నా అమూల్యమైన దేవుని బిడ్డలారా, మీకందరికి నా శుభములను తెలియజేయుచున్నాను. ఈ దినము మీకు ఆశీర్వాదకరముగా ఉండును గాక. నేటి దినమున దేవుడు మీకు తోడై ఉండి మరియు మిమ్మును ఎల్లవేళల నడిపించును గాక. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి నిర్గమకాండము 33:14వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "...నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసెదను... '' అని ప్రభువు సెలవిచ్చినట్లుగానే దేవుని సన్నిధి నిత్యము మీకు తోడుగా వచ్చును గాక. ఇది ఎంతటి చక్కటి దేవుని వాగ్దానము కదా!
అవును, నా ప్రియ స్నేహితులారా, మన హృదయమంతటితోను నిత్యము ప్రభువును వెదకువారముగా ఉండాలి. ఇంకను దేవుని యందలి భయభక్తులతో వెదకాలి. దేవుని యెదుట భయభక్తులతో మోకరించాలి. ఆయన అన్ని వేళల కూడా అద్భుతమైన రీతిగా మిమ్మును నడిపిస్తుంటాడు. బైబిల్‌లో చూచినట్లయితే, కీర్తనలు 105:4వ వచనములో మనము దానినే చదువుచున్నాము. అదేమనగా, "యెహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి’’ ప్రకారము మనము నిత్యము దేవునిని వెదకాలి. అదేవిధముగా, సామెతలు 8:30వ వచనములో చూచినట్లయితే, "నేను ఆయన యొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని’’ అని చెప్పబడిన ప్రకారము అనుదినము మనము ఆనందించాలని వ్రాయబడియున్నది. అవును, ఇంగ్లీషులో, "ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించండి’’ అను ఒక అద్భుతమైన పాట, చరణం ఉన్నది. అవును, నా ప్రియ స్నేహితులారా, ప్రార్థన అనేది ఎంతో అద్భుతమైన విషయం, మనము దేవునితో మాట్లాడవచ్చును, దేవునితో నడవవచ్చును, ఆయన మనకు విశ్రాంతిని కలుగజేస్తాడు. యేసుక్రీస్తు తన జీవితములో ఏలాగున ప్రార్థించేవాడని మత్తయి 14:23వ వచనములో చూచినట్లయితే, "ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండయెక్కి పోయి, సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ’’ ప్రతి సాయంకాల సమయములో యేసు ప్రార్థించేవాడు. ఇంకను లూకా 6:12వ వచనములో చూడండి, ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి, దేవుని యందు ప్రార్థించుటకు రాత్రంతయు గడిపెను.
సాధారణంగా, మన వంటి మనుష్యుడైన దావీదు కూడా ప్రతి ఉదయమున దేవునికి ప్రార్థించేవాడని బైబిల్‌లో కీర్తనలు 63:1వ వచనములో ఆలాగున వ్రాయబడియున్నది, "దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును’’ మరియు కీర్తనలు 55:17వ వచనములో చూచినట్లయితే, "సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును ఆయన నా ప్రార్థన నాలకించును’’ ప్రకారం దావీదు ఉదయము, సాయంత్రం, అన్నివేళల ప్రార్థించేవాడు. అందుకే ప్రభువు తన కాపరిగా మారి తన జీవితమంతయు చక్కగా నడిపించాడు. అదేవిధముగా, నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, అన్నివేళల మీకు సాధ్యమైనంతవరకు మీరు దేవుని వెదకండి, మీరు ఏమి చేసినను సరే, మీకంటె ముందుగా ప్రభువు వెళ్లతాడు. మీరు ఏ కార్యము తలపెట్టినను సరే, ప్రభువు మీకు ముందుగా వెళ్లి, ఆ కార్యమును సఫలము చేస్తాడు. అంతమాత్రమే కాదు, మీ కొరకు సమస్తమును ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుని మనము కలిగియున్నాము. ఆయన వైపు ఇప్పుడే చూద్దామా? మీరు కూడా దావీదు వలె అన్నివేళల దేవుని వెదకినట్లయితే, నిశ్చయముగా, దావీదునకు కాపరిగా ఉండి నడిపించిన దేవుడు నేడు మీకు కాపరిగా ఉండి మిమ్మును కూడా నడిపిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రశస్తమైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నీ యొక్క అద్భుతమైన సన్నిధానమునకై నీకు వందనాలు. యేసయ్యా, మేము నీ ముఖమును వెదకుచుండగా, నీవు మా మొఱ్ఱలను ఆలకించుము. దేవా, నీ వాగ్దానము చొప్పున మాకు విశ్రాంతిని కలుగజేయుము. ప్రభువా, మా కార్యములన్నిటిలోను నీ యొక్క నడిపింపును మాకు అనుగ్రహించుము. దేవా, నీవు మాకు ముందుగా వెళ్లి, మా వంకర మార్గములను సరాళము చేసి, మాకు విశ్రాంతిని దయచేయుము. ప్రభువా, దావీదు వలె మేము అన్నివేళల నిన్ను స్తుతించుటకును మరియు నీ సన్నిధిని వెదకుటకు మాకు సహాయము చేయుము. దేవా, నీ సన్నిధిలో సమాధానము మరియు విశ్రాంతి ఉంటుందని మాకు వాగ్దానం చేసినందుకై నీకు వందనాలు. ప్రభువా, భక్తి మరియు ప్రార్థనతో నిండిన హృదయంతో నిత్యము నిన్ను వెదకడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, మా ప్రియ రక్షకుడైన యేసుప్రభువు ఈ భూమి మీద జీవించినప్పుడు మరియు దైవజనుడైన దావీదు చేసిన ప్రార్థనల ద్వారా కాపరిగా ఉండి నడిపించినట్లుగానే, నీవు మమ్మును కూడా నడిపించుము. దేవా, ప్రతిరోజు మేము నీతో నడవడానికి మాకు నేర్పించుము. ప్రభువా, నీ సన్నిధిలో వాగ్దానం చేయబడిన విశ్రాంతిని మరియు బలాన్ని మేము అనుభవించునట్లుగా చేయుము. దేవా, మేము చేయుచున్న ప్రతి పనిలోనూ నీవు మాకు ముందుగా వెళ్లి, మా జీవితంలో నీ చిత్తమును నెరవేర్చుము. ప్రభువా, మేము నీలో ఎల్లప్పుడు ఆనందించునట్లుగాను, నిత్యము నీ ప్రేమను నమ్మునట్లుగా మాకు నీ కృపను దయచేయుమని మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.