నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు మీకు శుభములు తెలియజేయడం నా కు చాలా ఆనందంగా ఉన్నది. మీరు ఆత్మలో ఎంతో ఉత్సాహంగా ఉన్నారనియు మరియు ప్రభువు యొద్ద నుండి మీరు నూతనమైనదానిని ఎదురు చూస్తున్నారనియు నాకు తెలుసు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 37:28వ వచనము ద్వారా దేవుడు ఈ రోజు మనతో మాట్లాడవలెనని కోరుచున్నాడు. నేడు మీరు ఈ వాగ్దాన వచనమును మీ హృదయములోనికి అంగీకరించి, దానిని మీరు స్వతంత్రించుకొనండి. ఆ వచనము, "ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును.'' అవును, జీవితములో న్యాయమును అనుసరించువారిని మరియు ఎవరైతే, న్యాయ మార్గములను వెంబడిస్తారో వారిని దేవుడు ప్రేమించుటకు సమర్థుడై యున్నాడు.

ఒకసారి, ఒక షాప్‌లో కొనుగోలును ముగించిన తర్వాత, ఆ షాప్‌ను విడిచిపెట్టి మేము బయటకు వచ్చిన తర్వాత, ఆ షాప్ యజమాని మా వెనుకనే పరుగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా, మీ పర్సును మీరు మరచిపోయారు అని చెప్పాడు. అది చూచి నేను నిర్ఘాంతపోయాను. అతడు మరల పరుగెత్తుకుంటూ దానిని తీసుకొని తిరిగి నా యొద్దకు వచ్చాడు. ఎందుకనగా, ఈ రోజులలో న్యాయమైన, నీతిగల, నిజమైన ప్రజలను కనుగొనడము చాలా అరుదు. ఆ వాలెట్‌లో ఒక రూపాయి నోటు కూడ పోలేదు. ఆ దృశ్యాన్ని నేను నిజంగా చూచినప్పుడు, అతని మీద నేనెంతగానో గౌరవాన్ని పెంచుకున్నాను. ఈ దుకాణికి వెళ్లినట్లయితే, ఏమాత్రము మనము మోసగింపబడమని గ్రహించాను. అతడు చాలా నిజమైన వ్యక్తి. అవును నా ప్రియ స్నేహితులారా, న్యాయవంతుల మార్గములు ఆ రీతిగా ఉంటాయి. వారు ఏ మాత్రము కూడా చెడును జరిగించడానికి ఇష్టపడరు. ఆలాగుననే, మనము కూడ ఉండాలని దేవుడు మన పట్ల కోరుచున్నాడు. కాబట్టి, ధైర్యంగా ఉండండి.

అదేవిధంగా, నా దగ్గర పనిచేసిన మరో వ్యక్తి కూడా ఇటువంటి స్వభావమును కలిగి ఉన్నాడు. నేను అతని తప్పులను కొన్నింటిని ఎత్తి చూపినప్పుడు, అతను వెంటనే వాటిని గుర్తించి వాటికి బాధ్యత వహిస్తాడు. నేను చేసిన పనిలో కొన్నింటిని కొదువుగా ఉన్నాయి, కొన్ని సరిగ్గా చేయలేకపోయాను అని చెప్పి అతను స్పందించినప్పుడు, నేను ఎంతగానో అతని పట్ల ఆనందించాను. నేను ఈసారి దానిని సక్రమముగా చేస్తాను, అందులో నేను ఎలాంటి పొరపాట్లను అనుతించను అని చెప్పి, అతను మరొకసారి తాను ఉత్తమమైన పనిని చేయాలనే తన సంకల్పాన్ని కూడా వ్యక్తపరచాడు. అవును నా ప్రియులారా, అనేక ఫర్యాయములు ప్రజలు తమ తప్పిదములను దాచుకుంటారు. కానీ, హృదయములో న్యాయము ఉన్నవారు దాచుకోవడం ఏ మాత్రము సహించుకోలేరు. వారు ముఖాముఖిగా చెబుతారు. అది పొరపాటైతే, దానిని వారు వెంటనే అంగీకరిస్తారు. అటువంటి న్యాయమును కలిగి ఉండడము మరియు నిజమైన దానిని కొరకు నిలబడడము, దానిని చేపట్టుకొని ఉండడము చాలా ప్రాముఖ్యమైన విషయము కదా.

