నా ప్రియ స్నేహితులారా, మనము కలిగియున్న గొప్ప ఆశీర్వాదము మనము పాపమునకు క్షమాపణ పొందుటయే. కారణము, పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని యందు దానికి పరిష్కారము కలదు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి రోమీయులకు 6:23వ వచనమును ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము'' ప్రకారము దేవుడు మన నిత్యజీవమును ఇవ్వాలని మన పట్ల కోరుచున్నాడు. కాబట్టి, భయపడకండి.

నా ప్రియులారా, మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము అనుగ్రహించుట దేవుడు మనకు ఇచ్చుచున్న ఉచితమైన బహుమానమై యున్నది. యేసు మనకు అనుగ్రహించబడియున్న పాప క్షమాపణ, అది కూడ దేవుడు అనుగ్రహించు ఉచిత బహుమానము. కాబట్టి, ఈ రోజున మీరు మీ పాపముల నుండి క్షమించబడి, పాపము యొక్క శాపము నుండి విడుదల పొందవచ్చును. అవును, మీ యొక్క జీవితములోను, ప్రాణములోను, నిత్యమైన జీవమును కలిగి ఉండవచ్చును. అందుచేతనే, మత్తయి 11:28లో యేసు ఈలాగున సెలవిచ్చుచున్నాడు, " ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును.'' ఆయన మిమ్మును చూచి, "నా యొద్దకు రండి, మీ యొక్క భారములన్నిటితో రండి, నేను మీకు విడుదలను అనుగ్రహించెదను. ఇంకను నేను పాపముల నుండి క్షమాపణను అనుగ్రహించెదను అని రోమీయులకు 6:23లో చెప్పబడియున్నట్లుగానే, ఇది దేవుని యొక్క నిత్యమైన బహుమానమై యున్నది. నేడు యేసు ఈ బహుమానమును మీకు అనుగ్రహించవలెనని మీ పట్ల కోరుచున్నాడు. కేవలము యేసు మాత్రమే ఆలాగున చేయగలడు. ఎందుకనగా, మీ పాపముల యొక్క క్షమాపణ నిమిత్తమై ఆయన పవిత్రమైన దేవుని రక్తమును చిందించియున్నాడు. అందుకే బైబిల్‌లో 1 యోహాను 1:7లో ఈ రీతిగా తెలియజేయుచున్నది, "...అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును'' అని చెప్పబడినట్లుగానే, యేసుక్రీస్తు రక్తము సకల పాపముల నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేస్తుంది. అవును, ఈ రోజున మిమ్మును ఒత్తిడికి గురిచేస్తున్న పాపపు శాపమంతటి నుండి మీరు విడిపించబడబోవుచున్నారు. కనుకనే, మీరు ఉన్న పక్షమున యేసుని యొద్దకు రండి, మీ యొక్క దుష్టత్వమైన మార్గములను మరియు మీ వ్యసనములను విడిచిపెట్టండి, యేసు వైపునకు తిరగండి, ఇప్పుడు కూడ మీ కుటుంబములో ఎవరైన పాపపు వ్యసనములో ఉన్నట్లయితే, అట్టివారి కొరకు యేసు రక్తాన్ని స్వతంత్రించుకొనండి. వారు కూడ విడుదల పొందునట్లుగా కృపను అనుగ్రహిస్తాడు.

