నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 103:4వ వచనమును దేవుడు మనకు అనుగ్రహించియున్నాడు. ఆ వచనము, "సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచు చున్నాడు'' ప్రకారం నేడు ఆయన కరుణా కటాక్షములను కిరీటముగా మీకు ధరింపజేయాలని మీ పట్ల కోరుచున్నాడు. మరియు కీర్తనలు 103:5వ వచనములో గొప్ప అద్భుతమైన వాక్యభాగమును మనము చూడగలుగుచున్నాము. ఆ వచనము, "పక్షిరాజు యౌవనమువలె నీ యౌవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు'' ప్రకారం నాశనములో నుండి మనలను విమోచించగలిగినవాడు మన దేవుడు మాత్రమే.
కనుకనే, నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు చెడు మార్గములో జీవించుచున్నారేమో? నాశనమునకు నడిపించే జీవితము. ఒకవేళ, మీరు త్రాగుబోతులై వున్నారేమో? వ్యభిచారులై ఉన్నారేమో? ఒకవేళ మేము ఎలా మారగలము? అని అనుకుంటున్నారేమో? కానీ, ప్రభువు మీకు నూతనమైన జీవితమును నేడు ఇవ్వగలడు. చక్కని దీవెనకరమైన జీవితమును నేడు ప్రభువు మీకు ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. అందుకే బైబిల్‌లో చూచినట్లయితే, యోహాను 4వ అధ్యాయములో మనము ఒక స్త్రీని గురించి చదువుతాము. ఆమె ఒక సమరయ స్త్రీ. ఆమె అనేక పాపములతో నిండియున్నది. ఆమె ఈ లోక ఇచ్ఛలకు మరియు శరీరాశలకు బానిసై పోయెను. ఇంకను అనేకమంది భర్తలు అమెకు ఉన్నారు. అనైతికమైన జీవితమును ఆమె జీవించుచున్నది. అటువంటి పరిస్థితిలో బావి యొద్ద నీళ్లు చేదుకోవడానికి ఆమె అక్కడకు వచ్చినది.
అక్కడ యేసుప్రభువు కూర్చుని విశ్రాంతి తీసుకొనుచుండెను. సర్వశక్తుడైన దేవుని స్వరాన్ని ఆమె అక్కడ వినెను. అవును, యేసు ప్రభువు సర్వశక్తుడైన దేవుడుగా ఉన్నాడు. ఆ స్త్రీ యొక్క హృదయాన్ని ఆయన ఎరిగియున్నాడు. ఇంకను ఆమె ఎలా జీవించుచుండెనో ఆయన ఎరిగియున్నాడు. ఆమె జీవించుచున్న జీవితాన్ని ఆయన ఆమెకు తెలియజేశాడు. అందుకే, ఆమె జీవించుచున్న జీవితమును ఆయన ఆమె యందు జాలిపడ్డాడు. కనుకనే, ఆయన ఆమెతో ఆదరణ మాటలు పలికెను. కనుకనే, ఆమె సర్వశక్తుని యొక్క స్వరాన్ని విన్నది. ఆమె ఆయన మాటలు వినగానే, ఆమె సంపూర్ణంగా రూపాంతరపరచబడినది. ఆయనను తన రక్షకునిగా అంగీకరించినది. అంతమాత్రమే కాదు, యేసయ్యను గురించి ఇతరులకు చెప్పడానికి ఆ ఊరిలోనికి వెళ్లి, యేసును గురించిన మాటలు ఆ ప్రజలకు తెలియజేసెను. అవును నా ప్రియులారా, అదే దేవుడు మీ జీవితాన్ని విమోచించి, రూపాంతరపరచగలడు. ప్రభువు మీకు నూతన జీవితమును ఇవ్వగలడు. క్రీస్తుతో నిండిన జీవితము, పాపము నుండి మీరు విమోచించబడునట్లుగా చేస్తాడు.
నా ప్రియులారా, నేడు పాపము లేనటువంటి జీవితము మీకు అనుగ్రహిస్తాడు. అది ఎలాగున జరుగుతుంది అని మీరు ఆశ్చర్యపడుచుండవచ్చును? దేవుని వాక్యము మీ జీవితమును మార్చగలదు. అవును యేసయ్య, ఆమెతో మాట్లాడాడు. ఆమె ఒక పాపి. కానీ, ఆ తర్వాత, ఆమె ఇతరులకు యేసయ్యను గురించి చెప్పగలిగి యున్నది. నా ప్రియులారా, మీ జీవితములో కూడా ఇప్పుడే అదేకార్యము జరుగబోవుచున్నది. అటువంటి జీవితమును మీరు పొందుకోవాలంటే, కేవలము ప్రభువు వైపు చూడండి, మీ కొరకే, ఆయన ఆ సిలువపై తన ప్రాణమును అప్పగించాడు. కనుకనే, నేడు మీరు ఆయనను హత్తుకొనండి మరియు ఆయనకు ఈలాగున మొఱ్ఱపెట్టండి, " ప్రభువా, మా పాపములను క్షమించుము, మాకు నూతన జీవితమును అనుగ్రహించుము, నీ ప్రశస్తమైన రక్తముతో మమ్మును కడుగుము'' అని ఆలాగున ప్రార్థించుకుందాము. ఆ సమరయ స్త్రీ నూతన జీవితాన్ని పొందుకున్నట్లుగా, మీరు కూడా ఇప్పుడే, నూతనమైన ఆశీర్వాదమును పొందుకొనబోవుచున్నారు. కాబట్టి, ఇప్పుడు ఆయనకు మొఱ్ఱపెట్టండి, అటువంటి గొప్ప ధన్యతను మీరు పొందుకొనండి. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
అమూల్యమైన ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, బ్రద్ధలైన మా జీవితమును నీకు ఉపయోగపడునట్లుగా వాడుకొనునట్లుగా మేము నీ సన్నిధికి వచ్చుచున్నాము.యేసయ్యా, మా పాపాలన్నిటిని క్షమించి, నీ యొక్క విలువైన రక్తంతో మమ్మును కడిగి శుద్ధులనుగా చేయుము. ప్రభువా, మా జీవితాన్ని నాశనం నుండి విమోచించుము మరియు నీ దయతో మమ్మును కరుణాకటాక్షముగల కిరీటంగా మార్చుము. యేసయ్యా, సమరయ స్త్రీ వలె, మా పాపపు జీవితాలను సంపూర్ణంగా మార్చుము. దేవా, మా హృదయాన్ని నీ ప్రేమ మరియు సత్యంతో నింపుము. ప్రభువా, మా జీవితము పక్షిరాజు యౌవనము వలె మేము పునరుద్ధరించబడునట్లుగాను మరియు నిన్ను హత్తుకొని జీవించడానికి మాకు సహాయం చేయుము. దేవా, నేడు మా పాపపు జీవితమును నీ రక్తము ద్వారా విమోచింపబడుటకు మేము నిన్ను విడువకుండా గట్టి పట్టుకొనుటకు కృపను అనుగ్రహించుము. దేవా, మా జీవితం నీ కృపకు సాక్ష్యంగా ఉండునట్లుగా చేయుము. ప్రభువా, నూతన జీవితమును మరియు క్రీస్తుతో నిండిన జీవితాన్ని మాకు దయచేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడవైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.