నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 51:3వ వచనం ప్రకారం దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆ వచనము, "యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెనువలె చేయుచున్నాడు దాని యెడారి భూములు యెహోవా తోటవలెనగునట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములును కృతజ్ఞతా స్తుతియు సంగీతగానమును దానిలో వినబడును'' ప్రకారం దేవుడు మీ జీవితాలను ఏదెను తోటవలె మార్చుటకు మీ పట్ల కోరుచున్నాడు. కాబట్టి, మీరు దిగులుపడకండి.


నా ప్రియులారా, ఇంకను బైబిల్‌లో సంఖ్యాకాండము 24:1వచనములో చెప్పబడినట్లుగానే, "ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలిసికొనినప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్లక అరణ్యము వైపు తన ముఖమును త్రిప్పుకొనెను.'' అదేవిధముగా, "నేను ఆమె అరణ్య స్థలములను ఏదెనువలె చేస్తాను'' అని ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనము ఏదెను తోటను గురించి మన మనస్సులో తెచ్చుకొనినప్పుడల్లా, అది ఎంత వైభవవంతముగా ఉంటుందో కదా అని ఆలోచన మనకు వస్తుంది. ఏదెను దేవుడు స్వయంగా ప్రత్యక్షమగుచున్న ప్రాంతము అది. ప్రభువు ఆదాము హవ్వలతో కూడా సంచరించుచున్న స్థలము అది. నా ప్రియ స్నేహితులారా, అటువంటి ఆశీర్వాదమును దేవుడు మీకు అనుగ్రహించాలని నేడు మీ పట్ల కోరుచున్నాడు.

ఇంకను బైబిల్‌లో యెషయా 51:1-2వ వచనములలో, "నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండు వారలారా, నా మాట వినుడి మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాని ఆలోచించుడి మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దాని ఆలోచించుడి. మీ తండ్రియైన అబ్రాహాము సంగతి ఆలోచించుడి మిమ్మును కనిన శారాను ఆలోచించుడి'' అని మనము చూడగలము. వారు ఏ విధంగా ఆశీర్వదింపబడియున్నారు? అని చూచినట్లయితే, "అతడు ఒంటరియై యుండగా నేను అతని పిలిచితిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది యగునట్లు చేసితిని'' అని చెప్పినట్లుగానే, ప్రభువు ఆశీర్వాదముల చేత వారిని ఆశీర్వదింపజేసి, వర్థిల్లత చేత దేవుడు వారిని గొప్పగా విస్తరింపజేశాడు. ప్రభువు అబ్రాహాముతో కూడ నడుచుట మాత్రమే కాకుండా, అతనికి స్నేహితుడుగా ఉన్నాడు. అదేవిధంగా, నా ప్రియ స్నేహితులారా, ప్రభువు మీ మధ్యన కూడ ఉన్నాడు. మీరు ఏదెను తోటవలె ఉంచబడియున్నారు. ఏదెను ఆయన సన్నిధి నివసించే ప్రదేశం.

రెండవదిగా, ప్రభువు ఈలాగున సెలవిచ్చిన మాట ఏదనగా, "దాని యెడారి భూములు యెహోవా తోటవలెనగునట్లు చేయుచున్నాడు.'' యెహోవా యొక్క తోట ఏ రీతిగా ఉండినది? "యెహోవా తోటవలెను ఐగుప్తు దేశమువలెను నీళ్లు పారు దేశమైయుండెను'' అని ఆదికాండము 13:10వ వచనములో చెప్పబడిన ప్రకారం, ఆ యొక్క తోటలో నాలుగు నదులు ప్రవహించుచున్నాయి మరియు ఆ తోట దేవుని స్వహస్తములతో నాటబడింది. అవును, ప్రభువు మిమ్మును తోటవలె చేయగా, తద్వారా, మీరు ఇతరులకు నీటిని అందించెదరు. అదేవిధంగా, దేవుడు మిమ్మల్ని బాగా నీళ్ళున్న తోటగా చేస్తాడు. మీరు ఆయన ఆశీర్వాదాలతో నింపబడి ఉంటారు, తద్వారా మీరు ఇతరులకు నీరు పోయుటకు ఉత్తేజమును పొందుకుంటారు.

