నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు మిమ్మును చూడడము నాకెంతో సంతోముగా ఉన్నది. కాబట్టి, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 28:7వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "యెహోవా నా ఆశ్రయము, నా కేడెము నా హృదయము ఆయన యందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను'' ప్రకారం ఆయన మీకు ఆశ్రయముగాను, సహాయకుడుగా ఉంటాడు. ఒకవేళ, నేడు మీరు, ' నేను ఈ రోజు ఎంతో బలహీనంగా ఉన్నాను అని భావిస్తున్నారా? నాకు సహాయము చేయడానికి నా చుట్టు కూడా ఎవ్వరు లేరు. ఈ కష్టతరమైన పరిస్థితులన్నియు నేనే అనుభవిస్తున్నాను అని అనుకుంటున్నారా?' నా ప్రియ స్నేహితులారా, ప్రభువే నేడు మీకు సహాయము చేస్తాడు. ఈ సమయములోనే ఆయన మిమ్మును బలపరుస్తాడు. ఆయన మీతో ఉన్నాను అని మీకు ధైర్యమును అనుగ్రహిస్తాడహి అప్పుడు, మీ హృదయమంతటితో కూడా, మీరు ఆయన యందు పూర్ణ విశ్వాసమును ఉంచగలుగుతారు.

బైబిల్ గ్రంథములో యాకోబు జీవితములో అదే జరిగియున్నది. యాకోబు తన గృహము నుండి ఏ విధముగా వెళ్లిపోవలసి వచ్చినదని మనకు స్పష్టంగా తెలుసు. తన అన్న యొక్క కోపము వలన, తన అన్న యొద్ద నుండి వెళ్లి, దూరముగా సమయమును గడపవలసి వచ్చినది. ఆ సమయమందు ప్రభువు యందు ఎలా నమ్మిక ఉంచాలో, ప్రభువు అతనికి తెలియజేశాడు. దేవుని మీద అతడు ఆధారపడడము నేర్పించాడు. ఒకరోజు ప్రభువు ఈలాగున చెప్పాడు. ఆదికాండము 31వ అధ్యాయము ప్రకారముగా, ప్రభువు, తన స్వంత భూమికి మరియు తన స్వంత ప్రజల యొద్దకు తిరిగి వెళ్లమని యాకోబుకు చెప్పాడు. అయితే, యాకోబు ఎంతగానో భయపడ్డాడు. 'నా అన్నయైన ఏశావును, నేను మరల ఎలా కలుసుకోవాలి? అతనికి ఉన్న కోపాన్ని బట్టి, ఏశావు నన్ను చంపివేయడానికి వేచి ఉంటాడు కదా, నేను తిరిగి ఎలా వెళ్లాలి?' అని అనుకున్నాడు.

అదేవిధముగా, నా ప్రియ స్నేహితులారా, ఒకవేళ మీ జీవితములో కూడా కొన్నిసార్లు గతముతో వ్యవహరించవలసి వస్తుంది. గతములోని సంబంధ బాంధవ్యాలు, కుటుంబ సభ్యులతో, కొన్నిసార్లు గతములో అనుభవించిన వ్యాధులను కూడా మరల, కొన్నిసార్లు పొందుకుంటారు, 'నేను ఒంటరిగా ఉన్నాను అని బాధపడుతుంటారు, నేను వాటన్నిటిని ఎలా ఎదుర్కోవాలి, నన్ను నశింపజేయుటకు అవి వేచియున్నాయి, ఇంకను నా జీవితమును నశింపజేయుట కొరకే ఉన్నవి అని అనుకుంటారు' యాకోబు కూడా అదేవిధముగా భావించాడు. కనుకనే, అతడు ఈలాగున ప్రార్థించాడు, 'ప్రభువా, నీవే నన్ను రక్షించుము, నా అన్నయైన ఏశావు వచ్చి, నాపైన దాడి చేస్తాడేమో అని నాకు భయముగా ఉన్నది' అని దేవుని యొద్ద విన్నవించుకున్నాడు. ఆలాగుననే, తన స్వదేశమునకు వెళ్లడానికి ప్రయాణము కొనసాగించాడు, అతడు మార్గములో ఉన్నప్పుడే, ఆదికాండము 32వ అధ్యాయములో, మార్గములో అతనిని ఎదుర్కొనడానికి ప్రభువు తన దేవదూతలను పంపించాడు. దేవుని యొక్క దూతలు యాకోబును బలపరచాడు. అతనికి ఆశ్రయముగా, కేడెముగా ఉన్నాడు. అప్పుడు ఏమి జరిగిందో తెలుసా? యాకోబు తన గృహమునకు వెళ్లినప్పుడు, తన అన్న తన యొద్దకు వచ్చి, అతనిని చంపేస్తాడు అని అనుకున్నాడు. అయితే, ఏమి జరిగిందో తెలుసా? జరిగినది అంతయు ఎంతో వ్యత్యాసముగా ఉండెను.

