నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 126:5వ వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, ‘‘కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు’’  అను ఈ మాట ఇక్కడ చెప్పబడియున్నది. ప్రభువైన దేవుని యెదుట మనము విడుచుచున్న ప్రతి కన్నీటిని కూడా ఆయన లెక్కించియున్నాడు. నిశ్చయముగా మీ యొక్క కన్నీరు ఆశీర్వాదకరముగా ఉండబోవుచున్నవి. మీరు కార్చిన కన్నీరు అంతటికిని మీరు నవ్వుతూ ఉండబోవుచున్నారు. మీరు కార్చిన కన్నీటికి ప్రతిగా, మీరు విజయోత్సగానముతో కేకలు వేయుబోవుచున్నారు. మరియు బైబిల్ నుండి కీర్తనలు 126:2 వచనములో మనము చూచినట్లయితే, ‘‘మనము కలకనినవారివలె నుంటిమి మన నోటి నిండ నవ్వుండెను మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్పకార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి’’  అని వ్రాయబడియున్నది. కనుకనే, మీరు దిగులుపడకండి. 

నా ప్రియులారా, నేడు మీ ప్రార్థనలకు దేవుడు జవాబును అనుగ్రహించినప్పుడు, మీరు గంతులు వేయువారి వలె ఉండెదరు. అప్పుడు ఇతరులు మీ హృదయములో ఉన్న ఆనందమును మరియు సంతోషమును గుర్తించెదరు. మీ పొరుగువారు, మీ బంధువులు, మీకు సంబంధించినవారు, మిమ్మును చూచి, ‘ప్రభువు మీ కొరకు గొప్ప కార్యములు చేసియున్నాడు ’ అని చెబుతారు. నా ప్రియ స్నేహితులారా,ఈలాగున మీ కొరకు జరుగబోవుచున్నది. మీరు నిరంతరాయంగా రోధిస్తూ ఉండబోవడం లేదు. నేడు ప్రభువు మీ యొక్క కన్నీటికి ఆయన అంతమును పలుకబోవుచున్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజలకు ప్రభువు ఆ రీతిగానే చేసియున్నాడు. సీయోనుకు తిరిగి వచ్చినప్పుడు, యెహోవా వారిని చెరలో నుండి విడిపించినప్పుడు, వారు మనము కలకనినవారివలె నుంటిమి అని వారు చెప్పుట మనము చూడగలము. ఇశ్రాయేలీయుల ప్రజలు 70 సుదీర్ఘ సంవత్సరములు చెరయందు నివాసము ఉన్నారు. అది చాలా సుదీర్ఘమైన సమయము. దాదాపుగా ఒక తరము ప్రజా జీవితము గడిచిపోయినది. కేవలము, ఆ తర్వాత మాత్రమే దేవుడు వారిని చెర నుండి విడిపించియున్నాడు. వారు బబులోను నుండి తిరిగి వచ్చిన తర్వాత, సంతోషముతోను, నవ్వుతోను, ఆనందముతో నింపబడి ఉండి యున్నారు. కానీ, అది వారికి కల కనినట్లుగా ఉండెను. ప్రభువు వారిని పునరుద్ధరింపజేసియున్నారను సంగతిని వారే నమ్మలేకపోయారు. వారే, అక్షరాల కల కన్నామా? లేక నిజముగా జరుగుతుందా? అని తమ్ముతాము, గిల్లి చూచుకోవలసి వచ్చినది. కనుకనే, మీరు నేడు దుఃఖపడుచున్నారా? భయపడకండి, మీకును కూడా దేవుడు ఆలాగుననే చేస్తాడు. 

ఇదే రీతిగా, మరియొక సంఘటన ఉన్నది, అది పేతురు చెరసాల నుండి విడిచిపించబడియున్న విధానమును మనము చూడగలము. బైబిల్‌లో, అపొస్తలుల కార్యములు 12:13-19వ వచనములను మనము చూచినట్లయితే, ఉన్నతాధికారులు శిక్షను అమలుపరచి, పేతురును చంపివేయుటకు ప్రణాళికలు సిద్ధము చేశారు. పేతురు అయితే, చెరసాలలో ఉండెను. ఏ మాత్రము కూడా అతనికి నిరీక్షణ లేదు. అయినప్పటికిని, శిష్యులును, విశ్వాసులును, మరియ యింట చేరి, నిరంతరాయముగా ప్రార్థనలు చేశారు. వారి ప్రార్థనలను బట్టి, వారిని విడిపించుట కొరకు దేవుడు ఒక దూతను పంపించియున్నాడు. అప్పుడు అతని యొక్క సంకెళ్లన్నియు కూడా బ్రద్ధలైపోయాయి. ఒక దూత ద్వారా పేతురు, మరియ యింటికి తీసుకొనరాబడ్డాడు. చివరిగా మరియ యింటికి చేరి, అతడు వారి యొక్క తలుపును తట్టుచున్నప్పుడు, అతని స్నేహితులు, విశ్వాసులు గానీ, నిజముగానే వచ్చినది పేతురు అని వారు నమ్మకమలేకపోయారు. ఒకవేళ అతని దూత వారి యొద్దకు వచ్చినదేమో అని అనుకున్నారు.చివరికి రోదె అను చిన్నది కూడా కనీసము తలుపులు కూడా తెరువలేదు. అది వారికి ఒక కల కనినట్లుగా ఉండెను. ప్రభువు వారి ప్రార్థనలకు జవాబు ఇచ్చాడు అను సంగతిని కూడా వారు నమ్మలేకపోయారు. 