ప్రిన్‌స్లీ పీటర్ అను ఒక వ్యక్తి ఉండెను. అతని పేరు ్రకైస్తవ పేరుగా ఉన్నప్పటికిని, క్రీస్తుతో ఏ మాత్రము పనిలేని వ్యక్తిగా జీవించాడు. కానీ, అతడు యౌవ్వన ప్రాయములో నుండి మధ్యపానమును సేవించుచుండెను. వీటన్నిటితో పాటుగానే, అతని తల్లి, అతనికి వివాహము జరిగించెను. మధ్యపానము సేవించడము ఇంకను ఎక్కువాయెను. అతని భార్య అతనితో జీవించలేకపోయినది. ఈ వ్యక్తి ఏమి పనిచేయలేకపోవుచున్నాడు. ఆహారము నిమిత్తము అతడు వంతెనల క్రింద ఉన్న ప్లాస్టిక్ మరియు వ్యర్థ పధార్థములను ఏరుకుంటూ ఉండేవాడు. ఇంకను వెళ్లి వాటిని అమ్ముకునేవాడు. మధ్యపానము సేవించి భోజనము చేసేవాడు. అతడు అక్షరాల ఒక బిక్షకునిగా ఉండిపోయాడు. ఎంతో బీదవాడై పోయాడు. అటువంటి సమయములో వారి తల్లి ఏలాగైతేనేమి, ప్రార్థనా గోపురమునకు అతనిని తీసుకొని వచ్చినది. యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురములో ప్రార్థనా యోధులు ఎంతో ప్రేమతో వారిని స్వీకరించారు. ఒక ప్రశ్న వారిని అడిగారు. మీరు మీ హృదయములో దేవునితో సక్రమముగా జీవించియున్నారా? అని అడిగారు. అది అతని ఆత్మను ఎంతగానో బలీయంగా తాకినది. అతడు ఎంతగానో ఏడ్చాడు మరియు రోధించాడు. అతడు సహాయము కోసము మొఱ్ఱపెట్టాడు మరియు పశ్చాత్తాపపడ్డాడు. రోజు మార్చి రోజు వచ్చి చాపెల్‌లో కూర్చుని ప్రార్థనా గోపురములో ప్రార్థించుకుని వెళ్లేవాడు. నెమ్మదిగా మధ్యపానము అతనిని విడిచిపెట్టి వెళ్లిపోయినది. అతడు నూతన వ్యక్తిగా మార్చబడ్డాడు. యేసు రక్తము అతని యొక్క ప్రతి పాపము నుండి కడిగి శుద్ధీకరింబడినందున, అతడు యేసు ప్రేమచేత నింపబడిన వ్యక్తిగా మరియు నూతనంగా మార్చబడ్డాడు.

ఇంకను 18 సంవత్సరముల తర్వాత, ఇప్పుడు నేను ఘనతను పొందుకున్న వ్యక్తిగా ఉన్నాడనియు మరియు ప్రాపంచిక మార్గాలలో కూడా ఆశీర్వదించబడ్డాడని సాక్ష్యమిచ్చాడు. నా ప్రియులారా, యేసు క్రీస్తు చేత పాప క్షమాపణ పొందడము ద్వారా దేవుడు అనుగ్రహించు నిత్యజీవమును బహుమానముగా మనము పొందగలము. దేవుడు ఇటువంటి కృపను మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి, నేడు మీలో ఎట్టి పాపములున్నను సరే, తక్షణమే మీరు వాటిని యేసు పాదాల చెంత విడిచిపెట్టి, క్షమాపణ కోరినట్లయితే, నిశ్చయముగా దేవుని కృపావరము చేత మీరు విడుదల పొందుకొని నూతన వ్యక్తిగా మార్చబడతారు. కనుకనే, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, నీ రక్షణ కృప అవసరమనియు మరియు మేము పాపులమనియు గుర్తించి ఈ రోజు నీ యొద్దకు వచ్చుచున్నాము. దేవా, మేము విధేయతతో మా పాపాలను మరియు లోపాలను విడిచిపెట్టుకొని, మేము నీ యొద్ద క్షమాపణ కొరకు వేడుకొనుచున్నాము. ప్రభువా, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నీవు మాకు అందించిన నిత్యజీవమను బహుమతికి మేము ఎంతో కృతజ్ఞత చెల్లించుచున్నాము. దేవా, మేము యేసు మీద మా విశ్వాసాన్ని ప్రకటించుటకును, నీ ద్వారా మాత్రమే మేము నిజమైన రూపాంతరం చెంది మరియు నూతన జీవితాన్ని అనుభవించుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, మేము ఈ బహుమతిని మా యోగ్యతతో సంపాదించలేము. కానీ, మేము దానిని హృదయపూర్వకంగా మరియు కృతజ్ఞతతో అంగీకరించునట్లు చేయుము. తండ్రీ, క్రీస్తులో మా నూతన గుర్తింపును ప్రతిబింబించే జీవితాన్ని గడపడానికి మేము ప్రయత్నించుచున్నప్పుడు దయచేసి మమ్మును నడిపించుము. దేవా, పాపం నుండి దూరంగా ఉంటూ, మేము నీతిలో జీవించడానికి మాకు సహాయం చేయుము. దయచేసి నీ పరిశుద్ధాత్మతో మమ్మును నింపుము మరియు నీవు మా సంబంధంలో ఎదగడానికి మమ్మును శక్తివంతముగా చేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.