నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా,మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 71:21వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నా గొప్పతనమును వృద్ధి చేయుము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము'' ప్రకారం మన దేవుడు ఆదరణకు కర్తయై యున్నాడు. నా స్నేహితులారా, మీరు దుఃఖంతో కన్నీళ్లు కారుస్తున్నారా? - మీ ఆత్మ లోతులలో నుంచి ప్రవహిస్తున్నట్లుగా అనిపించునంతగా కన్నీళ్లు విడుచుచున్నారా? కొన్ని దినముల క్రితం నేను దేవుని సన్నిధిలో ప్రార్థించుచుండగా, ఆకస్మాత్తుగా 17 సంవత్సరాల వయస్సులో చనిపోయిన నా కుమార్తె, ఏంజెల్ నాకు జ్ఞాపకము వచ్చినది. నేను ఒంటరిగా నా గదిలో ఉన్నాను, నేను విలపించడం ప్రారంభించాను, నా కుమార్తెను గుర్తు చేసుకుంటూ, ఏడుస్తూ ఉన్నాను. ఆకస్మాత్తుగా, దేవుని యొద్ద నుండి ఆదరణ వచ్చి, నా హృదయాన్ని నింపినది. నేను గొప్పగా ఆదరించబడ్డాను. నేను ఇక ఒంటరిని కాను, ఆయన సన్నిధి నేను వివరించలేనంతగా నెమ్మది నన్ను ఆవరించినది.

అదేవిధముగా, నా ప్రియ స్నేహితులారా, ప్రభువు ఇక్కడ మిమ్మును ఆదరించడానికి ఉన్నాడు. ఆలాగుననే, దేవుని వాక్యములో చూచినట్లయితే, "అ న్ని విధములుగా ఆయన నన్ను ఆదరిస్తాడు'' అని చెప్పబడియున్నది. బైబిల్‌లో చూచినట్లయితే, కీర్తనలు 23:1వ వచనములో కీర్తనకారుడైన దావీదు ఈలాగున అంటున్నాడు, "యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు'' అని చెబుతున్నాడు. ఆలాగుననే, కీర్తనలు 23వ అధ్యాయములోని ప్రతి వచనం ప్రభువు తన పిల్లలను ఎలా ఆదరిస్తాడు మరియు వారి పట్ల ఎలా శ్రద్ధ వహిస్తాడు అనే దాని గురించి మాట్లాడుతుంది. ఇంకను కీర్తనలు 23వ అధ్యాయమంతయు ఎంతో అద్భుతమైనది. కాపరియైన అదే మన ప్రభువు నేడు మన మధ్యలో ఉంటున్నాడు. ఆయన మిమ్మును మరియు మీ హృదయాలను చూచుచున్నాడు. మీరు విలపించుచున్నది ఆయన చూస్తున్నాడు. అందుకే ఆయన మిమ్మును చూచి, 'నా బిడ్డా, నేను నిన్ను ఆదరించడానికి నీ యొద్దకు వచ్చాను' అని అంటున్నాడు. కనుకనే, మీరు దిగులుపడకండి.

నా ప్రియులారా, దేవుడు ఆదరణకు కర్తయై ఉన్నాడని వాక్యము సెలవిచ్చుచున్నది. కాబట్టి, మీరు దేనిని గురించి చింతించకండి. నా జీవితములో చూచినట్లయితే, నేను ఎంతోమంది బిడ్డలను కోల్పోయాను. మొదటిసారి నేను 3 నెలల శిశువును కోల్పోయాను. రెండవదిగా, జన్మించినటువంటి మగబిడ్డ చనిపోయాడు. ఆ తర్వాత 17 సంవత్సరాల నా కుమార్తెను కోల్పోయాను. ఇంకను నా భర్తను కోల్పోయాను. ఈలాగున ఎన్నో మరణాలను గురించి, నేను ఆలోచిస్తూ, ఏడుస్తూ ఉన్నాను. కానీ, ఆదరణకర్తయైన దేవుడు అన్ని సమయాలలో కూడా నా యొద్దకు వచ్చి, నన్ను ఆదరించాడు. హల్లెలూయా! పరిచర్యలో ముందుకు వెళ్లునట్లుగా నన్ను కొనసాగింపజేసాడు. అందుకే నేటి వరకు మేము పరిచర్య చేస్తున్నాము. మా హృదయములో వేదన, కష్టము ఉన్నప్పటికిని, ప్రభువు సన్నిధానము ద్వారా మేము ఆదరింపబడి, ప్రోత్సహించబడ్డాము.

