నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు  23:3వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, ‘‘ నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు’’ ప్రకారం అవును, ప్రియులారా, ఈ ఉదయకాలమున మన ప్రభువు మీ ప్రాణములకు సేదదీరుస్తాడు మరియు తన సమాధానమును మీకు ఇస్తాడు. 

నా ప్రియ స్నేహితులారా, మన ఆలోచనలు, అవసరాలు, మనోభావాలు, మన ప్రాణము నుండి మరియు మనస్సు నుండియు కలుగుతాయి. మన జీవితములో ఏమి చేయాలని అనుకుంటాము, మన జీవితానికి ఏమి కావాలి అనియు, మన జీవితము ఎలా ఉంటుందని మనము ఊహించుకొనునది అంతయు మన ప్రాణము మరియు మనస్సులో నుండే జరుగుతుంది. మన జీవితము ఎలాగున ఉండాలి? ఆశలన్నియు కూడా మన ప్రాణములోనే, మరియు మనస్సులోనే ఉంటాయి. గణాంకముల ప్రకారం ప్రతిరోజు, 60 వేల ఆలోచనలను మన మనస్సులోనే కలుగుతాయి. అందులో 75 శాతము మరల మరల మన మనస్సులో కలిగేవి. మనము దేని గురించి ఆలోచిస్తాము? అని చూచినట్లయితే, ‘ నేను జీవితములో ఎలా విజయవంతముగా మారుతాను? నా కుటుంబాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకుంటాను? నా వ్యాపారాన్ని నేను ఎలా చూసుకోగలను? నేను ఎవరిని వివాహము చేసుకుంటాను? నా పేరు ప్రతిష్టతలను ఎలా కాపాడుకోగలను? నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? భవిష్యత్తులో కుటుంబము, భవిష్యత్తులో ఉద్యోగము, భవిష్యత్తులో జీవితము ఎలా ఉండబోతుంది. నేను ఏమి చేయాలి? ఏ అడుగు నేను వేయాలి? అది మాత్రమే కాదు, ఒకవేళ ఇది జరగకపోయినట్లయితే ఎలా? నా ఆలోచన ప్రణాళిక జరగకపోయినట్లయితే ఎలా? తగిన సమయానికి నేను రసీదులన్నియు చెల్లించకపోయినట్లయితే ఎలాగున? అనే ఈ భావోద్వేగాలన్నియు కూడా మరియు ఈ ఆలోచనలన్నియు కూడా మన మనసులో ఉంటాయి. అనేకసార్లు ఈ ఆలోచనలన్నియు కూడా, విపరీతంగా పెరిగిపోయినప్పుడు, మనము ఆందోళనకు మరియు భయానికి గురువుతాము. తద్వారా, మన జీవితములో మనము ముందడుగు వేయలేకపోతుంటాము. అది భయాందోళన అయి ఉండవచ్చును, ఒకవేళ అది అవమానము అయి ఉండవచ్చును. ఓడిపోతాము అన్న భయము మనలో ఉండవచ్చును. అనేకసార్లు ఈలాగున తలంచి, మనము ముందుకు వెళ్లలేకుండా ఆగిపోతాము. ముందుకు వెళ్లలేకుండా పోతున్నాము అన్న ఆందోళన భావముతో కూడా, మన జీవితములో ఎదురయ్యే అడ్డంకుల వలన, వైఫల్యము మరియు అనారోగ్యము ఒత్తిడియై ఉండవచ్చును, అపవాది దాడులై ఉండవచ్చును, అవి మనము ముందుకు వెళ్లలేకుండా ఆటంకము కలిగించవచ్చును. అవి మనము ముందుకు వెళ్లనివ్వకుండా ఆపివేస్తుంటాయి. కానీ, ఈ పరిస్థితులన్నిటిలో కూడా, మనము సంతోష సంధర్భాలను లేక దుఃఖ సందర్భాలను ఎదుర్కొన్నప్పటికిని, ప్రభువు మన ప్రాణమును సేదదీరుస్తాడు. మనలో సమాధానమును ఉంచుతాడు. 

నా ప్రియులారా, ఈ యొక్క సేదదీర్చుటను గూర్చి మనము చూచినప్పుడు, ఈ లోకములో అనేకులు ఒక పార్కుకు వెళ్లి సేదదీర్చుకొనవచ్చును, మర్థన చేయించుకొనుట వలన సేదదీర్చుకొనవచ్చును, ఒక మూవీ థియేటర్‌కు వెళ్లి వారి మనస్సును సేదదీర్చుకుంటుండవచ్చును లేక స్నేహితులతో బయటకు వెళ్లి, కొన్ని గంటలు వారితో గడిపి ఆ విధంగా వారు సేదదీర్చుకొనవచ్చును. అయితే, యింటికి తిరిగి వచ్చిన తర్వాత, వారి సమస్యలు, వారు అతిగా చేయుచున్న ఆలోచనలన్నియు కూడా వారి కొరకు ఎదురు చూస్తుంటాయి. భయాందోళనను కలుగజేయుచున్నవన్నియు కూడా వారి మనస్సులో మెదులుతూ, వారు నిద్రపోలేకుండా చేస్తాయి. అయితే, అటువంటి పరిస్థితులలో కూడా ప్రభువు యొద్ద ఒక జవాబు ఉన్నది, ఈ వచనములో దావీదు చెప్పిన రీతిగా, ప్రభువు మన ప్రాణమును సేదదీరుస్తాడు. 

