నా ప్రియమైన స్నేహితులారా, ఈ ఉదయకాలములో మీకు శుభములు తెలియజేయడములో నేను ఎంతగానో సంతోషించుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఫిలిప్పీయులకు 4:13వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. మనందరికి బాగా తెలిసిన వచనము ఇది. ఆ వచనము, "నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను'' అని చెప్పబడియున్నది. నా ప్రియులారా, నేను పరీక్షలకు వెళ్లుటకు ముందుగా మా అమ్మగారు ఎప్పుడు ఈ వచనమును నాకు నేర్పించేవారు. ఇంకను నేను వ్రాయవలసిన పరీక్షలకు కావలసిన వాటన్నిటిని నన్ను కూర్చుండబెట్టి నాకు చక్కగా నేర్పించేవారు. ఇంకను, నన్ను పరీక్షలకు బాగా సిద్ధపరచేవారు. అన్ని సబ్జెక్టులను నేను జ్ఞాకపముంచుకొనునట్లుగా నాకు సహాయపడేవారు. అయితే, నేను పరీక్షలకు వెళ్లడానికి ముందుగా నేను చాలా భయపడతాను. నేను ఈ సబ్జెక్టులో నేను తప్పిపోతానేమో? నేను ఉత్తీర్ణతను పొందలేనేమో? ఈ ప్రశ్నకు సరిగ్గా జవాబు వ్రాయలేనేమో? అని మా అమ్మగారితో ఆలాగున చెబుతూ, భయపడుతుంటాను.
అయితే, అప్పుడు మా అమ్మగారు నాతో ఈలాగున చెప్పేవారు, 'నీవు చక్కగా సిద్ధపడ్డావు, నీ సామర్థ్యమంతటితో నీవు సిద్ధపడ్డావు,' కాబట్టి, నీవు భయపడకుండా, "నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అని'' నీవు ఇప్పుడు ధైర్యంగా చెప్పాలి. నీవు పరీక్షలు వ్రాయుటకు ముందుగా, 'ప్రభువు నాకు బలమును ఇచ్చి, నన్ను బలపరుస్తాడు ' అని నీ హృదయములో తలంచుకొనుము. అప్పుడు ప్రభువు నీకు పరీక్షలు చక్కగా వ్రాయుటకు బలమును మరియు జ్ఞానమును అనుగ్రహిస్తాడు అని చెప్పి, నన్ను ప్రోత్సహించి, ధైర్యపరచేవారు. అదేవిధముగా, నేను ఆ పరీక్షలు వ్రాసినప్పుడు, నిజముగానే, నాలో ఒక గొప్ప సమాధానమును పొందుకున్నాను. నేను నేర్చుకున్నవాటన్నిటిని నేను గుర్తుంచుకొనునట్లుగా ప్రభువు నాకు సహాయము చేశాడు. అంతమాత్రమే కాదు, నా పరీక్షలన్నిటిలో నేను చక్కటి మార్కులతో ఉత్తీర్ణతను పొందుకున్నాను. ఇంకను ఆయన నేను అన్నిటిలోను ఉత్తీర్ణత సాధించునట్లుగా చేశాడు. దేవునికే మహిమ కలుగును గాక.
అదేవిధముగా, నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు పరీక్షలంటే భయపడుచున్నారా? మీ సామర్థ్యమంతటితో మీరు సిద్ధపడుచున్నారా? మీ భుజాలపై ఉన్న గొప్ప భాధ్యతను చూచి మీరు భయము చెందుచున్నారా? అయితే, మీరు భయపడకుండా, ధైర్యముతో చెప్పండి, "నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను'' అని మీ హృదయములో తలంచుకొనండి. నిశ్చయముగా, దేవుడు మిమ్మును తన శక్తితో బలపరుస్తాడు.