ఇంకా, నా ప్రియులారా, ప్రభువు వాగ్దానం చేయుచున్నాడు, "ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్తుతియు సంగీతగానమును దానిలో వినబడును.'' దీని భావమేమనగా, దేవుడు మీ జీవితానికి పునరుద్ధరణను అనుగ్రహిస్తాడు. శారాను మీరు గమనించండి, గొడ్రాలి తనములో నుండి దేవుడు జీవమును అనుగ్రహించాడు. 'నవ్వు' అనే భావమునిచ్చే ఇస్సాకును దేవుడు ఆమెకు ఆశీర్వాదకరంగా ఇచ్చాడు. ప్రభువు ఆమె నవ్వుతూ ఉండునట్లుగా చేసియున్నాడు. నా జీవితములో కూడా నా యొక్క తల్లిగారు మరణించినప్పుడు, నేను ఎంతగానో ఏడ్చి యున్నాను. ఒకరోజున మా యొక్క కుటుంబ సమేతంగా ప్రార్థన సమయములో మా తండ్రిగారైన సహోదరులు దినకరన్‌గారితో, మాట్లాడి, "నా కుమారీ, ఏడ్వవద్దు, అనేకమైన తలాంతులు గల బిడ్డలను నీకనుగ్రహించి, నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఏ యొక్క గృహములో నీవు ఏడ్పును, రోదన ధ్వనిని వినియున్నావో, అదే గృహమున నీ బిడ్డల యొక్క నవ్వును నీవు వినెదవు అని చెప్పాడు.'' అప్పుడు నాలో నేను ఎంతగానో నవ్వుకుంటూ, దేవుని స్తుతిస్తూ ఉండిపోయాను. నేను కనీసము ఈ రోజు గర్భము కూడా ధరించలేదు కదా, ఎంత్తైనప్పటికిని ప్రభువు నాతో ఈ రీతిగా ఎలా మాట్లాడుచున్నాడు? అని అనుకున్నాను. అవును, అక్షరాల నేను ఎక్కడైతే, ఏడ్చి, రోధించియున్నానో, అదే ప్రాంతములో నా బిడ్డల యొక్క నవ్వులను నేను వినియున్నాను.

నా ప్రియులారా, "ఆనంద సంతోషములు ఆమెలో కనబడును'' అని చెప్పినట్లుగానే, మీరు నవ్వుతూ ఉండెదరు. నేడు ప్రభువు మీ యొక్క నోటిని నవ్వుతో నింపుతాడు. అప్పుడు మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, సంగీత గానములు చేయుదురు. 'కృతజ్ఞతా స్తుతియు మరియు సంగీతగానములు అను మాటలు ఇక్కడ కనబడుచున్నాయి,' అను ఈ మాటలు ప్రభువు ఈ రోజు మీతో సెలవిచ్చుచున్నాడు. అవును నా ప్రియులారా, చెప్పనక్యముకానీ, దేవుని యొక్క బహుమానమైన యేసుక్రీస్తును బట్టి, మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. దేవుడు మీ యొక్క అసలైన పిలుపులోనికి మీకు పునరుద్ధరణను జరిగించును. ఎందుకంటే, మిమ్మును పిలిచి యున్న ప్రభువు నమ్మదగినవాడై యున్నాడు. నేడు మీ యొక్క దుఃఖము విచారము ఆనందముగా మార్చబడనై యున్నాయి. ప్రభువు నా జీవితములో ఆలాగున జరిగించియున్నాడు. నా స్నేహితులారా, ఆలాగుననే, మీకును జరిగించడా? నిశ్చయముగా జరిగిస్తాడు. అరణ్యము వలె ఉన్న మీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నట్లయితే, అరణ్యము వలె ఉన్న మీ జీవితాన్ని ఏదెనువలె చేయుచున్నాడు, మీ యెడారి భూములు యెహోవా తోటవలెనగునట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములును కృతజ్ఞతా స్తుతియు సంగీతగానమును మీ జీవితములో వినబడునట్లు చేసి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మహిమఘనతా ప్రభావములు గల మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, మేము నీ వాగ్దానాలపై నమ్మకంతో విశ్వాసం నిండిన హృదయంతో నీ ముందుకు వస్తున్నాము. ప్రభువా, మా అరణ్య స్థలములన్నియు ఏదెను తోటవలె అగునట్లుగా చేయుము. మా యొక్క ఎడారి వ్యర్థ భూములన్నియు యెహోవా తోటవలె అగునునట్లు చేయుము. దేవా, ఆనంద సంతోషములు ఇప్పుడే మా హృదయములో ఉండునట్లుగా చేయుము. ప్రభువా, కృతజ్ఞత గానములతోను, సంగీత గానములో నిత్యము నిన్ను స్తుతించునట్లుగా చేయుము. దేవా, నీ మంచితనం మరియు విశ్వాసం గురించి ఆనందించుచున్నప్పుడు కృతజ్ఞతా స్తుతియు సంగీతగానమును నిరంతరం మా హృదయం నుండి వినబడునట్లుగా చేయుము. ప్రభువా, నీవు మా జీవితాలను పునరుద్ధరిస్తావనియు, ఆశీర్వదిస్తావనియు మరియు ఎల్లప్పుడూ మాతో నడుస్తావనియు మేము నమ్ముచు మా జీవితాలను నీ చేతులకు సమర్పించుకొనుచున్నాము. దేవా, నేడే మా జీవితాలను నీ సన్నిధితో నింపబడియున్న ఏదెను వలె మార్చి, మమ్మును దీవించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు మహిమ గల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.