అయితే, నా ప్రియులారా, ఆయన ఈ కార్యమును ఎలాగున చేస్తాడు? మనము ప్రతిరోజు ఆయన వాక్యమును చదువుచుండగా, జీవితములో నూతన ధృక్పదాలను ప్రభువు మనకు ఇస్తాడు. మన జీవితాలను ఎలా నడిపించాలో, నూతన ప్రత్యక్షతలను ఇస్తాడు. ఇంకను బైబిల్ గ్రంథములోని ఉదాహరణల ద్వారా, సత్యాల ద్వారా, దేవుడు తన వాక్యము ద్వారా, అనుదినము మనతో మాట్లాడతాడు. అంతమాత్రమే కాదు, ‘నీ జీవితమును ఈ విధానములో నడుపు,’ అని ఆయన మనకు బోధిస్తాడు మరియు ‘నేను నీతో ఉన్నాను’ అని మనకు వాగ్దానమిచ్చుచున్నాడు. ఇంకను ‘నీ కుటుంబాన్ని ఈలాగున చూసుకో,’ అని మనతో మాట్లాడతాడు, ‘ నీ వ్యాపారమును ఈలాగున నిర్వహించుకో, ఈలాగున జరిగించు ’ అని మాట్లాడతాడు. ఇంకను,  ‘నీ చదువులలో ఈలాగున ముందుకు వెళ్లాలి’ అని మాట్లాడతాడు, ‘జీవితాన్ని ఈలాగున నడిపించు’ అని చెబుతాడు. అంతమాత్రమే కాదు, ప్రతి ఉదయమున ఆయన తన వాక్యము ద్వారా మన ప్రాణములను సేదదీరుస్తాడు.  

కాబట్టి, నా ప్రియస్నేహితులారా, దేవుని వాక్యము ద్వారా మనలను మనము సేదదీర్చుకుందాము. ‘అనుదినాహారము మాకు దయచేయుము’ అని యేసు ప్రభువు చెప్పిన రీతిగా, ఆయన వాక్కు మీ ప్రాణమునకు ఆహారమై ఉంటున్నది.  ఆ వాక్యము మీ ప్రాణమునకు సేదదీరుస్తున్నది. మీరు నడవవలసిన త్రోవలో మిమ్మును నడిపిస్తుంది. ఆయన మన ప్రాణములను సేదదీర్చుచున్నందుకై ఆయనకు వందనాలు చెల్లించుదాము. అనుదినము ఆయన ఆత్మతో నింపబడుచుండగా, ఆయన మనలను సేదదీర్చి, మనకు సమాధానమును అనుగ్రహిస్తాడు. ఇప్పుడే, ఇట్టి ధన్యతను పొందుకుందామా? ఆలాగైతే, నేడే మీ జీవితాలను దేవునికి అప్పగించండి, ఆయన నేటి వాగ్దానము ద్వారా మీ ప్రాణములనకు సేదదీర్చి, మిమ్మును దీవించును గాక. 

పార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసయ్యా, మా ప్రాణములకు సేదదీర్చుచున్నందుకై నీకు వందనాలు. ప్రభువా, ఈ రోజు మా హృదయములో అనేకమైన ఆందోళనలను మరియు బరువులను మోయుచున్నాము. దేవా, అనేకమైన చింతలు, భయము మమ్మును బాధించుచున్నవి, మా జీవితము ఎలా ఉండబోవుచున్నదన్న ఆలోచనలు మాలో నుండి తొలగించి, మా ప్రాణమునకు సేదదీర్చుము. యేసయ్యా, ఇప్పుడే నీ ఆత్మను మా మీద కుమ్మరించుము. దేవా, మా హృదయమును మరియు మా మనస్సును, మా ప్రాణమును  నూతనపరచుము. ప్రభువా, ప్రతి రోజు నీ వాక్యమును చదువుచుండగా, మేము నడవవలసిన త్రోవలో మమ్మును నడిపించుము. దేవా, మా యొక్క ప్రతి పరిస్థితులలో కూడా మేము సమాధానమును కలిగి ఉండునట్లుగా కృపను చూపుము. ప్రభువా, భయం మరియు నిరుత్సాహము మమ్మును చుట్టుకొనడానికి ప్రయత్నించినప్పుడు, నీవే మాకు ఆశ్రయం మరియు దుర్గముగా ఉండుము.  దేవా, మా కష్ట సమయాలలోను మరియు సంతోష సమయములలో కూడా, నీ యొక్క దైవీకమైన సమాధానమును మాకు అనుగ్రహించుము. ప్రభువా, ప్రతి రోజు మేము సేదదీర్చబడునట్లుగా మాకు నీ కృపను మాకు దయచేయుము. యేసయ్యా, మేము నీ వైపు చూచుటకును, నీతో సమయము గడుపుటకును, మాకు అనుదినాహారమును దయచేసి, మమ్మును పోషించుమని యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.