నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 28:5వ వచనమును ప్రకారము దేవుడు నేడు మిమ్మును సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఇక్కడ బైబిల్‌లో చెప్పబడిన మాటయేదనగా, " నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును'' అని వ్రాయబడియున్నది. మరొక అనువాదములో, "మీరు భుజించుటకు సమృద్ధియైన రొట్టెను లేక ఆహారమును కలిగియుందురు''అని వ్రాయబడియున్నది. పై వచనములో చెప్పబడినట్లుగానే, 'గంప' అనగా, ఇశ్రాయేలీయుల యొక్క తమ కోతను మోసుకొని వెళ్లడానికి ఉపయోగించే పాత్రకు గుర్తు. 'పిండి పిసుకు తొట్టి' అనగా, నీరు, పిండి నూనె కలపడానికి వారు వినియోగించే పాత్రయై యున్నది. దేవుడు వారి యొక్క దైనందిన జీవితములో అత్యంత సమృద్ధియైన ఆశీర్వాదములను అనుగ్రహిస్తాడని వాగ్దానము చేసియున్నాడు. గంపయు, పిండి పిసుకు తొట్టియు వారు ప్రతి దినము ఉపయోగించే పాత్రలై యున్నవి. ఆ రీతిగా దేవుడు మన జీవితములో జోక్యము కలిగించుకొని, ప్రతి దినము తన అత్యంత సమృద్ధిచేత మనలను నింపి, ఆశీర్వదించును గాక. మన జీవితములో ఏది శ్రేష్టమైనదో దానిని దేవుడు ఎరిగియున్నాడు. దానినే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు.

బైబిల్‌లో మత్తయి సువార్త 6:25-34వ వచనములలో మనము చూచినట్లయితే, ఏ విధంగా మనకు దేవుడు జాగ్రత్త వహిస్తున్నాడో అక్కడ వ్రాయబడియున్నది. దేవుడు వారికి అక్కరగా ఉన్నవాటిని యెరిగియున్నాడు, వాటిని వారికి అనుగ్రహించగలడు గనుకనే, వారు దేని నిమిత్తము కూడా చింతించకూడదు లేక విచారించకూడదు అని దేవుడు వారి పట్ల కోరుచున్నాడు. మన జీవితములో మనము దేవునికి మొదటి స్థానము ఇచ్చినప్పుడు సమస్తమును కూడా మనకు మేలుకరముగా ఉంటాయి. మత్తయి సువార్త 6:33 వ వచనములో చూచినట్లయితే, "కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును'' ప్రకారం దేవునిని మొదటి స్థానములో ఉంచుకోవడానికి మనము నిశ్చయపరచుకోవాలి. పరిశుద్ధ జీవితాన్ని గడపడానికి మొదట మనము ఆయన రాజ్యాన్ని వెదకాలి. అప్పుడు మన జీవితములో వస్తువుపరముగా ఉన్నవన్నియు కూడా మనకు అనుగ్రహింపబడును. దేవుడు సంపూర్ణముగా, తన స్వాధీనములో ఆధిపత్యమును కలిగియున్నాడు. దేవుని మహిమ కొరకై మరియు మీ మేలు కొరకై మీరు సమస్తమును మంచిగా కలిగి ఉండునట్లుగా ఆయన మీకు అనుగ్రహించును గాక.

