హలో నా ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలములో మిమ్మును పలకరించుటకు నాకెంతో సంతోషముగా ఉన్నది. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 3:3వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "యెహోవా, నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదము గాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు'' అని చెప్పినట్లుగానే, అవును, ప్రియ స్నేహితులారా, మీ చుట్టు ప్రభువు కేడెముగా ఉంటాడు. ఆయనే అతిశయాస్పదముగాను కూడ ఉన్నాడు. ఇంకను మీ తలను పైకి ఎత్తువాడు కూడా ఆయనే.
బైబిల్‌నందు దావీదు జీవితములో కూడా మనము దానిని చూడగలము. దావీదు వెళ్లి, ఫిలిష్తీయులతో యుద్ధము చేయాలని సౌలు ఆశించినప్పుడు, దావీదునకు తన ఖడ్గమునిచ్చి, తన యుద్ధోపకరణములన్నిటిని అతనికి ధరింపజేశాడు. దావీదు వాటన్నిటిని ధరించినప్పుడు కనీసము నడవలేకపోయాడు. ఇవన్నియు నాకు అలవాటు లేవు అని అన్నాడు. వీటన్నిటిని ధరించి నేను వెళ్లలేను, వాటన్నిటిని తీసివేసి, ఒక కర్రను తీసుకొని, అతడు యుద్ధానికి వెళ్లాడు. యుద్ధ భూమికి అతడు వెళ్లియున్నప్పుడు, డాలు మోయువాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చెను. చుట్టు పార చూచి దావీదును కనుగొని, అతడు బాలుడై యెఱ్ఱటివాడును రూపసియునై యుండుట చూచి అతని తృణీకరించెను. మరియు వారు నీవు వచ్చి, మమ్మును ఓడించబోవుచున్నావా? అని అతనిని తృణీకరించారు. అయితే, దావీదు ఇలాగున అన్నాడు, "దావీదు నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను'' అని దావీదు అన్నాడు. "ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును; నేను నిన్ను చంపి నీ తల తెగవేతును; ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోకనివాసులందరును తెలిసికొనునట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటెచేతను రక్షించువాడుకాడని యా దండు వారందరు తెలిసికొందురు; యుద్ధము యెహోవాదే; ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను.''
ఆ తర్వాత, అతనితో యుద్ధము చేయుటకై ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరుగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి యొకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లపడెను.'' అవును, ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లపడి చచ్చెను. ఆ తర్వాత, 1 సమూయేలు 17:50 వ వచనమును చూచినట్లయితే, "దావీదు ఫిలిష్తీయునికంటె బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను.''
నా ప్రియులారా, అతనిని కాపాడుకొనుటకై ఫిలిష్తీయుడు డాలు మోయువానితో కూడా వచ్చాడు. అయితే దావీదు, కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని అతని మీదికి వెళ్లలేదు. కానీ, దావీదు దేవుని నామముతో అతని మీదికి వెళ్లాడు. అదే అతనికి కేడెముగాను, అతిశయాస్పదముగాను మరియు మహిమగాను ఉండెను. అది అతని తలను లేవనెత్తినది. అతడు శత్రువును జయించగలిగాడు. దేవుడే యుద్ధమును అతని పక్షమున చేశాడు. అవును ప్రియ స్నేహితులారా, ఈ లోకములో మనము అనేక యుద్ధాలను ఎదుర్కొంటుండవచ్చును. 'నా శత్రువులను ఎదుర్కొనుటకు నేను సిద్ధపడుచున్నాను అని అంటున్నారేమో? నేను ఈ అనారోగ్యమునకు వ్యతిరేకముగా పోరాడుచున్నాను. నాకు పైగా ఉన్న దుష్ట అధికారులతో నేను పోరాడుచున్నాను, నా యొద్ద ధనమును తీసుకున్నవారితోను మరియు నాకు వ్యతిరేకంగా తప్పుడు కేసులు పెట్టినవారితో పోరాడుచున్నాను అని అంటున్నారా? ' ఈ రోజు మీకు కావలసినదంతయు ప్రభువు యొక్క నామము. నేడు మిమ్మును కాపాడుకొనుటకు ఈటెయు, ఖడ్గము అవసరము లేదు. మీకు అవసరమైనదల్లా కేడెముగా ఉన్న ప్రభువు నామము మాత్రమే. అదే మీకు అతియాస్పదముగా ఉంటుంది. ప్రభువు నామమే మీ తలను పైకెత్తగలదు.
కాబట్టి, నా ప్రియులారా, ఈ రోజు మిమ్మును మీరు దేవుని కేడెముతో కప్పుకొనండి. మీ జీవితములో మీకు కావలసిన ముద్ర అదియై యుంటుంది. అది మీకు కేడెముగా ఉంటుంది. అదే మీకు కాపుదల మరియు భద్రత, ఇంకను మీ తలను పైకెత్తునది కూడా అదియే. మీ అతియాస్పదము కూడా అదియే. కనుకనే,ఈ రోజు మన పై మరియు మన కుటుంబము మీద అటువంటి ప్రభువు యొక్క నామమును పొందుకుందామా? ఆయనను ప్రార్థనలో అడుగుదామా? ఆలాగున పొందుకోవాలనగా, మిమ్మును మీరు దావీదు వలె దేవుని హస్తాలకు సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, దావీదునకు కేడెముగా ఉన్న దేవుడు మీకును కేడెముగాను మరియు అతియాస్పదముగా ఉండి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును మరియు మీ కుటుంబమును దీవించును గాక.
ప్రార్థన:
కృపాకనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, ఈ రోజు వాగ్దానములో చూచినట్లుగానే, నీ నామము మాకు కేడెముగాను మరియు అతియాస్పదముగా ఉండునట్లుగా చేసినందుకై నీకు కృతజ్ఞతలు. దేవా, నీ నామము మా తల ఎత్తునట్లుగా చేయుము. దేవా, మేము భయము చేత అణిచివేయబడకుండా, మా తలలపైన నీ నామమును కలిగియుండునట్లుగా కృపను దయచేయుము. ప్రభువా, నీ రెక్కల నీడలో మేము దాగుకొనునట్లుగా మమ్మును నీ కేడెముతో కప్పుము. దేవా, మా చుట్టు కేడెముగా ఉండి, మా తలను ఉన్నతముగా లేవనెత్తుము. ప్రభువా, నీవే మా మహిమ, మా తలను పైకెత్తి, మమ్మును నిరీక్షణతో నింపుము. దేవా, మేము ఎదుర్కొనే ప్రతి యుద్ధంలో, మా బలం మీద కాకుండా నీ శక్తివంతమైన నామంపై ఆధారపడటానికి మాకు సహాయం చేయుము. దేవా, మమ్మును మరియు మా కుటుంబాన్ని నీ ప్రేమలో కప్పి, నీ శక్తితో మమ్మును భద్రపరచుము. ప్రభువా, ఆపత్కాలములో నిన్ను విశ్వసించే ధైర్యాన్ని మాకు అనుగ్రహించుము మరియు నీవే మా ఏకైక రక్షణకేడెముగా ఉండునట్లుగా మమ్మును మార్చుము. ప్రభువా, అన్యాయం లేదా నిందలు ఉన్న చోట, దయచేసి మాకు బలమైన కేడెముగా నిలబడి, నీ నామము మా జీవితంలో మరియు మా ఇంటిపై ముద్ర వేయుము. ప్రభువా, ఇప్పుడు మరియు ఎల్లప్పుడూ నీవు మాతో ఉనావని తెలుసుకొని మేము నీ కృపలో విశ్రాంతి తీసుకొనునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.