నా ప్రశస్తమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 సమూయేలు 7:12 వ వచనమును ఈ దినమున మన ధ్యాననిమిత్తము తీసుకొనబడినది. ఆ వచనము, "అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపియింత వరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను'' అని వ్రాయబడియుండెను. ఇది ఈ సంవత్సరమునకు ఆఖరి రోజు. ఇంతవరకు ప్రభువు మనకు సహాయము చేసియున్నాడు అను ఈ మాటకు మీరు 'ఆమేన్' అని చెబుతారా? అవును, ఈ సంవత్సరమంతయు మనకు ఆయన 'ఎబెనెజరు' దేవుడై యున్నాడు. నిజమే, ప్రభువు ఇప్పటివరకు మనకు సహాయం చేశాడు. ఆయన నిజంగా మనకు 'ఎబెనెజరుగా' ఉన్నాడు. కనుకనే, మీరు దేనికిని భయపడకండి.

నా ప్రియులారా, మీకు తెలుసా? సమూయేలు అత్యంతమైన ప్రతికూల పరిస్థితులలో అతడు ఆ రాతిని అక్కడ ఆవిధంగా నిలిపియున్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజలందరు కూడా సమూహికంగా అతని యొద్దకు కూడి వచ్చిరి, ఆ సమయములో వారి మీద దాడి చేయడాని కొరకై ఫిలిష్తీయులు గొప్ప సైన్యసమూహముగా వారి మీదికి దాడి చేయుటకు వస్తున్నారని ప్రార్థన చేయుటకు ప్రజలను సమూయేలు పిలిచాడు. మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించునట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి. ఆలాగుననే, నేడు మనము హృదయాన్ని, మనస్సును కేంద్రీకరించుకొని, యేసునకు ప్రార్థించుటకు నిర్ణయము చేసుకున్నప్పుడు, అంధకారపు శక్తులు మరియు చెడ్డ వారి యొక్క మనస్సులు మన మీద దాడి చేయుటకు సంసిద్ధమవుతాయి. అవును, మీరు ఆశ్చర్యపడిపోతున్నారేమో? 'నేను, ప్రార్థించడానికి వెళ్లుచున్నప్పుడు, ఎందుకు ఇంతగా దాటికి గురియగుచున్నాను?' అని మీరు అనుకుంటున్నారేమో? కానీ, నా ప్రియ స్నేహితులారా, అప్పుడే మీరు తెలుసుకోవాలి, దేవుడు అత్యంత శత్రువుకంటె మిక్కిలి శక్తిమంతుడై దానిని ఎదుర్కోవడానికి వచ్చు దేవుడై యున్నాడు.

ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడియున్నారని ఫిలిష్తీయులు విని నప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడిరి. ఆ ప్రజలకు భయం పట్టుకోవడంతో, 'మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి, మా శత్రువుల నుండి మేము రక్షించబడతాము అని కేకలు వేశారు.' అందుకే సమూయేలు ఈలాగున చెబుతున్నాడు, "భయపడకండి,'' అని వారికి నమ్మకమును కలిగించాడు. ప్రజలందరు కూడా మేము శత్రువుల భారీ నుండి విడిపించబడుటకు మా కొరకు ప్రార్థించండి అని చెప్పుచుండగా, అతడు నీటిని కుమ్మరించియున్నాడు. ఈ నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యము. అతడు ఆత్మలో ప్రార్థన చేసియున్నాడు. ప్రియులారా, అనేక ఫర్యాయములు శత్రువు మనకు విరోధముగా వచ్చినప్పుడు, మనము ప్రార్థన చేయలేకపోతాము. అందుకే బైబిల్‌లో రోమీయులకు 8:26వ వచనములో ఈలాగున వ్రాయబడియున్నది, "అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు.'' అందునిమిత్తము మన బలహీనతలను చూచి, మన పక్షముగా విజ్ఞాపనము చేయుటకు పరిశుద్ధాత్మను మన కొరకు అనుగ్రహించును. అప్పుడు అతడు సమూయేలు పాలు విడువని ఒక గొఱ్ఱెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి, రక్తమును చిందించి, ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ఈ రోజు మన ప్రభువైన యేసు క్రీస్తు మన కొరకు రక్తమును చిందించియున్నాడు. చివరిగా అతడు ఒక ఒప్పుకోలు చేసియున్నాడు, దేవునిని స్తుతించియున్నాడు. అందుకే బైబిల్‌లో 1 కొరింథీయులకు 10:4 వ వచనములో చెప్పబడినట్లుగానే, 'అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే '' అని చెప్పబడిన ఆ ప్రకారముగానే ఇక్కడ సమూయేలు, 'ఓ దేవా, నీవు మాకు ఎబెనెజరువై యున్నావు, నీవే మాకు మూలరాయి అంటున్నాడు.' కనుకనే, ఈనాడు మనము 'యేసు' అను రాతి బండ మీద నిలబడి ఉన్నాము.

