నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామమున మీకు ఈ నూతన మాసములో మీకు శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మత్తయి 5:6వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనములో, "నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచ బడుదురు'' అని వ్రాయబడియున్నది. అవును, నా ప్రియ స్నేహితులారా, నీతివంతమైన జీవితమును జీవించాలని ఈ వచనము చక్కగా మనకు వివరించుచున్నది. కనుకనే, నేడు మీరు నీతి కొరకు దాహం మరియు దాని కొరకు ఆకలితో ఉన్నప్పుడు, మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు నిజమైన సంతృప్తిని పొందుకుంటారు.

కొంతమంది ప్రార్థనా కూటములకు వచ్చినప్పుడు, వ్యక్తిగత ప్రార్థన సమయంలో మేము వారి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించుచున్నప్పుడు, "మా పట్ల ప్రభువు చిత్తం ఏమిటి? దేవుని అడిగి, మాకు తెలియజేయండి'' అని చెబుతారు. నా ప్రియ స్నేహితులారా, మీ నుండి ప్రభువు కోరుకునేది ఇదే; నీతి కొరకు ఎక్కువగా దాహం కలిగి ఉండాలి. మీరు ఇటువంటి దాహమును కలిగి ఉన్నట్లయితే, మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు సంతృప్తి చెందుతారు. దేవుని వాక్యములో ఈ సత్యమును స్పష్టముగా మనకు రుజువుపరచుచున్నది. ఇంకను ఆదికాండము 15:6, గలతీయులకు 3:6, మరియు యాకోబు 2:23వ వచనములలో, దేవుని వాక్యము మనకు ఇలాగున తెలియజేయుచున్నది, "కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను'' అని వ్రాయబడియున్నది. అవును, అబ్రాహాము ప్రభువును విశ్వసించిన గొప్ప దైవజనుడు మరియు అతడు విశ్వాసులకు తండ్రిగా పరిగణించబడెను. అంతమాత్రమే కాదు, అతనికున్న కదల్చబడని విశ్వాసం ద్వారా అతడు నీతిమంతునిగా తీర్చబడ్డాడు.

అవును, నా ప్రియులారా, బైబిల్‌లో కీర్తనలు 15:2వ వచనమును చూచినట్లయితే, "యథార్థమైన ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయ పూర్వకముగా నిజము పలుకువాడే'' అని చెప్పబడియున్నది. అవును, నా స్నేహితులారా, మనం ప్రభువుతో నీతిగా నడుచుకోవాలని పిలువబడియున్నాము. బైబిల్‌లో కీర్తనలు 17:15వ వచనమును చూచినట్లయితే, దావీదు ఈ కోరికను కూడా వ్యక్తపరిచాడు, " నేనైతే నీతిగలవాడనై నీ ముఖదర్శనము చేసెదను నేను మేల్కొనునప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును'' అని వ్రాయబడియున్నది. బైబిల్ అంతటా, దానియేలు, దావీదు మరియు యోబు వంటి దైవజనులందరూ నీతివంతమైన జీవితాలను అనుసరించారు మరియు ఆలాగుననే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు. అవును, స్నేహితులారా, మనం కూడా నీతి కొరకు దాహం కలిగి ఉండాలి. మన శారీరక ఆకలి మధ్యాహ్నం లేదా మరి ఇతర సమయములలో వచ్చినప్పుడు ఎలా ఉంటామో? అదే తీవ్రతతో మనం నీతి కొరకు ఆకలిదప్పులు కలిగి ఉండాలి. హల్లెలూయా!

నా ప్రియులారా, బైబిల్‌లో చూచినట్లయితే, కీర్తనలు 37:5వ వచనము ఈలాగున చెబుతుంది, "నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును'' అని చెప్పబడినట్లుగానే, మన మార్గములన్నిటిని దేవుని హస్తాలకు అప్పగించినప్పుడు, ఈ నీతివంతమైన జీవితానికి మార్గాన్ని చూపుతుంది. కనుకనే, నేడు మీ మార్గాలను సంపూర్ణంగా ప్రభువునకు అప్పగించండి. ఇంకను ఆయనను వేడుకొనండి, "తండ్రీ, నాకు బోధించుము మరియు నన్ను నడిపించుము'' అని ప్రతిరోజు ప్రార్థించండి. మీరు నిజంగా ప్రభువును విశ్వసించి, ఆయనతో సన్నిహితంగా నడుచుకున్నట్లయితే, ఆయన మీకు నీతివంతమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. కావున, నా ప్రియ స్నేహితులారా, ఇప్పుడే ప్రార్థించమని మరియు నీతిమంతమైన జీవితాన్ని అనుగ్రహించమని ప్రభువును అడగమని నేను మిమ్మును కోరుచున్నాను.ఆలాగున మీరు ఆయనను అడిగినప్పుడు, నేడు ప్రభువు మీ హృదయాన్ని తన నీతి కొరకు ఎక్కువగా ఆకలిదప్పులతో నింపుతాడు. కనుకనే, నేడు మీ హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, దేవుడు మీ భౌతిక మరియు ఆధ్యాత్మిక జీవితాలను నేటి వాగ్దానము ద్వారా తృప్తిపరచి, మిమ్మును దీవిస్తాడు. ఆమేన్!

ప్రార్థన:
అమూల్యమైన మా ప్రేమగల పరలోకపు తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, నీ సన్నిధిని మరియు నీతిని కోరుతూ వినయ హృదయంతో నీ యొద్దకు వచ్చుచున్నాము. ప్రభువా, నీ పరిశుద్ధమైన మార్గాల కొరకు మమ్మును తీవ్రమైన ఆకలిదప్పులతో నింపుము. దేవా, మేము యథార్ధంగాను మరియు నీతిగాను నీ యందు నడుచుకోవడానికి మరియు మా హృదయంలో నిజం మాట్లాడడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, అబ్రాహాము నిన్ను విశ్వసించినందున అతడు నీతిమంతునిగా ఎంచబడ్డాడు. ఆలాగుననే, మేము కూడా నీ యందు విశ్వాసంలో బలముగాను, స్థిరంగాను నిలియుండునట్లు చేయుము. ప్రభువా, దయచేసి ప్రతిరోజు మా అడుగుజాడలను నీవైపునకు నడుచునట్లుగాను మరియు నీ మార్గాలకు మా జీవితాలను సంపూర్ణంగా సమర్పించుకొని ఉండటానికి సహాయం చేయుము. దావీదు మరియు నీ భక్తులు నిన్ను అనుసరించినట్లుగానే, మేము నీ అడుగుజాడలను అనుసరించుచు, నీ యందు నమ్మకమైన మరియు నీతిమంతమైన మరియు యథార్థవంతులముగా జీవించుటకు మాకు నీ కృపను దయచేయుము. దేవా, నీ భక్తుల వలె మా ఆత్మ నీలో స్థిరముగా నిలిచి ఉండునట్లుగాను మరియు నీ ముఖ దర్శనమును చేయుటకును మరియు నీతో సన్నిహితంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ప్రభువా, నీతి కొరకు మేము ఎల్లప్పుడు ఆకలిదప్పులు కలిగియుండునట్లుగా మా జీవితాలను మార్చుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.