నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు దేవుని వాగ్దానముగా బైబిల్ నుండి మనం ఫిలిప్పీయులకు 1:4 లోని దేవుని వాక్యాన్ని ధ్యానించబోవుచున్నాము, ‘‘ మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించును...’’ అని చెప్పబడినట్లుగానే, ప్రభువు త్వరలో రాబోవుచున్నాడు, అందుకే ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన యెదుట మనము నిందారహితంగా నిలబడటానికి ఆయన మనలను సిద్ధపరుస్తాడు.
ఆలాగుననే, బైబిల్‌లో 1 కొరింథీయులకు 1:8వ వచనమును చూచినట్లయితే, ‘‘మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై యుండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును.’’ అదేవిధంగా, మనం ప్రభువుపై నమ్మకం ఉంచినప్పుడు, ఆయన మనలను కదలలేని సీయోను పర్వతం వలె స్థిరపరుస్తాడని, కీర్తనలు 125:1 వ వచనము నుండి మనకు వాగ్దానము చేయుచున్నాడు. ఆ వచనమును మనము చూచినట్లయితే, ‘‘యెహోవా యందు నమ్మిక యుంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలెనుందురు ’’ ప్రకారము మనము ఎప్పుడైతే, దేవుని యందు మనము నమ్మిక ఉంచుతామో, అప్పుడు మనము కదలకుండా నిత్యము నిలిచియుంటాము. అవును, మనం దేవునితో నడుస్తూ, విశ్వాసంలో బలంగా ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక అభివృద్ధి నిత్యము కొనసాగుతుంది.
అందుకే మొట్టమొదట, ప్రభువు మనకు రక్షణను అనుగ్రహించుచున్నాడు, దీనిని 2 కొరింథీయులకు 5:17వ వచనములో ఇలాగున వ్రాయబడియున్నది: ‘‘కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను;’’ ప్రకారం అవును, మనం క్రీస్తుతో ఐక్యమైనప్పుడు, మన పాత పాప స్వభావం మన నుండి తొలగిపోతుంది మరియు మనం ఆయనలో నూతనంగా చేయబడతాము. అంతమాత్రమే కాదు, మనము నూతన సృష్టిగా మార్చబడతాము.
రెండవదిగా, 1 థెస్సలొనీకయులకు 5:23వ వచనములో సెలవిచ్చిన ప్రకారముగా ప్రభువు మనలను పరిశుద్ధపరస్తాడు. అందుకే పై వచనములో చూచినట్లయితే, ‘‘ సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక’’ అని చెప్పబడినట్లుగానే, ఈ పరిశుద్ధత మన స్వంత క్రియ కాదు, మనలోని పరిశుద్ధాత్మ యొక్క క్రియ మాత్రమే. దేవుని పరిశుద్ధమైన స్వభావాన్ని మనం ప్రతిబింబించేలా ఆయన మన స్వభావాన్ని అనుదినము నూతనంగా మారుస్తాడు.
కనుకనే, నా ప్రియులారా, ప్రభువు మనలను ఎన్నడును విడిచిపెట్టడు. ఆయన మనలో ఒక సత్‌క్రియను ప్రారంభించినప్పుడు, దానిని అసంపూర్ణంగా వదిలివేయడు. బదులుగా, ఆయన మనలను పూర్తిగా పునరుద్ధరించి, ఆయనవలె సంపూర్ణులనుగా చేస్తాడు. ఎందుకనగా, మన దేవుడు సమృద్ధి మరియు సంపూర్ణతను కలిగిన దేవుడు. ఆయన విశ్వాస్యత ద్వారా, యేసుక్రీస్తు దినము వరకు మనలను నిందారహితులనుగా చేస్తాడు. అందుకే కీర్తనాకరుడైన దావీదు, కీర్తనలు 23:5వ వచనములో ఇలాగున ప్రకటించుచున్నాడు, ‘‘నా శత్రువుల యెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది’’ ప్రకారం మనలో ప్రభువు పని ఎల్లప్పుడూ సంపూర్ణంగాను మరియు పొంగిపొర్లుతూ ఉంటుంది. కనుకనే, నా ప్రియులారా, ఈనాడు ఇటువంటి సత్‌క్రియ మీలో ప్రారంభించాలని మీరు దేవునికి మొరపెట్టండి. ఆయన పరిశుద్ధుడు గనుకనే, ఆయన మిమ్మును కూడా పరిశుద్ధులనుగా చేయును గాక. ఆయన సన్నిధి ఎల్లప్పుడు మీతో ఉండును గాక, ఆయన పరిపూర్ణమైన ఆశీర్వాదాలు మీ మీద నిత్యము సంపూర్ణముగా నిలిచి ఉండును గాక. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీవు మాలో ప్రారంభించిన ఈ సత్‌క్రియ కొరకై మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. దేవా, ఆ సత్‌క్రియ మాలో క్రీస్తు దినం వరకు దానిని సంపూర్తి చేస్తానని నీ వాగ్దానాన్ని మేము నమ్ముచున్నాము. ప్రభువా, సీయోను కొండవలె మేము విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి మా విశ్వాసమును బలపరచుము. దేవా, నీ పరిశుద్ధాత్మ శక్తితో మా ఆత్మ, జీవమును మరియు శరీరాన్ని పరిశుద్ధపరచుము. యేస య్యా, నీ పరిశుద్ధమైన స్వభావాన్ని ప్రతిబింబించేలా మా హృదయాన్ని అనుదినము మమ్మును మరియు మా స్వభావాన్ని పరిశుద్ధంగా మార్చుము. దేవా, మా జీవితములో పాతవి గతించునట్లుగాను మరియు పాపభరితమైనవి అన్నింటిని తొలగించి మమ్మును క్రీస్తులో నూతన సృష్టిగా మార్చుము. ప్రభువా, నీ పరిపూర్ణ చిత్తం నుండి మమ్మును ఎన్నడు కూడా దూరపరచకుండా, మమ్మును పరిపూర్ణంగా నీ పరిశుద్ధతలోనికి పునరుద్ధరించుము. దేవా, మేము నిందారహితముగా ఉండునట్లుగాను మరియు నీ రాకడలో నీ యెదుట నిందారహితముగాను సిగ్గుపడనక్కరలేని పనివారముగా నిలబడటానికి మా జీవితాలను మార్చి, మమ్మును సిద్ధపరచుము. ప్రభువా, నీ సన్నిధి ఎల్లప్పుడు మాతో ఉండునట్లుగా చేసి, నీ పరిపూర్ణమైన ఆశీర్వాదాలు మా మీద సమృద్ధిగా కుమ్మరించునట్లుగా చేయుమని సమస్త ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.