నా అమూల్యమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఈ రోజు డిసెంబరు 30వ తారీఖు, ఈ సంవత్సరమునకు మరొక్క రోజు మాత్రమే ఉన్నది. మనము సంవత్సరము అంతములో ఉన్నాము, ఈ సంవత్సరములో ఎన్నో శ్రమలు మరియు హృదయ వేదనలను ఎదుర్కొన్నాను అని అనుకుంటున్నారా? అయితే, ఈ రోజు ఒక అద్భుతమైన వచనమును మనము ధ్యానించుకుందాము. ఆ వాగ్దాన వచనము బైబిల్ నుండి కీర్తనలు 147:3 వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు'' ప్రకారం నా ప్రియ స్నేహితులారా, మనము చివరి రోజులలో ఉన్నాము, మీ గుండె చెదరిపోయిన వారిగా ఉన్నారా? ఈ వర్తమానము మీ కొరకే. హృదయము విరిగిన పరిస్థితిలన్నిటిలో నుండి బయటకు తీసుకొని రావాలని ప్రభువు ఇక్కడ మీ కొరకు వేచి ఉన్నాడు. ఇంకను మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటి నుండి మీరు విడుదల పొందాలని ప్రభువు మీ పట్ల ఆశించుచున్నాడు. కనుకనే, మీరు ధైర్యంగా ఉండండి.
కనుకనే, నా ప్రియులారా, మీ జీవితం గురించి ఆలోచించడానికి ఒక్క క్షణం వెచ్చించండి. ప్రభువుతో మీరు అన్యోన్య సహవాసము కలిగియున్నారా? మీ జీవితమును ఒక్కసారి పరీక్షించుకొనండి. ప్రతి విషయములోను మీరు ప్రభువు మీద ఆధారపడుచున్నారా? ఆలాగైనట్లయితే, మీరు దేవునికి సాక్షులుగా ఉంటారని వాక్యము సెలవిచ్చుచున్నది. అందుకే బైబిల్‌లో యెహోషువ 24:22,23వ వచనములలో మనము చూచినట్లయితే, "అప్పుడు యెహోషువ మీరు యెహోవానే సేవించెదమని ఆయనను కోరుకొన్నందుకు మిమ్మును గూర్చి మీరే సాక్షులై యున్నారనగా వారు మేము సాక్షులమే అనిరి. అందుకతడు ఆలాగైతే మీ మధ్య నున్న అన్యదేవతలను తొలగద్రోసి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పుకొనుడని చెప్పెను.'' కనుకనే, నేడు మీరు ప్రభువు కొరకు సాక్షులుగా ఉన్నారా? నా ప్రియ స్నేహితులారా, మీ సమస్యలన్నిటి నుండి మీరు పరిపూర్ణముగా బయటకు రాగలరని మీరు విశ్వసించుచున్నారా? కాబట్టి, మీరు నమ్మినట్లయితే, దేవుని మహిమను చూచెదరని వాక్యము సెలవిచ్చుచున్నది. యేసు ప్రభువు స్వయంగా ఈ మాటలను తెలియజేసియున్నాడు, "నీవు నమ్మినట్లయితే, దేవుని మహిమను చూచెదరు'' అని చెప్పబడినది.
ప్రవక్తయైన సమూయేలు తల్లియైన హన్నాకు సంతానము లేదు. అయితే, పెన్నినాకు ఎంతో మంది పిల్లలు కలరు. తను ఎల్లప్పుడు ఎంతగానో హన్నాను విసిగించుచుండెను. తద్వారా, హన్నా ఎంతగానో వేదన పడుచుండేది. అంతమాత్రమే కాదు, తన నిందను మరియు అవమానమును బట్టి కన్నీటితో విలపించుచుండెను. తద్వారా, హన్నా హృదయము విరిగిపోయినది. అప్పుడు తాను ఒక కార్యము చేసినది. దేవుని సన్నిధానమునకు వెళ్లినది. దేవుని సన్నిధి యెదుట మోకరించినది. తన వేదన అంతటిని ప్రభువు చెంత కుమ్మరించినది. ఆమె దేవునికి మొఱ్ఱపెట్టినది. ప్రభువు తన మొఱ్ఱను ఆలకించాడు. దీవించబడిన ప్రవక్తయైన సమూయేలుతో పాటు ఎంతో మంది పిల్లలను దేవుడు ఆమెకు దయచేశాడు. అదేవిధముగా, మీకు సంతానము లేదని చింతించుచున్నారా? లేక అవమానమును ఎదుర్కొంటున్నారా?చింతించకండి. ఇప్పుడే మీ హృదయము విరిగిపోయిన పరిస్థితి నుండి పరిపూర్ణముగా మారిపోతుంది. మీరు దానిని నమ్ముచున్నారా? అయితే, రండి ప్రభువు సన్నిధిలో ప్రార్థిద్దాము. అదేవిధంగా, నూతన సంవత్సరం అంచున నిలబడి ఉన్న మనం, ఆయన ముందు మోకరిల్లుదాము.