ప్రధాన్ అను ఒక ప్రియమైన సహోదరుడు తన సాక్ష్యమును ఈలాగున పంచుకొనెను. ఒక ప్లంబింగ్ కంపెనీలో అతడు పర్యవేక్ష అధికారి (సూపర్‌వైజర్)గా అతడు పనిచేయుచుండెను. కోవిడ్ సమయములో అతడు తన ఉద్యోగమును కోల్పోయాడు. కనుక అతని భార్య యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురమునకు వెళ్లి, ప్రార్థన చేయుచుండెను. అక్కడ ఆమె తన కుటుంబ సభ్యులందరిని కుటుంబ ఆశీర్వాద పధకములో భాగస్థులనుగా నమోదు చేసుకొనెను. వారికి ఎంతో కొదువుగా ఉన్న ఆ సమయములోనే వారు సేవా పరిచర్యకు కానుకలను సమర్పించారు. ప్రార్థనా గోపురములో ఉన్న వారు నూతనమైన కంపెనీని ప్రారంభించవలసినదిగా సలహా ఇచ్చారు. అది వారు దేవుని యొక్క మాటగా తీసుకొని, నూతనమైన కంపెనీని ఆరంభించారు. ఒకరోజు తర్వాత, ఒక కంపెనీలో పనిచేయడం కొరకు, అతనిని ఆహ్వానిస్తూ, వారికి ఒక కాల్ వచ్చింది. ఒక వారము రోజులలోనే, ఆ సహోదరునికి 60 వేల రూపాయలు లభ్యమైనది. ప్రభువు ప్రతి రోజు కూడా వారిని ఆశీర్వదించుటకు ఆరంభించాడు. ఈ రోజున అతని క్రింద 20 మంది పనిచేయుటకు పనివారు ఉన్నారు. ఒకరోజున నా భర్తగారు అతనిని పిలిచి, వారు ఒక స్వంత గృహమును కలిగి ఉండాలని, వారి నిమిత్తము ఆ రీతిగా ప్రార్థన చేయడము జరిగింది. ఈ రోజున తన కుటుంబ సభ్యుల సమేతముగా స్వంత గృహములో నివసించుచున్నారు. ఎంత అద్భుతకరమైన దేవుని మనము కలిగియున్నాము కదా!

నా ప్రియులారా, దేవుడు మన యొక్క ప్రతి దిన జీవితమును ఆశీర్వదించుడవాడై యున్నాడు. దేవుడు మీ యొక్క గంపను, పిండి పిసుకు మీ తొట్టిని ఆశీర్వదించువాడై యున్నాడు. మీరు భుజించుటకు అత్యంత సమృద్ధిని కలిగియుంటారు. ఈ యొక్క వాగ్దానము మీ జీవితములో నెరవేరును గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మా పరలోకపు తండ్రీ, నీ వాక్యములో నీవు వాగ్దానము చేసినట్లుగా నీ ఎడతెగని ప్రేమ మరియు సంరక్షణ కొరకు మేము నీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. దేవా, మా గంపను మరియు పిండి పిసుకు తొట్టియు ఆశీర్వదించుము మరియు నీ సమృద్ధి మరియు సదుపాయంతో మా జీవితాన్ని నింపుము. దేవా, నిన్ను సంపూర్ణంగా విశ్వసించడానికి మరియు మాకు కావాల్సినవన్నియు నీ పరిపూర్ణ సమయానికి అనుగ్రహిస్తావని నమ్మడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, అన్నింటికంటె మొదట రాజ్యాన్ని మరియు నీతిని వెదకడానికి మాకు నేర్పించుము. దేవా, మేము ఎల్లప్పుడు చింతించకుండా, దానికి బదులుగా నీ సదుపాయం మరియు సంరక్షణ వాగ్దానాలలో విశ్రాంతి తీసుకొనునట్లుగా సహాయము చేయుము. ప్రభువా, మా జీవితంలోని ప్రతి అంశంలో మేము నీకు మొదటి స్థానం ఇస్తున్నందున మా విశ్వాసాన్ని బలపరచుము. దేవా, మా అనుదిన పోషణ మరియు ఆశీర్వాదాలు నీ యొక్క గొప్పతనానికి మరియు ప్రేమకు సాక్ష్యమిచ్చునట్లు చేయుము. ఈ రీతిగా మమ్మును నీవు ఆశీర్వదించుము. దేవా, మీ అత్యంత సమృద్ధి మా మీద ఉండునట్లుగా చేయుము. దేవా, మేము ఇంతవరకు బాధపడినది చాలు, మా జీవితములో కొదువను తొలగించుము, వస్తువు పరంగా మమ్మును ఆశీర్వదించుము. దేవా, మా చేతి పనిని ఆశీర్వదించుము, మా చేతి పనిని ఆశీర్వదించుము. ప్రభువా, ఇక మీద ఎటువంటి కొదువలేకుండా, సమస్తమును మా జీవితములో వృద్ధిపొందునట్లుగా కృపను దయచేతుము. దేవా, నీ పూర్ణ దీవెనలతో మమ్మును ఆశీర్వదించుమ, మా అప్పులు మరియు బాధలను తొలగించుము. ప్రభువా, నీ యొక్క శ్రేష్టమైన మేలులు మా జీవితములో మాకు సమృద్ధిగా అనుగ్రహించుమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.