ఆలాగుననే, మా తల్లిదండ్రులు కూడా పరిచర్య కొరకు వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు, నేను టెలిఫోన్ ప్రార్థనా గోపురమునకు పోన్ చేసి, ప్రార్థనా చేయించుకుంటాను. వారు నా కొరకు ఎంతో చక్కగా ప్రార్థన చేసి, 'నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తమును చేయగలను' అని చెప్పమని, ప్రార్థనల ద్వారా నన్ను బలపరచేవారు. అందువలన, నేను పరీక్షలన్నిటిని ఎదుర్కోవడానికి ఎంతో నిరీక్షణ మరియు ధైర్యమును కలిగించినది. ఆలాగుననే, నా ప్రియులారా, నేడు, " నేను సమస్తమును చేయగలను'' అని మీరు కూడా ధైర్యంగా చెప్పండి. ప్రభువు మీకు ఆ బలమును అనుగ్రహిస్తాడు. నేడు ఈ బలమును పొందుకొనుటకు మిమ్మును మీరు ఆయనకు సమర్పించుకుంటారా? ఆలాగైతే, మనకు ఎదురుగా వచ్చే ప్రతి సవాలును మనము ఎదుర్కొందాము. ధైర్యముతో, మీ ముందుకు ఎలాంటి సవాళ్లు వచ్చినా, మీరు దేవుని బలాన్ని పొందుకొని, వాటిని నమ్మకంగా ఎదుర్కోండి. నిశ్చయముగా, దేవుడు తన బలముతో మిమ్మును నింపి, మీరు సమస్తమును చక్కగా జరిగించి, ఆయన నామమునకు ఘనతను తీసుకొని వచ్చునట్లుగా చేస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
సర్వక్తిగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ వాగ్దానంతో మమ్మును ప్రోత్సహించినందుకు నీకు కృతజ్ఞతలు. ఇంకను దేవా, మమ్మును బలపరచు క్రీస్తు ద్వారా మేము సమస్తమును చేయగలమని నీవు మాకు నమ్మకాన్ని కలిగించినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసయ్యా, పరీక్షలు వ్రాయబోయే మా కొరకు మరియు మా ప్రియులందరి కొరకు ప్రార్థించుచున్నాము. దేవా, పరీక్షలను గురించి మా హృదయములో ఉన్న భయముంతటిని తొలగించుము. దేవా, 'నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తమును చేయగలను' అని మేము చెప్పునట్లుగా, నీ దైవీకమైన బలముతోను, మమ్మును నింపుము. మరియు నీ యొక్క దైవీకమైన జ్ఞానమును మాకు దయచేయుము, నీ ధైర్యమును మాకు అనుగ్రహించుము, సమాధానముతో పరీక్షలను ఎదుర్కొని, వాటిని చక్కగా వ్రాయుటకు నీ కృపను మాకు దయచేయుము. దేవా, మేము మంచి మార్కులతో, అన్ని సబ్జెక్టులలోను ఉత్తీర్ణతను పొందుకొనునట్లుగా సహాయము చేయుము. ఓ ప్రభువా, మాకు కావలసిన జ్ఞానం మరియు తెలివిని మాకిమ్ము. దేవా, నీవే మా బలం, మా సహాయకుడవు మరియు మా మార్గదర్శివని మేము తెలుసుకొని విశ్వాసంతో నడవడానికి మాకు సహాయం చేయుము. దేవా, మేము నీలో, సమస్తమును చేయుటకు మరియు మాకు కావలసిన విజయాన్ని సాధించుటకు కృపను దయచేయుము. దేవా, మా భుజాల మీద గొప్ప బాధ్యత ఉన్న మా జీవితములో ప్రతి సవాలును ఎదుర్కొనే బలమును మాకు అనుగ్రహించుము. మేము సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు, ఈ సత్యాన్ని నమ్మకంగా ప్రకటించడానికి మాకు కృపనిమ్ము. దేవా, నీ శాంతి సమాధానము మా హృదయాలను ఏలునట్లుగా చేయుమని యేసు క్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.