నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా మనము బైబిల్ నుండి ఎఫెసీయులకు 2:18వ వచనమును ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "ఆయన (యేసుక్రీస్తు) ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి యున్నాము'' అని వ్రాయబడియున్నది. ఈ వచనమును, నేను ధ్యానిస్తున్నప్పుడు, ఒక విషయము నాకు జ్ఞాపకమునకు వచ్చినది. మనము ఉద్యోగమునకు వెళ్లినప్పుడు, భవనము లోపలికి ప్రవేశించడానికి చాలా మందికి యాక్సెస్ కార్డ్ ఇవ్వబడుతుంది. మన ఉద్యోగి ఐడి మరియు మన యొక్క వివరములన్నియు ఆ కార్డులో పొందుపరచబడి ఉంటాయి. సాధారణంగా భవనము లోపలికి వెళ్లవలసిన ప్రతిసారి యాక్సెస్ కార్డ్‌ను చూపెట్టవలసినవారముగా ఉంటాము. మీరు ఎప్పుడు లోపలికి వచ్చారు, మీరు ఎంత సేపు పనిచేశారు. ఎప్పుడు తిరిగి యింటికి వెళ్లారు అన్న వివరములన్నియు అందులో పొందుపరచబడి ఉంటాయి.

ఇంకను, ఉద్యోగి ఐడి కార్డులో ఇవన్నియు కూడా పొందుపరచబడి ఉంటాయి. మీరు ఆ యాక్సెస్ కార్డును పోగొట్టుకున్నను లేక మరచిపోయినను సరే, భవములోనికి ప్రవేశించాలంటే, మీరు మరొక తాత్కాలికమైన కార్డును పొందుకొనవలసి వస్తుంది. ఆ తాత్కాలికమైన మరొక యాక్సెస్ కార్డ్ పొందుకోవాలంటే, అనేకమైన పనుల వివరములను ఇవ్వవలసి ఉంటుంది. అయినప్పటికిని, అది మీ ఉద్యోగి ఐడి కార్డుతో అనుసందానించబడదు. ఆ వివరములన్నియు నమోదుపరచబడదు. ఇంకను మీకు ఎటువంటి సంబంధమే ఉండదు.

అదేవిధముగా, తండ్రి యొద్దకు వెళ్లవలెననగా, మనకు ఒక ప్రవేశము కలదు. యేసు క్రీస్తు ద్వారా మనము తండ్రి యొద్దకు వెళ్లవలెను. యేసుక్రీస్తునందు మన వివరములన్నియు నమోదు చేయబడి ఉంటాయి. మీరు రహస్యముగా చేసినవన్నియు, అవి మంచివైనను, చెడువైనను సరే, యేసు నామము కొరకు మీరు త్యాగము చేసినవన్నియు, ప్రార్థనలో ఎంత సమయము గడిపారనియు, ఇతరులకు ఎంత సేవ చేశారనియు, ఇతరులకు సువార్త ప్రకటించారనియు, అవన్నియు కూడా క్రీస్తులో భద్రపరచబడతాయి. మీరు ఆయన కొరకు చేసినవన్నియు యేసయ్య, తండ్రి యొద్దకు వెళ్లినప్పుడు చెబుతాడు. అంత్య దినమున ప్రభువు వాటన్నిటిని చూచి ప్రభువు మీకు ప్రతిఫలమునిస్తాడు. అనేకమంది, యేసు అను ప్రవేశమును పోగొట్టుకొని, మాదక ద్రవ్యాలు, మధ్యము సేవించడము మరియు చెడు స్నేహితులు అనే తాత్కాలికమైన ఆనందాల వైపు వెళ్లిపోతారు. ఇంకను లోకాశల వైపు మరలిపోతారు. అవన్నియు తండ్రి యొద్దకు మిమ్మును చేర్చలేవు. తండ్రి యొద్దకు మనలను ప్రవేశింపజేసే, యేసు క్రీస్తుతో సంబంధము కలిగి యున్నప్పుడు, ఆయన మనలను పరలోకమునకు చేరుస్తాడు. అంతిమంగా మనకు ప్రతిఫలమునిస్తాడు. మరియు నూతన జీవితమును మరియు నూతన అర్థమునిస్తాడు, ఇంకను నూతన దీవెనలను మనకు అనుగ్రహిస్తాడు.