అవును, నా ప్రియ స్నేహితులారా, ఒక అద్భుత కార్యము జరిగించబడడానికి మీరు సుదీర్ఘ కాలము నుండి వేచి ఉంటూ, ప్రార్థన చేయుచున్నారేమో? ప్రియులారా, ప్రభువు నిశ్చయముగా మీ ప్రార్థనలు ఆలకించి, మీకు ఒక అద్భుత కార్యమును జరిగించును. ప్రభువు మీ యొక్క ప్రార్థనను ఆలకించి, మీకు జవాబును అనుగ్రహిస్తాడు. దేవుడు మీ ప్రార్థనలు ఆలకించి, మీకు జవాబు ఇచ్చినప్పుడు, అది ఒక కలవలె మీకు కూడా ఉంటుంది. మీరు కన్నీళ్లతో విత్తనములు విత్తుచుండగా, సంతోషగానముతో పంట కోసెదరు. బైబిల్‌లో 2 దినవృత్తాంతములు 15:7 వ వచనములో మనము చూచినట్లయితే, బలముగా ఉండండి, ఏ మాత్రము విడిచిపెట్టకండి. ఎందుకనగా, మీ క్రియ సఫలమవుతుంది. ప్రియ స్నేహితులారా, మీరు నిశ్చయముగా పంటను కోసెదరు. దేవుడు మీ యొక్క జీవిత ప్రయాణమును కన్నీటి వైపు నుండి, ఆనందము వైపునకు ఆయన తీసుకొని వెళ్లుచున్నాడు. కనుకనే, నిరంతరాయముగా ప్రార్థన చేయండి, నిత్యము ఆయనను అడుగుచు ఉండండి. నిరంతరాయముగా తలుపును తట్టుచు ఉండండి. మీ యొక్క జవాబు మార్గమధ్యములో ఉన్నది. మీ యొక్క కన్నీరు అంతయు కూడా, ఆనందమయముగా మార్చబడబోవుచున్నది. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీ దుఃఖమును సంతోషముగా మార్చి, మిమ్మును దీవిస్తాడు.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకందున్న తండ్రీ, నీ ప్రేమపూర్వకమైన వాగ్దానానికి నీకు వందనాలు. దేవా, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, మేము కార్చిన ప్రతి కన్నీటి బొట్టును  నీవు చూస్తున్నావు మరియు నీవు మా దుఃఖాన్ని ఆనందంగా మారుస్తావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మా ప్రార్థనలు వ్యర్థం కావనియు మరియు నీవు మా మేలు కొరకు తెరవెనుక పనిచేస్తున్నావని మేము నమ్ముచున్నాము. దేవా, మా  ప్రార్థనలకు జవాబిచ్చుచున్నప్పుడు మా హృదయాన్ని నవ్వుతో మరియు మా నాలుకను ఆనందపు కేకలతో నింపుము. ప్రభువా, మా చుట్టూ ఉన్నవారు మా జీవితంలో నీ బలమైన చేతిని చూసి, ప్రభువు గొప్ప కార్యాలు చేసాడు! అని చెప్పునట్లుగా చేయుము. దేవా, మా జవాబు మార్గమధ్యలో ఉన్నదని మేము నమ్ముతూ ప్రార్థించుచూ, అడుగుతూ, మరియు తట్టుతూ ఉండటానికి మాకు నీ బలాన్ని దయచేయుము. ప్రభువా, మేము సందేహం కంటే విశ్వాసాన్ని మరియు నిరాశ కంటే సహనాన్ని ఎంచుకొనునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. దేవా, మా జీవిత పయనములో ఉన్న కన్నీళ్ల నుండి మహిమకు మార్చుము మరియు మా జీవితం నీ యొక్క నిరంతరమైన ప్రేమకు సాక్షులుగా ఉండునట్లుగా మాకు నీ కృపను దయచేయుమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.