నా అమూల్యమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మీకు శుభములు తెలియజేయడం నా హృదయాన్ని ఆనందంతో నింపుతుంది మరియు మీ కొరకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. కనుకనే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఎఫెసీయులకు 3:18,19వ వచనములు తీసుకొనబడినవి. ఆ వచనములలో  ‘‘మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరుపారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.’’ కనుకనే, నేడు మీరు దేవుని సంపూర్ణతలో పరిపూర్ణులుగా చేయబడతారు. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన వాగ్దానము కదా! నా ప్రియ స్నేహితులారా, ఈ లోకములో ఉన్న అనేక సమస్యలు మరియు సవాళ్లను బట్టి మీరు విలపిస్తుండవచ్చును. తద్వారా మీ సమాధానమును, సంతోషమును, ఆశీర్వాదమును కోల్పోయి ఉండవచ్చును? అయితే, ఇప్పుడే ఈ వాగ్దానమును స్వీకరించినప్పుడు మీరు దేవుని యొక్క సంపూర్ణతతో నింపబడుదురు గాక. 

నా ప్రియులారా, దేవుని యొక్క సంపూర్ణతతో నింపబడే అటువంటి ఆశీర్వాదమును ఎవరు పొందుకుంటారు? బైబిల్‌లో సామెతలు 28:20వ వచనము మనకు తాళం చెవిని తెరచుచూ, ఇలాగున చెబుతుంది, ‘‘నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును’’  ప్రకారం కనుకనే, మీరు దేవునికి నమ్మకముగా జీవిస్తూ, మీ జీవితములో ప్రభువు ఈ యొక్క గొప్ప అద్భుతాన్ని చేయగలడు అని మీరు కేవలము నమ్మాలి. అది ఏ విధంగా జరుగుతుందని అడగవద్దు? నా ఉద్యోగములో నా నమ్మకాన్నంతటిని కోల్పోయాను మరియు నాకు ఇంక ఎవరు కూడా సహాయము చేయలేరు అనవద్దు. ఆయన సమస్తమైన విషయములలో మీకు సహాయము చేస్తాడు. ఎందుకంటే, ఆయన అద్భుతాలను జరిగించు దేవుడుగా ఉంటున్నాడు. కనుకనే, మీరు భయపడకండి. 

ఇంకను బైబిల్‌లో 2 కొరింథీయులకు 7:4వ వచనములో చూచినట్లయితే, ‘‘ మీ యెడల నేను బహు ధైర్యముగా మాటలాడుచున్నాను, మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయము కలదు, ఆదరణతో నిండుకొనియున్నాను, మా శ్రమయంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను’’  ప్రకారం మీరు శ్రమలను ఎదుర్కొన్నప్పుడు ఏమి చేస్తారు? పైన చెప్పబడిన వాక్యములో పౌలు భక్తుడు ఈలాగున అంటున్నాడు, ‘నా శ్రమలన్నిటిలో అత్యంత సంతోషమును నేను కలిగియున్నాను’అని చెబుతున్నాడు. దేవుని సేవకులారా, ఆయన బిడ్డలారా, మీరు కష్టాలను, శ్రమలను ఎదుర్కొంటున్నారేమో? మీ చుట్టు ఉన్నటువంటి అనేకమంది ప్రజలు మీకు హాని కలుగజేయాలని అనుకుంటున్నారేమో? లేక మీ పరిచర్యకు హాని కలుగజేయాలని అనుకుంటు ఉండవచ్చును. మీ పరిచర్యను నశింపజేయాలని వారు ప్రణాళిక చేస్తుండవచ్చును. కానీ, ధైర్యము వహించండి. ప్రభువు మీతో ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది? అని మీరు చూచినట్లయితే, సర్వసంపూర్ణతతో నింపబడతారు. మీ సమస్యలలో సహితము మీరు ఎంతో సంతోషము కలిగిఉంటారు. ఇంకను 2 కొరింథీయులకు 7:1లో, ‘‘ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తిచేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము’’ ప్రకారము, మనము దేవుని భయముతో మనలో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొందాము.  

