నా ప్రియ స్నేహితులారా, మన ప్రభువు ఎల్లప్పుడు మనతో కూడా ఉన్నాడని మనకు తెలుసు. ఆయన ఎన్నటికిని మనలను విడువడు మరియు ఎడబాయడు. ఇంకను దేవుని చిత్తమును జరిగించువారికి ముందుకు కొనసాగి వెళ్లడానికి ఆయన స్పష్టమైన మార్గమును అనుగ్రహించును. కనుకనే, చింతించకండి. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 97:10 వ వచనము నుండి ఆయన మనతో మాట్లాడుచున్నాడు. ఆ వచనము, "...తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును'' అని వాక్యము మనకు సెలవిచ్చుచున్నది. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపిస్తాడు. అవును, అది నిజమే, దేవుడు తన భక్తుల ప్రాణమును భద్రపరచు నిమిత్తమే ఆయన ఇక్కడ ఉండియున్నాడు.
నా ప్రియులారా, దుష్టుల యొక్క వివిధ దుష్ట పన్నాగముల మధ్య మీరు వెళ్లుచున్నారేమో? మీ సొంత జీవితము మీద దాడి చేయబడుచున్నదేమో? ఒకవేళ మీరు దేవుని సేవకులై ఉండవచ్చును. తద్వారా మిమ్మును మరియు మీ కుటుంబ సభ్యులను చంపివేస్తామన్న బెదిరింపులు మిమ్మును చుట్టుబడి ఉన్నాయేమో?లేక మీ సొంత బంధువులు యొద్ద నుండి కూడా బెదిరింపులు మరియు మీ కుటుంబానికి వ్యతిరేకముగా చేతబడి కార్యములు చేయబడి ఉండవచ్చును. ఎందుకంటే, మీరు యేసును ప్రేమించుచున్నారు. కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, దేవుడు మీ కొరకు చలించిపోతున్నాడు. ఆయన మీ పక్షమున నిలబడి, మిమ్మును కాపాడుటకు సిద్ధముగా ఉన్నాడు. ఆయన మీ ప్రాణమును కాపాడును. కనుకనే, మీరు చింతించకండి. ఏ బెదిరింపులు కూడా మిమ్మును తాకజాలవు. దుష్టుల చేతిలో నుండి ఆయన తన ప్రజలను విడిపించుటకు శక్తిమంతుడై యున్నాడు. కాబట్టి, దిగులుపడకండి.
బైబిల్‌లో చూచినట్లయితే, రాజైన సౌలు దావీదు యొక్క విజయమును బట్టియు మరియు ప్రఖ్యాతిని బట్టి ఎంతగానో అసూయ చెందాడు. తద్వారా, సౌలుకు బదులుగా అతడు రాజు కాకమునుపే, దావీదును నాశనము చేయాలనుకున్నాడు. ఎందుకంటే, అందరు కూడా అతని పేరును కొనియాడుచున్నారు. కనుకనే, దావీదు తనకు బదులుగా రాజుగా వస్తాడని అనుకున్నాడు. ఆలాగుననే, మీ ఉద్యోగములో కూడా మిమ్మును బట్టి ఇతరులు బెదిరిపోవుచున్నారేమో? మీ సంఘములోను, మీ చుట్టుప్రక్కల ప్రాంతములలోను మిమ్మును బట్టి బెదిరిపోవుచున్నారేమో? వారు మిమ్మును అంతము చేయాలని ప్రయత్నము చేయుచున్నారేమో? చూడండి, దావీదు తన ప్రాణ నిమిత్తము దేవుని హత్తుకొని జీవించాడు. దావీదును కనుగొని చంపాలని సౌలు అతనిని వెదుక్కుంటూ అతని యింటికి వచ్చాడు. అప్పుడు దేవుడు దావీదు తప్పించుకొనుటకు తన భార్య ద్వారా సహాయము చేశాడు. అతనిని కనుగొని చంపివేయడం కోసము, సౌలు నగరము వెంబడి నగరము అతనిని తరుము చుండెను. దావీదు ఆశ్రయము పొందుకున్న స్థలములలో ఉన్న ప్రజలు దావీదును సౌలుకు అప్పగించాలని అనుకున్నారు. కానీ చివరిగా, దావీదు ఉన్న గుహలో సౌలు అతనిని కనుగొని, అతనిని చంపివేయడానికి అతని యొద్దకు వచ్చాడు. అయితే, అక్కడ కూడా సౌలు చేతిలో నుండి దావీదు తప్పించుకునేలా దేవుడు చేశాడు. దానికి బదులుగా సౌలు ప్రాణాన్ని దేవుడు దావీదు చేతులకు అప్పగించాడు. సౌలు నిద్రపోవుచుండుట దావీదు కనుగొని యున్నాడు.