కాబట్టి, నా ప్రియులారా, ఈ రోజు యేసయ్యతో మనము అనుసంధానించబడినప్పుడు తండ్రి దగ్గరకు నిజమైన ప్రవేశం ఆయన ద్వారానే కలుగుతుంది మరియు ఆయన మనలను పరలోకానికి నడిపిస్తాడు, అది అంతిమ ప్రతిఫలం. నేడు మీరు తండ్రి యొద్దకు వెళ్లుటకు ప్రవేశమును మరియు ఇంతటి గొప్ప ప్రతిఫలములలను పొందుకొనుటకు ఈ రోజు నాతో కూడా తీర్మాణమును చేస్తారా? ఆలాగున చేసినట్లయితే, నిశ్చయముగా, దేవుడు మిమ్మును నేటి వాగ్దానము ద్వారా ఆశీర్వాదించును గాక.

ప్రార్థన:
మహోన్నతుడవైన మా పరలోకమందున్న తండ్రీ, యేసుక్రీస్తు ద్వారా తండ్రి యొద్దకు చేరుటకు మాకు ప్రవేశము ఇచ్చినందుకై నీకు వందనాలు. దేవా, మేము నీ కొరకు చేయుచున్న కార్యములన్నిటిని నీ సన్నిధిలో భద్రపరచినందుకై నీకు కృతజ్ఞతలు. ప్రభువా, నీ కొరకు జీవించే కృపను మాకు అనుగ్రహించుము. దేవా, మేము ప్రజలకు సేవ చేయుటకును, నీతిగా జీవించుటకును, నీతో సమయము గడుపుటకును, నీ వాక్యమును వెంబడించుటకును, నీ చిత్తమును జరిగించుటకును, నీతో సంబంధమును కలిగియుండుటకు మరియు ఒకరోజు మేము పరలోక రాజ్యమునకు చేరుటకు మాకు నీకృపను దయచేయుము. కనుకనే, యేసయ్యా, నీవు మా పక్షమున న్యాయాధివాదిగా ఉంటూ, మమ్మును తండ్రి యొద్దకు చేరుస్తున్నందుకై మరియు ప్రతిఫలములు ఇస్తున్నందుకై నీకు వందనాలు. ప్రభువా, మా జీవితములో నీకు నమ్మకముగా జీవించే కృపను మాకు అనుగ్రహించుము. దేవా, ఎల్లప్పుడు నీతో సంబంధము కలిగియుండునట్లుగా మమ్మును మార్చుము. ప్రభువా, నీ సన్నిధి కొరకు తృష్ణగొనే హృదయంతో మేము నీ సన్నిధికి వస్తున్నాము. దేవా, మేము తాత్కాలిక ప్రత్యామ్నాయాలను ఎప్పుడూ వెదకకుండా, ఆయనతో అనుసంధానంగా ఉండటానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, విధేయతతో నడవడానికి మరియు మా హృదయంతో నిన్ను సేవించడానికి మమ్మును బలపరచుము. ప్రభువా, మా ప్రార్థనలు మరియు ఇతరుల పట్ల మా ప్రేమ నీకు సంతోషాన్ని కలిగించును గాక. దేవా, మా జీవితం నీ మహిమను ప్రతిబింబించునట్లుగాను మరియు ఇతరులను నీకు సమీపముగా వచ్చునట్లుగా మమ్మును నీ ఆత్మతో నింపు, నీవు సిద్ధపరచిన శాశ్వత ప్రతిఫలానికి మమ్మును నడిపించుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.