నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు మీకు శుభములు తెలియజేయడము నాకు ఎంతో సంతోషము. ఈ రోజు వాగ్దానముగా మనము బైబిల్ నుండి ఫిలిప్పీయులకు 1:4వ వచనమును ధ్యానించబోవుచున్నాము. ఆ వచనములో, "మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను'' అని చెప్పబడిన ప్రకారము మీతో దేవుడు కార్యమును సంపూర్తి చేయలేదు. మీలో సత్‌క్రియ చేయుటకు ప్రారంభించిన దేవుడు రాకడ వరకు దానిని కొనసాగించాలని మీ పట్ల కోరుచున్నాడు.

నా ప్రియ స్నేహితులారా, నేడు యేసు పిలుచుచున్నాడు పరిచర్య మీకు ఎంతగానో ఆశీర్వాదకరముగా ఉన్నదని నేను నమ్ముచున్నాను. మీరు ఈ పరిచర్యను, టి.వి. పరిచర్య ద్వారా మరియు సాంఘీక మాధ్యమాల ద్వారాను, ప్రార్థనా మహోత్సవముల ద్వారా చూస్తున్నారు కదా! మరియు ప్రార్థనా గోపురముల ద్వారా, టెలిఫోన్ ప్రార్థనా గోపురము ద్వారా కూడ మీరు దీవించబడి యున్నారని నేను నమ్ముచున్నాము. అయితే, ఇదంతయు ఎలా ప్రారంభించబడినదని మీకు తెలుసా? ఈ పరిచర్యను స్థాపించినటువంటి మా తాతగారు, తన పరిచర్య ప్రారంభ సమయములో దేవుని సేవ చేస్తున్నప్పుడు, 1960 సంవత్సరములో క్షయ వ్యాధి భారీన పడ్డారు. ఆ రోజులలో వీధి పరిచర్యను చేసేవారు. వీధులలో సువార్తను ప్రకటించేవారు. క్షయ వ్యాధితో ఉన్నప్పుడు ఆయన దగ్గినప్పుడంతయు రక్తము వస్తుండేది. తద్వార, ఆయన ఎంతగానో శ్రమపడేవారు. ఆ రోజులలో క్షయ వ్యాధికి చికిత్స లేదు. ఆయన ఎంతగానో శ్రమపడుతూ, మా నాన్నమ్మగారితో ఇలాగున చెప్పారు, ' నేను చనిపోబోతున్నాను, కనుకనే, మన బిడ్డలను జాగ్రత్తగా చూచుకో, నేను ఇంకను బ్రతకను' అయితే, మా నాన్నమ్మగారు మా తాతయ్యతో ఇలాగున చెప్పారు, ' మీరు చనిపోరు, మీ జీవితములో మీరు చేయబోయే పరిచర్యలో దేవుడు అనేక వాగ్దానాలను చేసియున్నాడు.' కానీ, మా తాతగారు ఎంతగానో శ్రమపడుచున్నందున మా బామ్మగారి మాటలను అంగీకరించలేకపోయారు. అయితే, ఆ పరిస్థితులలో దేవుడు ఆయనను దర్శించి, ఆయన చేయబోయే కార్యాలన్నిటిని చూపించాడు. ఆ తర్వాత దేవుడు మా తాతగారిని స్వస్థపరిచాడు.

ఆలాగుననే, వీధులలో చేసిన పరిచర్య నుంచి పదివేలమంది కంటె ఎక్కువ మంది పాల్గొనే ప్రార్థనా కూడికలకు మమ్మును ప్రభువు నడిపించాడు. ఈ రోజు మా తాతగారు లేనప్పటికిని, మేము అదే పనిని కొనసాగించుచున్నాము. ప్రార్థనా మహోత్సవములలో 5 లక్షలకంటే, ఎక్కువ మందికి బోధిస్తూ, టి.వి. ద్వారా, ప్రార్థనా గోపురముల ద్వారా, ఎన్నో లక్షల మందిని సంధించుచున్నాము. అవును నా ప్రియ స్నేహితులారా, మా తాతగారికి ఈ సత్‌క్రియను ఇచ్చినటువంటి దేవుడు తన విశ్వాస్యతను బట్టి మాలో కూడ కొనసాగింపజేయుచున్నాడు. యేసయ్య తిరిగి వచ్చేంతవరకు మేము ఈ సత్‌క్రియను కొనసాగిస్తాము.

అంతమాత్రమే కాదు, మా తాతగారు చనిపోయినప్పుడు ఈలాగున చెప్పారు, 'ఇప్పటి వరకు మీరు ఒక్క దినకరన్‌ను మాత్రమే చూచియున్నారు. కానీ, రానున్న దినములలో ఈ సత్‌క్రియను కొనసాగింపజేయడానికి కొన్ని వేల కొలది దినకరన్‌లను లేవనెత్తబోవుచున్నాను. ' కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, యేసు పిలుచుచున్నాడు పరిచర్య ద్వారా, స్వచ్ఛందంగా ప్రార్థనా గోపురములకు వచ్చి, మీ సమయమును వెచ్చించుట ద్వారా మరియు ఇతరుల కొరకు విలపించుచూ ప్రార్థించుట ద్వారా, వారి కన్నీటిని తుడుచుట ద్వారా, వారికి అద్భుతములను తీసుకొని వచ్చుట ద్వారా మీరు కూడ ఈ సత్‌క్రియను కొనసాగింపవచ్చును. ఇప్పుడు కూడ మనమందరము కలిసి, ఈ సత్‌క్రియను కొనసాగిద్దాము. ఈ సత్‌క్రియను కొనసాగించడానికి మనకు కావలసిన బలమును, జ్ఞానమును దేవుడు అనుగ్రహిస్తాడు. నేడు ఈ సత్‌క్రియను కొనసాగించడానికి ఒక తీర్మాణము తీసుకుందామా? ఆలాగుననే, ఈ పనిని కొనసాగిద్దాము. ప్రజల కన్నీటిని తుడుచుట కొరకు, వారి జీవితాలలో అద్భుతములను తీసుకొని వచ్చుట కొరకై ప్రార్థిద్దామా? ఆలాగున చేసి దేవుని దీవెనలను పొందుకుందాము. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, మాలో నీవు ఆరంభించిన నీ సత్‌క్రియకై మరియు అనేక సంవత్సరాలుగా నీవు చేసిన అద్భుతాలకై నీకు వందనాలు. దేవా, ఈ సత్‌క్రియను కొనసాగించడానికి మాకు అత్యధికమైన శక్తిని దయచేయుము. దేవా, ప్రపంచమంతట నీ సువార్తను ప్రకటించుటకును, నీ మంచితనమును చెప్పగల మరియు ప్రజలకు అద్భుతములను చేయగల గొప్ప కృపనిమ్ము. ప్రభువా, విరిగిన హృదయాలను బలపరస్తూ, దుఃఖమునకు బదులుగా సంతోషమును కలుగజేయగల అటువంటి కృపను దయచేయుము. దేవా, మాలో ఈ సత్ క్రియను కొనసాగించుటకు మేము యథార్థముగా ఉండే కృపను మాకు అనుగ్రహించుము. యేసయ్యా, నీ యొక్క రెండవ రాకడ కొరకు ప్రపంచమును సిద్ధపరచే కృపను మాకు దయచేయుమని యేసు క్రీస్తు అతి శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.