చివరికి, నా ప్రియులారా, దావీదుపై దేవుని సంరక్షణ స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే, అతనిని నాశనం చేయాలని కోరిన సౌలు విజయం సాధించలేకపోయాడు. చివరికి దావీదు చేతికి సౌలు ప్రాణాన్ని అప్పగించాడు. ఆలాగుననే, దేవుడు మీ శత్రువులను చివరిగా మీ చేతులకు అప్పగించువాడై యున్నాడు. మీ శత్రువులు మీ యొద్దకు వచ్చి, మిమ్మును పరిశుద్ధులని పిలుస్తారు. మిమ్మును నాశనము చేయాలన్న ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికిని, చివరికి ఏదియు వర్థిల్లలేదు. సర్వశక్తిమంతుడైన మన దేవుని యొక్క భద్రత ఆలాగున ఉంటుంది. రండి, ఆయనలో దాగుకొనుటకు నాతో కలిసి ప్రార్థించండి. ఆయన మిమ్మును భద్రపరుస్తాడు మరియు సంరక్షిస్తాడు. ఇంకను ఆయన మీ జీవితంలో తన పరిశుద్ధమైన సన్నిధిని గుర్తించే స్థలమునకు మీ శత్రువులను తీసుకువస్తాడు. వారు, మిమ్మల్ని కిందకు దింపడానికి మేము చేయగలిగినదంతా చేసాము, కానీ అది విజయవంతం కాలేదు అని అనుకుంటారు.చూడండి మన దేవుని భద్రత తన బిడ్డలైన వారిపట్ల అంత బలమైనదిగా ఉంటుంది. కనుకనే, మీరు చింతించకండి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును కాపాడి సంరక్షించి, మిమ్మును విడిపించి, దీవిస్తాడు.
కాబట్టి, ప్రియ స్నేహితులారా, మీరు వచ్చి ప్రభువును ఆశ్రయించండి. ఆయనలో మిమ్మును దాచుకోండి, దుష్టుల చేతుల నుండి ఆయన మిమ్మును తప్పించి, మిమ్మును విడిపించి, రక్షిస్తాడు.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మమ్మును భద్రపరచువాడా, మా కోట, మా రక్షణ, మా స్థిరమైన బండవై ఉన్నందున మేము నిన్ను స్తుతించుచున్నాము. దేవా, మేము నీలో దాగుకుంటున్నాము, నీ సన్నిధిలో ప్రార్థించుచున్నాము, నీవే మమ్మును భద్రపరచి విడిపించువాడవు, కనుకనే, ప్రభువా, మా మీద దుష్టుల బలమైన హస్తాన్ని నీవు చూస్తున్నావు, వారు మాకు విరోధంగా వస్తున్నారు, ఆశ్రయము కొరకు మేము ఎక్కడికి వెళ్లగలము, ఎవరు మమ్మును రక్షిస్తారు. యేసయ్యా, నీవే మమ్మును రక్షించువాడవు, కనుకనే, నీవు ఈ రోజు వాగ్దానము చేసినట్లుగానే, మా కొరకు, మా పక్షమున నిలబడి, నీవు మా కొరకు పోరాడి, మా శత్రువు పోరాటము నుండి మరియు మా శత్రువుల చేతిలో నుండి మాకు విడుదలను దయచేయుము. ప్రభువా, మమ్మును మరియు మా కుటుంబమును నీ రెక్కల నీడలో భద్రపరచుము. దేవా, నీ బలమైన చేతికి వ్యతిరేకంగా ఏ శక్తి లేదా దుష్టపన్నాగము విజయం సాధించలేదని విశ్వసించేలా మా హృదయాన్ని బలపరచుము. ప్రభువా, నీ రక్షణ మా చుట్టూ కేడెమువలె ఉండునట్లు చేయుము, మమ్మును మరియు మా ప్రియులైన వారిని కాపాడుము. దేవా, మా ప్రాణమునకు నెమ్మది కలుగునట్లుగాను, నీవు దావీదును శత్రువుల చేతిలో విడిపించినట్లుగానే, నీవు మాతో ఉండి, మా దుష్ట పన్నాగములన్నిటిని నుండి మమ్మును విడిపించుము. ప్రభువా, మా పోరాటల నుండియు మరియు మా శత్రువుల చేతిలో నుండి మమ్మును విడిపించి, కాపాడి సంరక్షించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.