హలో నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెహోషువ 5:9 వ వచనమును తీసుకొనబడియున్నది. ఆ వచనము, "అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండ దొరలించివేసి యున్నానని యెహోషువతో ననెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు'' అన్న వచనము ప్రకారం నేడు మీ మీద అవమానము నుండకుండా దొరలించివేయాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. కాబట్టి, మీరు దేనికిని భయపడకండి.

నా ప్రియులారా, నేడు ఐగుప్తు అవమానము ప్రభువు మీ మీద నుండకుండ దొరలించివేస్తాడు. దీనికి అర్థం ఆయన దానిని దూరంగా నెట్టివేసాడని అర్థం. యేసు పొందిన పునరుత్థానంలో మనం దీనిని చూడగలము. అక్కడ యేసు పునరుత్థానం అయ్యేలా సమాధిని మూసివేసిన రాయి దొర్లించబడింది. అదేవిధంగా, ప్రభువు ఈ రోజు మీ జీవితంలోని సమస్యలన్నిటిని తొలగిస్తాడు. మీ శత్రువులు మరియు మీకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు మీ జీవితం నుండి దూరం చేయబడతారు. ప్రభువు కూడా మిమ్మును ఉన్నత శిఖరాలకు తీసుకెళతాడు.

కారుణ్య విశ్వవిద్యాలయంలో ఈరోజు గొప్ప ఒక శుభదినము. గత ఏడాది ఇదే తేదీన కారుణ్యకు న్యాక్ నుంచి ఎ++ అక్రిడిటేషన్ లభించింది. ఏ విశ్వవిద్యాలయానికైనా ఇది చాలా ప్రతిష్టాత్మకమైన పురస్కారం (అవార్డు), కేవలం దేవుని దయ వల్లననే కారుణ్యకు ఈ గౌరవం లభించింది. ఆ రోజు నాకు చాలా స్పష్టంగా గుర్తుంది. ఈ అక్రిడిటేషన్ జరగాలని మేము హృదయపూర్వకంగా ప్రార్థించాము మరియు ఆ దేవుని కృప మరియు దయ కారణంగానే కారుణ్యకు ఈ గొప్ప ఘనత లభించింది.

బైబిల్‌లో, 2 రాజుల పుస్తకం 6వ అధ్యాయంలో, ఎలీషా తన సేవకుని కళ్ళు తెరవమని కోరుతూ దేవునికి ప్రార్థించిన సంఘటన కలదు, తద్వారా యుద్ధంలో తన చుట్టూ ఉన్న రక్షణ మరియు కాపుదలను అతను చూడగలిగాడు. అవును, అతని సేవకుని కళ్ళు తెరిచినప్పుడు, అతను ఎలీషా చుట్టూ పెద్ద సైన్యాన్ని చూశాడు. ఎలీషా తన సేవకునికి నమ్మకాన్ని కలిగిస్తూ, " అతడు భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వారికంటె అధికులై యున్నారని చెప్పి, యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథములచేతను నిండియుండుట చూచెను'' (2 రాజులు 6:16,17). అదేవిధంగా, మీ శత్రువుల కంటే మీతో ఎక్కువ మంది ఉన్నారు. ఒకవేళ మనము దానిని మన కళ్లతో చూడలేకపోవచ్చును. కానీ, ప్రభువు బలమైన పరాక్రమశాలిగా మీకు తోడుగా ఉన్నాడు. మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వారితో పాటు మీ జీవితానికి హాని కలిగించే వారితో సహా మీ శత్రువులందరిని ఆయన తొలగించబోవుచున్నాడు. యేసుక్రీస్తు సమాధి నుండి రాయిని దొర్లించినట్లుగానే, ఈ రోజు ప్రభువు వాటన్నిటిని మీ జీవితము మీద నుండి దొర్లించి, మీ జీవితంలోనికి ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదాన్ని తీసుకొనివస్తాడు.

నా ప్రియ స్నేహితులారా, ప్రభువు యొక్క రక్షణ మీ మీద ఉన్నది. మేము కారుణ్య కోసం ప్రార్థించిన ప్రతిసారీ, మేము కారుణ్య విశ్వవిద్యాలయం మరియు క్యాంపస్ అంతటా ఎల్లప్పుడూ గొప్ప సంరక్షణ మరియు కాపుదల ఉన్నట్లుగా అనుభూతిని పొందుతాము. అదేవిధంగా, నేడు మీపై మరియు మీ కుటుంబంపై ప్రభువు తన రక్షణ హస్తాన్ని కలిగి ఉన్నాడు. ఏ శత్రువు మిమ్మును తాకలేడు, ఏ శాపం మిమ్మును తాకదు మరియు చెడు మాటలు లేదా హాని మిమ్మల్ని తాకలేవు. మీకు వ్యతిరేకంగా పన్నాగము పన్నినను ఏ హాని కూడా మీ జీవితములో వర్ధిల్లదు. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
పరాక్రమవంతుడవైన మా ప్రేమగల ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, ఈ రోజు మా జీవితంపై నీ రక్షణ హస్తం కొరకై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, నీవు మా గురించి ఆలోచించి మమ్మును రక్షించినందుకు మేము ఏ మాత్రము ప్రభువా? అనేకమంది మాకు వ్యతిరేకంగా లేచి, మా జీవితంలోనికి హాని తీసుకురావడానికి వేచి ఉన్నారు. ఇంకను దేవా, మేము ప్రాణంగా ప్రేమించిన మరియు నమ్మిన వారు మమ్మును వెన్నుపోటు పొడిచి మా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నందున మేము హృదయ విదారకంగా ఉన్నాము. అయినప్పటికీ, ప్రభువా, మేము నీ మీద నమ్మకం ఉంచుచున్నాము మరియు మా జీవితం మీద నీ ఆశీర్వాదాలను ప్రకటించుచున్నాము. శత్రువుల దుష్ట పన్నాగాలను బద్దలు కొట్టి మమ్మును విడిపించమని కోరుచున్నాము. దేవా, నీ రక్షణ హస్తం మా జీవితం మీద ఉండునట్లుగా చేయుము. ప్రభువా, మమ్మును ఆశీర్వదించిన తర్వాత, నీ ఆశీర్వాదాన్ని మేము పొందుకొని, ఉన్నత శిఖరాలకు చేరుకొనునట్లుగా మమ్మును మార్చుమని యేసు క్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.