మూడవదిగా అతడు 'ప్రభువా, నీవే మాకు ఎబినేజరు, ఇంతవరకు నీవు మాకు సహాయము చేసియున్నావు. ఇంకను నీవు నీ రక్తమును మా కొరకు బలిగా అర్పించావు, నీవు మాకు సహాయము చేశావు' అని అతడు ఆలాగున చెప్పి ప్రార్థించినప్పుడు దేవుని శక్తి వారి శత్రువులకు విరోధముగా వచ్చియున్నది. ఇశ్రాయేలీయుల సరిహద్దులలోనికి ఫిలిష్తీయులు ప్రవేశించలేకపోయారు. ఫిలిష్తీయులు ఎప్పటికిని వారిని చేరుకోలేకపోయారు. దేవుని శక్తి వారికి విరోధముగా పని చేసియున్నది. ఇశ్రాయేలీయులు వారి నుంచి చెరపట్టబడిన పట్టణములన్నియు మరల వారికి ఇచ్చునట్లుగా దేవుడు వారికి చేసియున్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజలు ఆ నగరములన్నిటిని స్వాధీనము చేసుకున్నారు. సమూయేలు తాను బ్రదికిన దినములన్నియు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను మరియు ప్రవచనాత్మకమైన అభిషేకముతో ప్రభువునకు సేవను జరిగించాడు.

నా ప్రియులారా, ఆలాగున నేడు మీకు కూడా జరుగుతుంది. ఈ రోజు మనము చెబుతాము, 'నీవు మాకు ఎబెనెజరు' 'ప్రభువా, నీవు మమ్మును కనికరించియున్నావు, మాకు సహాయము చేసినందుకై నీకు వందనములు.' 2024 వ సంవత్సరములో మీరు ఇప్పటి వరకు చూచిన శతువులను ఇక ఎప్పటికిని చూడరు. కానీ, మీరు కోల్పోయిన సమస్తమును మరల మీరు తిరిగి పొందుకొనెదరు. రాబోవు నూతన సంవత్సరములో ఇదివరకు ఎన్నడు లేనివిధంగా, మీలోను మరియు మీ ద్వారాను, ఈ యొక్క సేవాపరిచర్య ద్వారా దేవుని యొక్క అభిషేకము బలంగా పనిచేయబోవుచున్నది. ఈ ఆశీర్వాదమును నేను మీ మీదికి ప్రకటించుచున్నాను, యేసు నామమున ఈ పరిచర్య మీదను ప్రకటించుచున్నాను. నేటి వాగ్దానము ద్వారా దేవుడు రాబోయే నూతన సంవత్సరమంతయు మిమ్మును ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాకు తోడుగా ఉన్నందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. దేవా, నీవు మాకు ఎబెనెజరుగా ఉన్నావు, నీవు ఇంతవరకు మాకు సహాయము చేశావు, నీవు ఇంకను మమ్మును ముందుకు నడిపిస్తావని మేము నమ్ముచున్నాము. ప్రియమైన ప్రభువా, మేము కృతజ్ఞతతో నిండిన హృదయంతో నీ ముందుకు వచ్చుచున్నాము. దేవా, ఈ సంవత్సరం ప్రతి శోధనల ద్వారా మమ్మును మోసుకెళ్లిన మా ఎబెనెజరు, మాకు సహాయపు రాయిగా ఉన్నందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ మార్పులేని విశ్వాసం మరియు కృప కొరకు మేము నిన్ను స్తుతించుచున్నాము. దేవా, శత్రువు మాకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు, నీవు మా రక్షణలో నిలిచి మాకు విజయాన్ని ఇచ్చావు. యేసయ్యా, మేము బలహీనంగా ఉన్నప్పుడు మమ్మును బలపరచడానికి నీ పరిశుద్ధాత్మను కుమ్మరించావు, నీ అమూల్యమైన రక్తం మమ్మును కప్పి, మా శోధనల నుండి మమ్మును విమోచించుము. దేవా, ఈ రోజు, ఇంతవరకు, ప్రభువు మాకు సహాయం చేస్తావని మేము అంగీకరించుచున్నాము మరియు రాబోయే నూతన సంవత్సరంలో మమ్మును మరింత గొప్ప ఆశీర్వాదాలతో నడిపిస్తావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మేము పోగొట్టుకున్న వాటన్నిటిని పునరుద్ధరించి, నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మును నింపుము. దేవా, నీ శక్తి మా ద్వారా ప్రవహింపజేయుము, నీ నామమునకు మహిమ కలుగజేయుము. ప్రభువా, మేము నీలో స్థిరంగా నిలబడి ఉండుటకు మమ్మును నీ మార్గములొ నడిపించుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసు క్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.