నా ప్రియ స్నేహితులారా, అదేవిధముగా, నేడు మీరు కన్నీటితో ఏడుస్తూ మొఱ్ఱపెడుతున్నా రా? అటువంటి మిమ్మును చూచి, 'ఆదరణకర్తయైన దేవుడను నేనే, నా యొద్దకు రండి బిడ్డలారా, నేను మిమ్మును ఆదరిస్తాను, మీకు కావలసినవన్నియు ఇస్తాను' అని ప్రభువు అంటున్నాడు. కాబట్టి, మీరు ఆయన యొద్దకు వెళ్లినప్పుడు, ఆయన మీరు అడుగువాటన్నిటి కంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికంగా మీకు అనుగ్రహిస్తాడు. కనుకనే, ఇకను ఏడ్వకండి, విలపించకండి. ఆయన యొద్దకు ఈ క్షణమే రండి, మోకరించండి, ఆయన సన్నిధిలో ప్రార్థించండి, మీ జీవితాలను ప్రభువునకు సమర్పించండి, మీకు కావలసినవన్నియు ఆయనకు చెప్పండి, ఆయన మీ అవసరతలన్నిటిని తీరుస్తాడు. మిమ్మును ఆదరిస్తాడు, మీరు దీవించబడతారు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
అమూల్యమైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ గొప్ప ప్రేమ కొరకు నీకు వందనాలు. ప్రభువా, నీ బిడ్డలమైన మేము మా ప్రియులను పోగొట్టుకొనియున్నాము, మా ఉద్యోగమును మరియు సమస్తమును కోల్పోయాము. దేవా, నీ సన్నిధిలో ఎంతగా మొఱ్ఱపెట్టుచున్నాము, నేడు నీవు మా కన్నీటికి తగిన ప్రతిఫలమును దయచేయుము. దేవా, మా ప్రతి అవసరాన్ని ఇవ్వగలిగిన దేవుడవు కనుకనే, మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. దేవా, ఇప్పుడే మమ్మును తాకుము, మా అవసరతలన్నిటిని తీర్చుము, నీ సన్నిధిలో మమ్మును ఆదరించి, ఆదుకొనుము. దేవా, నీవు మమ్మును ఆదుకునే దేవుడవు నీవే, మా దుఃఖ సమయాలలో మాకు ఆశ్రయంగా ఉన్నందుకై నీకు వందనాలు. ప్రభువా, మా కన్నీళ్లను తుడిచి, మా హృదయాన్ని నీ దైవీకమైన సమాధానముతో నింపుము. దేవా, మేము విడువబడియున్నాము అని అనిపించినప్పుడు, నీవు ఎల్లప్పుడు మా ప్రక్కనే ఉన్నావని మాకు గుర్తు చేయుము. యేసయ్యా, మమ్మును భారముగా ఉంచే ప్రతి భారాన్ని తొలగించి, మా జీవితములో ఆనందాన్ని పునరుద్ధరించుము. దేవా, మా బలాన్ని వృద్ధిపొందించుము మరియు నీ యొక్క పరిపూర్ణమైన ప్రణాళికలో నమ్మకం ఉంచడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ సన్నిధి మమ్మును చుట్టుముట్టి, మా ఆత్మకు స్వస్థతను తీసుకొని వచ్చునట్లుగా చేయుము. దేవా, మేము ఊహించువాటన్నిటికంటెను, అడుగువాటన్నిటికంటెను అత్యధికముగా మాకు అనుగ్రహించి, మమ్మును ఆశీర్వదించి, నేడు మా అవసరాలన్నింటిని తీర్చుము. ప్రభువా, మమ్మును నీ యొక్క శాశ్వతమైన ప్రేమతోను, నీ ఆదరణతోను నింపి, ఎన్నడును విడువకుండా, మా చేయి పట్టుకొని, మేము కోల్పోయినవన్నిటిని మాకు తిరిగి దయచేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.