నా ప్రియ స్నేహితులారా, సంతోషముతో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించుట కొరకే ఈ రోజు మనము ఈ సందేశమును చదువుచున్నాము. నేడు అది బలమైన ఆశీర్వాదములతో మీ యొద్దకు వస్తుంది. గనుకనే, మీరు ఉత్సాహముగా ఉండండి. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ప్రకటన 21:5వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను; మరియు-ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పెను'' ప్రకారం యేసు మన యొద్దకు వచ్చునప్పుడు మన జీవితములో సమస్తమును నూతనపరచబడుచున్నవి మరియు పాతవన్నియు గతించిపోవును. మన జీవితాలు నూతనంగా పునరుద్ధరించబడతాయి.
కానా ఊరిలో జరిగిన వివాహములో, ఆతిథ్యం ఇచ్చేవారు ఊహించని విధంగా నీటిని ద్రాక్షారసంగా మార్చడం ద్వారా యేసు తన మొదటి అద్భుతాన్ని అక్కడ జరిగించాడు. ఈ చర్య వారిని ఇబ్బందికరమైన పరిస్థితి నుండి కాపాడడమే కాకుండా లోతైన సత్యాన్ని కూడా బయలుపరచింది: కొరత మరియు ఆందోళన ఉన్న చోట యేసు పునరుద్ధరణను మరియు మాధుర్యమును తీసుకొనివస్తాడు. అదేమనగా, యేసు కానా ఊరిలో ఒక వివాహమునకు వెళ్లినప్పుడు, అక్కడ వారికి వడ్డించడానికి అనగా ఆ కుటుంబానికి ద్రాక్షారసము అయిపోయినది. ఎప్పుడైన వడ్డించవలసిన సమయములో ఆహార పానీయములుగానీ ఖాళీ అయిపోయినట్లయితే, ఎంత అవమానకరంగా ఉంటుందో కదా! వారు అతిధులకు వడ్డించలేని పరిస్థితి వచ్చినప్పుడు వారు యేసు వైపు తిరిగారు. అక్కడ ఆయన నూతన అద్భుతాన్ని జరిగించాడు. క్రొత్త ద్రాక్షరసం, విందుకు వచ్చిన వారు మునుపటి కంటె ఈ ద్రాక్షరసము చాలా మధురంగా ఉన్నదని చెప్పారు. అవసరమైన సమయంలో, యేసు వైపు తిరగడం మనకు నూతన అవకాశాలను తీసుకొనివస్తుంది. కానాలోని కొత్త ద్రాక్షారసం మునుపటి కంటే తియ్యగా ఉన్నట్లుగానే, యేసు మన జీవితాలను మధురంగాను మరియు అన్నిటిని నూతనంగాను మారుస్తాడు. అప్పుడు మనము క్రీస్తులో ఒక నూతన సృష్టిగా మార్చబడునట్లుగా ఆయన రూపాంతరపరచబడుచున్న శక్తికి నిదర్శనమని బైబిల్ మనకు గుర్తుచేస్తుంది.
నా ప్రియులారా, ఎవరిని ఆయనను నూతన సృష్టిగా మారుస్తాడనగా, ఎవరైతే, ఆయనకు వారి హృదయాలను సమర్పించుకుంటారో మరియు వారు యేసును వారి హృదయాలలోనికి మరియు వారి గృహాలలోనికి ఆహ్వానిస్తారో, దేవుని వాక్యములో చెప్పబడినట్లుగానే, "కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను'' (2 కొరింథీయులకు 5:17) ప్రకారం క్రీస్తునందున్న వారు నూతన సృష్టి అవుతారు. ఆలాగుననే, ఆయన ఆశీర్వాదాలకు మరియు ఆయనతో పునరుద్ధరించబడిన సంబంధము యొక్క ఆనందము వైపునకు మన హృదయాలను మరియు జీవితాలను తెరుద్దాము. ప్రార్థన మరియు విశ్వాసం ద్వారా మన జీవితాలలో నూతన ఆనందాన్ని తీసుకురావాలని, ఆయనతో మన సంబంధాన్ని ఎక్కువగా పెంచుకోవాలని మనకు నూతన ప్రారంభాలను అనుగ్రహించమని మనము ఆయనను అడుగుదాము. ఆయన సన్నిధి మన జీవితంలోని ప్రతి అంశాన్ని సుసంపన్నం చేస్తుంది మరియు మన కుటుంబాలను ఆశీర్వదిస్తుంది మరియు ఆయన మంచితనంతో మన గృహములను నింపుతుంది. సమస్తమును నూతనంగా మారుస్తుంది. కాబట్టి, ఆలాగున చేసి, నేటి ఆశీర్వాదాన్ని పొందుకుందాము. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, నీ నమ్మకమైన మరియు నిజమైన వాగ్దానాలకు కృతజ్ఞతలు చెల్లించుచు ప్రభువైన యేసు, మేము ఈ రోజు నిన్ను మా హృదయంలోనికి ఆహ్వానించుచున్నాము. దేవా, కొరతలలోను మరియు శ్రమలలోను మా హృదయాలను మరియు మా జీవితాలను నీ వైపు త్రిప్పుకొనుటకు మాకు సహాయము చేయుము. దేవా, నూతన ఆనందాన్ని మరియు నీతో లోతైన సంబంధాన్ని కోరుకొనునట్లు చేయుము. దేవా, నీ ఆశీర్వాదములతోను మరియు మాధుర్యంతోను మా జీవితాలను నింపుము. ప్రభువా, నీ సన్నిధితో మా జీవితంలోని ప్రతి అంశాన్ని సుసంపన్నం చేయుచూ, మమ్మును నీ బిడ్డలనుగా మార్చుము మరియు మా జీవితములో ఉన్న పాతవన్నియు గతించిపోవునట్లుగాను మరియు సమస్తమును నూతనంగా మార్చుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.