నా ప్రియులారా, కొన్ని ఫర్యాయములు మనము తప్పు చేసినప్పటికిని, దేవుని యొద్ద పశ్చాత్తాపము కోరుచూ, దానిని సవరించుకోవడము చాలా ప్రాముఖ్యమైన ఒక కార్యము. తాము చేసిన దానిలో తప్పిదము ఉన్నదని అంగీకరించి, తన యొద్దకు వచ్చిన వారిని దేవుడు ఎంతగానో ప్రేమించుటకు ఇష్టపడుచున్నాడు. సమాజములో అన్యాయము చేత అణిచివేతకు గురియైన వారికి, న్యాయము చేయాలని భావించే ప్రజలు కొంతమంది ఉంటారు. హృదయములో న్యాయము జరిగించాలనే కోరికను కలిగియున్నప్పుడు, వారి కొరకు మీ హృదయము స్రవిస్తుంది. ఏదైనా పరిస్థితిని మెరుగుపరచడము కోసము ప్రయత్నాలు చేయాలని అనిపిస్తుంది. తద్వారా మీరు వారి కొరకు కనికరము గలిగనవారుగా ఉంటారు. వారి మీద కారుణ్యము చూపిస్తారు. అటువంటి వారికి సేవను అందించాలని భావిస్తారు. ఇటువంటి న్యాయాన్ని చూడడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. అటువంటి వారు పరిశుద్ధులు అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. వారు నిజమైన ప్రజలు, వారు సత్యమార్గమును ప్రేమిస్తారు. అబద్ధ మార్గములోనికి తిరిగి వెళ్లరు. వారి జీవితాలలోను మరియు ఇతరుల జీవితాలలో కూడ వారు న్యాయము కొరకు దృఢంగా నిలబడతారు. కనుకనే, ఆయన అంటున్నాడు, " నేను నిత్యమునకు వారిని భద్రపరచెదను. వారిని వారి తరములను, వారి పేరును నేను భద్రపరచెదను. నా ఆశీర్వాదమును నేను వారి మీదను మరియు నేను వారి జీవితాలను నిరంతరము భద్రపరచెదను. ఈ లోకములోను మరియు ఆలాగే పరలోకములో కూడా నేను వారిని భద్రపరుస్తాను.'' అవును, నా ప్రియులారా, న్యాయమును కనుపరచువారిని దేవుడు ఆశీర్వదించుటకు సమర్థుడై యున్నాడు. అటువంటి హృదయమును మనము ఆయన యొద్ద నుండి స్వీకరించుదామా? స్నేహితులారా, మీరు ఆయన యందు భయభక్తులు కలిగియుంటూ, న్యాయమును ప్రేమించినప్పుడు, ఆయన మిమ్మును విడనాడకుండా, మిమ్మును భద్రపరుస్తాడు. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.

ప్రార్థన:
నీతిన్యాయములు గలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, దయచేసి మాకు న్యాయాన్ని ప్రేమించే మరియు అనుసరించే హృదయాన్ని దయచేయుము. ప్రభువా, మా వ్యవహారాలన్నింటిలో న్యాయమైన వ్యక్తిగా మారడానికి మాకు సహాయం చేయుము. దేవా, దయచేసి సత్యం కొరకు మరియు నీ దృష్టిలో న్యాయమైన మరియు మంచి కొరకు నిలబడే ధైర్యాన్ని మాకు దయచేయుము. ప్రభువా, ఈ ప్రార్థనకు జవాబిచ్చినందుకు మరియు నీ సన్నిధితో మమ్మును నింపినందుకు వందనాలు, తద్వారా మేము చెప్పుచున్న మరియు చేయు ప్రతిదానిలో మేము న్యాయం చేయగలుగునట్లు చేయుము. దేవా, మమ్మును ఎల్లప్పుడు గొప్ప పేరుతో భద్రపరుచుము మరియు నీ వెలుగు మా ద్వారా ప్రకాశించునట్లుగా చేయుము. ప్రభువా, మేము న్యాయమును వెంబడించే హృదయమును మాకు అనుగ్రహించుము. దేవా, న్యాయమును ప్రేమించుటకును, న్యాయము కలిగి ఉండుటకు మాకు సహాయము చేయుము. యేసయ్యా, సత్యము కొరకు నిలబడడానికి, మంచి కార్యాలు జరిగించుట కొరకు మేము నిలుచు నిమిత్తము, మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. దేవా, ఎల్లవేళల మమ్మును భద్రపరచి, గొప్ప పేరుతో మమ్మును ఆశీర్వదించుమని యేసుక్రీస్తు నీతిగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.