హలో నా ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలములో మీకు శుభములుతెలియజేయుటలో నాకెంతో ఆనందముగా ఉన్నది. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 4:23వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, ‘‘నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము’’ ప్రకారము, అవును ప్రియులారా, హృదయమును కాపాడుకొనుట ఎంతో ప్రాముఖ్యము. ఎందుకనగా, హృదయములో నుండియే, అన్నియు బయలుదేరును. జీవజలధారలు, హృదయములో నుండి బయలుదేరును.

ఒక తోటలో పనిచేయుచున్న ఒక తోటమాలిని మనము చూచినట్లయితే, అతడు ఆ పూల మొక్కలన్నిటిని నాటుతాడు. పూల మొక్కల ఎదుగుదలకు ఆటంకము కలిగించే కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్తపడతాడు. కలుపు మొక్కలను చూచినప్పుడు, వేర్లతో సహా వాటిని పెకలింపజేస్తాడు. మొదలను మాత్రమే కత్తిరించడము కాదు, వాటి పూలను కత్తిరించడము కాదు, అవి మరల మొలవకుండా, వేర్లతో సహా వాటిని తొలగిస్తాడు. మంచి మొక్కల సారాన్ని అవి ఇక తీసుకొనలేవు. పూల మొక్కలన్నియు చక్కగా ఎదుగుతూ, అన్ని వికసిస్తూ, చక్కగా ఉంటాయి. అదేవిధముగా, మన హృదయములో ప్రతిరోజు అనేక విషయాలను తీసుకుంటాము. మంచిని, చెడును తీసుకుంటాము. కలుపు మొక్కలు ఎదుగుతుంటాయి, మంచి మొక్కలు ఎదుగుతుంటాయి. అయితే, మంచి పూల మొక్కలు ఎదుగునట్లుగా మనము జాగ్రత్త పడాలి. అదేమనగా, మనము వినుచున్న చెడు మాటలు, మన జీవితములో మనకు ఎదురయ్యే చెడు ప్రభావము, మన హృదయములో ఎదగడానికి అనుమతించే ఆలోచనలు, మన హృదయములో ఎదిగి మంచి పూల మొక్కల యొక్క ఎదుగుదలను ప్రభావితము చేయకూడదు. మంచి గుణాలను, మంచి లక్షణాలను, మంచి ఆలోచనలను, స్వచ్ఛమైన పరిశుద్ధముగా మనము మన హృదయాలలో ఎదగాలి. ప్రతి రోజు మనలో ఎదిగే కలుపు మొక్కలను మనము తొలగించుకోవాలి. అవి, గర్వముతో కూడిన ఆలోచనలను, అసూయతో కూడినటువంటి ఆలోచనలు, పగతో కూడినటువంటి తలంపులను, అశుద్ధకరమైన ఆలోచనలను, అపరిశుద్ధమైనవి, దేవునికి ఇష్టములేనటువంటి ఆలోచనలు, వాటి ప్రభావమునంతటిని మన హృదయములో నుండి తొలగించాలి. దేవునితో మనకున్న సంబంధాన్ని చెరిపివేసే ఆలోచనలన్నిటిని తొలగించాలి. అప్పుడు మన జీవితాలు వికసిస్తాయి. 

అందుకే, బైబిల్ గ్రంధములో, ‘‘ హృదయము నిండిన కొలది నోరు మాట్లాడుతుంది’’ అని వ్రాయబడి ఉండుట మనము చూడగలము. కోపముతో నిండియున్న వ్యక్తిని చూచినప్పుడు, వారి హృదయములో ఎన్నో రోజుల నుండి కలిగియున్నటువంటి ఆ మాటలన్నిటిని బయటకు అంటారు. వారి యొక్క నిజమైన లక్షణాలను బయటకు రావడము అప్పుడే చూడగలము. అటువంటి పరిస్థితులలో కూడ మనము మంచి ఆలోచనలను, మంచి మాటలను, మంచి లక్షణాలను, మంచిని మాత్రమే ప్రదర్శించాలి. కాబట్టి, నా ప్రియ స్నేసితులారా, మంచిని మీ హృదయములో ఉండునట్లుగా చూచుకొనండి. యేసు లక్షణాలు మీ హృదయములో ఉండునట్లుగా, మంచి మాటలు, పదాలు మీ హృదయాలలో ఉండునట్లుగా, అన్నిటికంటె, పరిశుద్ధాత్ముడు మీ హృదయములో ఉండునట్లుగా,ఈ రోజే మీ హృదయము వైపు చూడండి. మీ హృదయములో ఉన్న కలుపు మొక్కలన్నిటిని మీ హృదయము నుండి తొలగించుకొనండి. అప్పుడు మీ హృదయములో చక్కటి పూల వనము ఉండును గాక. మంచితనమును ఎదుగజేసే చక్కటి పూల వనముగా దేవుడు మన హృదయమును చేయునట్లు మనము దేవుని ప్రార్ధిద్దామా? నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక. 

ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ ఆత్మను, నీ యొక్క గుణలక్షణాలను మాలో ఉంచినందుకై నీకు వందనాలు. యేసయ్యా, ఈ రోజే మా హృదయమును నీ అదుపులోనికి తీసుకొనుము. దేవా, మా హృదయములో ఎదుగుచున్న కలుపు మొక్కలను మాకు కనుపరచండి. వాటిని మా హృదయములో నుండి వేర్లతో సహా పెకలించగల కృపను మాకు దయచేయుము. ప్రభువా, మాలో ఉన్న శరీరాలోచనలను, గర్వపు ఆలోచనలను, అసూయ తలంపులను, దురాశ ఆలోచనలను, హృదయములోనికి అపరిశుద్ధమైన వాటన్నిటిని పెకలించగలిగే శక్తిని దయచేయుము. దేవా, నీవు మా హృదయములో నాటే మంచి విషయాలన్నియు ఎదుగునట్లుగా చేయుము. అవి అందముగా మా జీవితములో వికసించునట్లు చేయుము. ప్రభువా, మా హృదయములో నీ యొక్క ఆత్మను భద్రపరచుకొనునట్లు చేయుము. మా ఆలోచనలన్నిటిని పరిశుద్ధంగాను, సంకల్పాలన్నిటిని పరిశుద్ధంగాను ఉంచుకొనునట్లు చేయుము. దేవా, నీ గుణాలను ఎల్లప్పుడు మేము మా హృదయములో భద్రము చేసుకొనునట్లుగా చేయుము. యేసయ్యా, మేము ఏమి మాట్లాడిన ఏమి చేసిన, నీ గుణములను మేము ప్రదర్శించునట్లు చేయుము. దేవా, మా హృదయములో నుండి జీవధారాలు పుట్టునట్లుగా కృపను దయచేయుము. ప్రభువా, మా హృదయములో నీ మంచి స్వభావములు పని చేయునట్లుగా కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు శక్తిమంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.