నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 15:29వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును'' అన్న వచనము ప్రకారము మీరు దేవునికి ప్రార్థించినప్పుడు, ఆయన తప్పకుండా మీ ప్రార్థనను ఆలకించి, మీకు జవాబును దయచేస్తాడు. కనుకనే, దిగులుపడకండి.
నా ప్రియులారా, మన జీవితములో అనేకమంది భక్తిహీనులు వర్థిల్లుట మనము చూస్తుంటాము. వారు నూతన జీవితాన్ని, ఉద్యోగాన్ని, పదోన్నతిని పొందుకొని, పైకి ఎదుగుతూ ఉండవచ్చును. మీరు దానిని చూచి, 'దేవా, నేను నీ దృష్టిలో యథార్ధముగా ఉన్నాను. అయినను, ఇటువంటి ప్రజలు ఎందుకు వర్థిల్లుచున్నారు, అని దేవునిని అడుగుచున్నారేమో? నేను కూడ పదోన్నతికి పాత్రుడను, జీవితంలో హెచ్చింపునకు పాత్రుడను.' కానీ, ' నాకంటె ముందుగా వారు ఎందుకు పొందుకుంటున్నారో? అని అనుకుంటున్నారమో?' అయితే, ప్రియ స్నేహితులారా, బైబిల్‌లో సామెతలు 10:30వ వచనము ఈ విధంగా తెలియజేయుచున్నది, "నీతిమంతుడు ఎన్నడును కదలింపబడడు భక్తిహీనులు దేశములో నివసింపరు'' అని చెప్పబడినట్లుగానే, భక్తిహీనుల పేరు ఇక ఎన్నటికిని ఈ భూమి మీద ఉండకుండా చెరిపి వేయబడుతుంది. కానీ, నీతిమంతుల పేరు ఎన్నటికిని కదిలింపబడదు అని వాక్యము స్పష్టముగా మనకు తెలియజేయుచున్నది. కాబట్టి, మీరు దేనికిని భయపడకండి. ఈ లోకములో మీరు నీతిగా జీవించి, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఆయన తప్పకుండా మీ ప్రార్థనలు ఆలకిస్తాడు.
నా ప్రియులారా, నీతిమంతుల ప్రార్థన యొక్క శక్తి ఏలాగున ఉంటుంది? బైబిల్‌లో యాకోబు 5:15-18వ వచనములలో చూచినట్లయితే, ఈలాగున చెప్పబడియున్నది, " విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును. మీ పాపములను ఒకనితో నొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును. ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే; వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను.'' అదేవిధంగా, నీతిమంతుడైన ఏలీయాను గురించిన ఈ సంఘటన యొక్క వివరణాత్మక వృత్తాంతాన్ని మీరు 1 రాజులు 18వ అధ్యాయంలో చూడగలరు. అవును, నీతిమంతుల ప్రార్థన ఎంతో బలము గలదై ఉంటుందని ఏలీయా ద్వారా నిర్థారించబడినది.
అవును, నా ప్రియ స్నేహితులారా, ఏలీయా ఏదైనా జరగుకూడదు అని ప్రార్థించినప్పుడు అది జరగలేదు. అతడు మరల ప్రార్థించినప్పుడు, ఆకాశము వర్షమిచ్చెను. ప్రియులారా, అదేవిధంగా, నేడు మీరు కూడా ప్రార్థించినప్పుడు, ప్రభువు మీ ప్రార్థనను తప్పకుండా ఆలకిస్తాడు. కనుకనే, నేడు మనము నీతిగల జీవితాన్ని జీవించాలి. అప్పుడు మన ప్రార్థనల పట్ల ప్రభువు శ్రద్ధ వహిస్తాడు. అంతమాత్రమే కాదు, మనము అడిగినది మనకు జరిగింపజేస్తాడు. కాబట్టి, ఈ దినమున మీరు ప్రార్థన చేయుచుండగా, ప్రభువు మీ ప్రార్థనను ఆలకించి, మీ కొరకు అద్భుతములను జరిగిస్తాడు. ఎందుకనగా, ఆయన నీతిమంతుల ప్రార్థనను ఆలకిస్తాడు. నా ప్రియులారా, ఈ రోజు మన అవసరతలు ఏవైనను సరే, ప్రార్థనలో ఆయనను అడుగుదాము. ఆయన అన్నిటిని మీకు నెరవేర్చి సమకూరుస్తాడు. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
నీతిగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, ఈ నూతన దినమును ఆశీర్వదించుము. ప్రభువైన యేసయ్యా, నీ బిడ్డలైన మేము ప్రార్థించుచుండగా, నీవు మా ప్రార్థనను ఆలకించి, మా ప్రార్థనకు జవాబును దయచేయుము. దేవా, మాకు అవసరమైనదానిని నిశ్చయముగా అనుగ్రహించుము. యేసయ్యా, మాకు స్వస్థతను, ఉద్యోగమును దయచేయుము, ఇంకను మా వ్యాపారమును దీవించుము. దేవా, మా కుటుంబాన్ని మరియు మా బిడ్డలను ఆశీర్వదించి, మా కుటుంబములో సంతోషమును దయచేయుము. ప్రేమగల ప్రభువా, నీవు మా ప్రార్థనలను వింటున్నావనియు మరియు పై నుండి జవాబులను దయచేయుమని మేము కోరుచున్నాము. దేవా, మేము ఇప్పుడు ప్రార్థించుచున్నప్పుడు కూడా, నీవు మా ప్రార్థనల పట్ల శ్రద్ధ చూపుతున్నావని మాకు తెలుసు. దేవా, మా ప్రతి అవసరం గురించి నీకు తెలుసు. దేవా, నేటి నుండి నీ మహిమను బట్టి మా అవసరాలన్నీ తీర్చి, ఆధ్యాత్మికంగా మరియు శారీరకంగా మమ్మును బలపరచి, నీ ఆశీర్వాదాలను మా మీద కుమ్మరించుము. ప్రభువా, దయచేసి నీ దృష్టిలో నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉన్నట్లయితే, అది మా నుండి తొలగించి, మరియు నీ కృపాక్షేమములను జీవితంలో పొంగి పొర్లునట్లు చేయుము. దేవా, ఎల్లప్పుడు మమ్మును నీతిమార్గములో నడిపించుము. తద్వారా మేము గడిచే ప్రతి రోజు మరింత నీతిమంతులుగా మారునట్లుగాను మరియు నీ నామమునకు ఘనతను కలిగించునట్లుగా మమ్మును మార్చుమని యేసుక్రీస్తు బలమైన మరియు నీతిగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.