నా ప్రియ స్నేహితులారా, ప్రభువు యెదుట మిమ్మును మీరు తగ్గించుకొనండి. నా జీవితములో ఒకసారి శ్రమ ఎదురైనప్పటికిని, నేను మోకరించి ప్రభువు సన్నిధిలో ప్రార్థించాను, ప్రభువు ఆ సమస్య నుండి నన్ను బయటకు తీసుకొని వచ్చాడు. అదేవిధంగా నా ప్రియ స్నేహితులారా, సంవత్సరాంతములో మనము ఉంటుండగా, ప్రభువు సన్నిధిలో మోకరిల్లుదాము, స్నేహితులారా, ఇప్పుడే దేవుని యెదుట మోకరించండి, ప్రభువునకు మొఱ్ఱపెట్టండి, మీ హృదయ వేదన అంతటిని ఆయన సన్నిధిలో కుమ్మరించినప్పుడు ఈ చివరి దినములలో అద్భుతములను మీరు చూడబోవుచున్నారు. హల్లెలూయా! అద్భుతము మీకు సమీపముగా ఉన్నది. మీ జీవితములో మీరు గొప్ప అద్భుత కార్యాన్ని ఎదురు చూడండి, ఇప్పుడే అద్భుత కార్యములు మీ యొద్దకు వస్తున్నాయి. అద్భుతకరుడు మీ మధ్యలో ఉన్నాడు. ఆయన మీ అవసరతలన్నిటిని తీరుస్తాడు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నీ వాగ్దానము ద్వారా నేడు నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ సన్నిధికై వందనములు, నీ బిడ్డలైన మేము నీకు మొఱ్ఱపెట్టుచున్నాము. దేవా, మా కన్నీటిని ఆనందముగా మార్చగలిగే అద్భుతకరుడవైన దేవుడవు నీవే. కనుకనే దేవా, నేడు మా వసరతలన్నిటిని నీ ఐశ్వర్యములో తీర్చుము. ప్రభువా, నేడు నీ వాగ్దానమును మా పట్ల నెరవేర్చి, మమ్మును దీవించుము. దేవా, మేము సవాళ్లు మరియు బాధలచే భారముతో నిండిన హృదయంతో నీ ముందుకు వచ్చుచున్నాము. ప్రభువా, నీవు చెదరిన గుండెను బాగుచేయువాడవు మరియు మా గాయాలను కట్టువాడు కనుకనే, నేడు మా చెదరిన గుండెను బాగు చేసి, మా గాయములను నేడు కట్టుమని వేడుకొనుచున్నాము. దేవా, మా ప్రతి భారాన్ని, చింతను మరియు దుఃఖాన్ని నీ ప్రేమగల చేతుల్లోకి మేము అప్పగించుచున్నాము. దేవా, నీవు మా పట్ల అద్భుతకరుడవుగా ఉన్నందుకై నీకు వందనాలు. కనుకనే, మమ్మును బయటకు తీసుకొని రావడానికి ఎల్లప్పుడూ నీవు మాకు సమీపంలో ఉన్నావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మా ఆత్మను పునరుద్ధరించడానికి మరియు రూపాంతరపరచడానికి నీ శక్తిని మేము నమ్ముచున్నాము. దేవా, మా హృదయాన్ని నీ సమాధానముతోను మరియు మా ఆత్మను నీ యొక్క సంతోషంతో నింపుము. ప్రభువా, నీ యొక్క ఎడతెగని ప్రేమను విశ్వసిస్తూ నీతో సన్నిహితంగా నడవడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీ అద్భుత కార్యాలను చూచినప్పుడు నీ మహిమ మా జీవితంలో ప్రకాశింపజేయుము. ప్రభువా, మా దుఃఖాన్ని ఆనందంగా మరియు మా నిరాశను స్తుతులుగా మార్చుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.