల వలె సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా నేటి వాగ్దానము ద్వారా మీరు గాఢాంధకారపు లోయలలో నడిచినను, దేవుడు మిమ్మును కాపాడి సంరక్షించి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కాపరివైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, మా గాఢాంధకారపు లోయలలో మేము నిన్ను చేరుకుని, నీ సన్నిధిని మరియు ఆదరణను కోరుతూ నీ యెదుటకు వచ్చుచున్నాము. దేవా, ఎల్లప్పుడు మా దృష్టిని నీ మీద నిలుపుటకు మరియు నీవు నిరంతరము మా పట్ల శ్రద్ధగల కాపరివని నమ్ముటకు మాకు సహాయం చేయుము. ప్రభువా, ఈ అంధకారపు సమయములో మాకు ఒంటరితనము అనిపించినప్పుడు, మేము ఓటమి పాలవుతాము అను అనుభూతి మాకు కలిగినప్పుడు, మా జీవితము పట్ల భయము కలిగినప్పుడు, మా కాపరి మాతో కూడా ఉన్నాడనియు, నీవు మమ్మును గమనించుచున్నావనియు మాకు కనబడునట్లుగా ఒక సూచనను మాకు అనుగ్రహించుము. దేవా, మాతో మాట్లాడి, మాకు ప్రోత్సహమును కలిగించి, మా జీవితములో అద్భుతములను జరిగించుము. ప్రభువా, ఈ సూచనలన్నిటి ద్వారా మాకు నీ యొక్క ఆదరణను అనుగ్రహించుము. దేవా, మేము ఒంటరి వారము కాదని మాకు కనుపరచుము, మా హృదయాలను బలపరచుము, మా అంధకార లోయలలో నుండి మమ్మును బయటకు తీసుకొని రమ్ము. ప్రభువా, మమ్మును గొప్ప స్థాయికి లేవనెత్తుము. ప్రభువా, మా జీవితములో మా భారాలను తొలగించి, నీ సేవకుల ద్వారా, నీ వాక్యం ద్వారా మరియు నీ అద్భుతమైన క్రియల ద్వారా నీ ప్రోత్సాహకరమైన మాటలను మా యొద్దకు పంపించుము. దేవా, నీ ఆదరణలో మమ్మును చుట్టుముట్టి, లోయ ఎంత లోతుగా ఉన్నను మేము ఎల్లప్పుడు ఒంటరిగా లేమని మాకు గుర్తు చేయుము. ప్రభువా, ఆనందంలో నడవడానికి మరియు నీ ఆశీర్వాదాల గొప్ప ఎత్తులలో నిలబడటానికి మమ్మును పైకి లేవనెత్తుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.