నా ప్రియ స్నేహితులారా, పరిశుద్ధతలో నడుచుకొనుట యందు ఎంతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే, మన దేవుడు పరిశుద్ధుడై యున్నాడు.  మన ము ఆయన మార్గములను అనుసరించాలి. పరిశుద్ధమైన జీవితమును కలిగి ఉండాలి. కాబట్టి, మీ జీవితాన్ని పరీక్షించుకొనండి. మీ మాటలు ఏ విధంగా ఉన్నవి? మీరు పరిశుద్ధమైన విషయాలను మాట్లాడుచున్నారా? మీ హృదయములో పరిశుద్ధమైన తలంపులను కలిగి ఉంటున్నారా? బయటకు చాలా చక్కగా కనబడవచ్చును. అంతరంగమందు మీ పరిశుద్ధత ఏ విధంగా ఉన్నది? ఆలాగున పరిశుద్ధంగా జీవించుచున్నప్పుడు ప్రభువు మీ అవసరతలన్నిటిని అద్భుత రీతిగా తీరుస్తాడు. కనుకనే, మీరు దేనిని గురించి చింతించకండి. ధైర్యముగా ఉండండి. 

ఇంకను బైబిల్‌లో యాకోబు 1:17వ వచనము మనకు గుర్తుచేయుచున్నది, ‘‘శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును; ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయయైనను లేదు’’ ప్రకారము సంపూర్ణమైన ప్రతి వరమును తండ్రి యొద్ద నుండి వచ్చునని మనకు స్పష్టంగా తెలియజేయుచున్నది. మీరు పరిశుద్ధంగా జీవించినప్పుడు ప్రభువు మీ అవసరతలన్నిటిని తీర్చి, సమృద్ధియైన ఆశీర్వాదములను మీ మీద కుమ్మరిస్తాడు. నా ప్రియ స్నేహితులారా, ఈ వాగ్దానమును నమ్మి ఇప్పుడే ప్రభువు యొద్ద నుండి ఆశీర్వాదములను అద్భుతమైన విధంగా పొందుకుందాము. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు తన సంపూర్ణతతో మిమ్మును నింపి దీవించును గాక.

ప్రార్థన:
అమూల్యమైన మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, నేడు మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. మా ప్రతి అవసరతను తీర్చే దేవుడవు కనుకనే, నీ యొక్క సమృద్ధితో మా ప్రతి అవసరతను సంపూర్ణంగా తీర్చుము. ప్రభువా, నీ యొక్క సమృద్ధి దీవెనలతో మేము ఇప్పుడే పొంగి పొర్లునట్లు చేయుము. దేవా, నీ బిడ్డలైన మా జీవితాలను తాకుము, దీవెనలను కోల్పోయిన మా జీవితాలలో ఇప్పుడే పొందుకొనునట్లుగా మా జీవితాలను మార్చుము. ప్రభువా, నీ దీవెనలను సమృద్ధియైన విధానములో మేము పొందుకొనునట్లుగా చేయుము. పరలోకపు తండ్రీ, నీ దృష్టిలో మమ్మును పరిశుద్ధులుగాను మరియు నీతిమంతులనుగా చేయుము.  ప్రభువా, నీ కృపను కోరుతూ వినయ హృదయంతో నేను మీ యొద్దకు వచ్చుచున్నాము. దేవా, నీ మార్గాలలో నడవడానికి మాకు ఆటంకం కలిగించే వాటి నుండి మమ్మును తప్పించుము. ప్రభువా, మా ఆత్మ, మనస్సు మరియు జీవంలో, మాకు ఎటువంటి లోటు రాకుండా నీ సంపూర్ణతతో మమ్మును నింపుము. దేవా, నీ నీతి మా మార్గములలో నడిపించునట్లు చేయుము. మరియు నీ పవిత్రత మా ఆలోచనలను మరియు చర్యలను ఆకృతి చేస్తుంది. దేవా, నీ సన్నిధితో మా జీవితాన్ని హృదయాన్ని నింపుము, ప్రభువా, మేము నీ సదుపాయం మరియు సమృద్ధిగా కృపను నమ్ముచున్నాము. తద్వారా మేము నీ యొక్క ప్రేమను మరియు సత్యాన్ని ప్రతిబింబింపజేయునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, అన్ని విధాలుగా మేము నిన్ను సంతోషపెట్టే జీవితాన్ని గడపడానికి మమ్మును బలపరచుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.