ఏశావు, తన తమ్ముడైన యాకోబు యొద్దకు పరుగెత్తుకొని వచ్చి, అతనిని హత్తుకున్నాడు. తన చేతులను అతని మెడ మీద వేసుకొని, అతనిని ముద్దుపెట్టుకున్నాడు. వారిద్దరు కూడా ఏడ్చారు. అవును, నా ప్రియ స్నేహితులారా, ప్రభువు యాకోబును తన మార్గములో బలపరచాడు, తనకు కేడెముగా ఉన్నాడు. అతనిని ధైర్యపరచాడు. ఈ రోజు మీరు కూడా మీ గతముతో వ్యవహరించుటకు భయపడుచుండవచ్చును, నేను దీనిని ఎలా ఎదుర్కోవాలి? ఈ కార్యములో ఏమి జరుగబోతుందని అనుకుంటున్నారేమో? అయితే, నేడు ప్రభువు మిమ్మును బలపరుస్తున్నాడు. తన సమాధానమును మీకు అనుగ్రహించుచున్నాడు. ఆయన మీ హృదయమును నిమ్మళపరుస్తున్నాడు. ప్రభువు మీ చుట్టూర మీకు కేడెముగా మీకు తోడుగా ఉంటాడు. ఆయన మీ పరిస్థితులన్నిటిలోను మీకు సహాయము చేస్తాడు. ఏ హాని మిమ్మును తాకనే తాకదు. ఏ కీడు మిమ్మును తాకదు. ప్రభువే మిమ్మును రక్షిస్తాడు. కాబట్టి, ధైర్యము నొందండి నా ప్రియులారా, దేనిని గురించి మీరు చింతించకండి, మీ హృదయమును ప్రభువునందు నమ్మికయుంచడంలో కొనసాగండి. మనకు బలముగా, ఆశ్రయముగా, కేడెముగా ఉన్నందుకు ప్రభువు వందనాలు చెల్లించి, యాకోబు వలె ప్రార్థించండి, నిశ్చయముగా, దేవుడు మిమ్మును నేటి వాగ్దానము ద్వారా దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాఉ. దేవా, ఈ రోజు కష్టతరమైన గతమును మేము ఎదుర్కొంటున్నాము. తద్వారా, మేము ఆందోళన చెందుచున్నాము, ఈ రోజు నీవు మా పక్షమున నీ దూతలను పంపించి, మమ్మును ఆదరించి, బలపరచుము.దేవా, నీవు మా పక్షమున ఉన్నావని మాకు తెలియజేయుము. ప్రభువా, నీవే మాకు కేడెముగా ఉండి, మమ్మును రక్షించుము, మా హృదయము నీ యందు నమ్మిక యుంచగా, మాకు సహాయము చేసి, మాకు విజయమును నొందించుము. దేవా, నీ యొక్క సమాధానమును మాకు అనుగ్రహించి, మా పరిస్థితులన్నిటిలో మాకు తోడుగా ఉండుము. యేసయ్యా, ఈ ఉదయకాలమున మమ్మును దీవించుటకు ఎల్లప్పుడు నీవు మాకు తోడుగా ఉండుము. తండ్రీ, మేము బలహీనంగా ఉన్నప్పుడు మాకు బలముగాను, కేడెముగాను ఉన్నందుకై నీకు వందనాలు. దేవా, ఈ రోజు, మేము నిన్ను మా హృదయపూర్వకంగా విశ్వసించాలని ఎంచుకున్నాము. ప్రభువా, మా గతాన్ని ఎదుర్కొన్నప్పుడు, నీవు మాకు ముందుగా వెళ్తున్నావని మాకు గుర్తు చేయుము. ప్రభువా, నీవు యాకోబుకు సహాయం చేసినట్లుగానే, మాకు కూడా సహాయం చేస్తావని మేము నమ్ముచున్నాము. యేసయ్యా, మా హృదయాన్ని నీ శాంతితో నింపి, మా హృదయములో నుండి ప్రతి భయాన్ని తొలగించుము. దేవా, నీ సన్నిధి మమ్మును ఒక బలమైన కేడెము వలె చుట్టుముట్టునట్లుగా చేయుము. ప్రభువా, ఒక్క క్షణం కూడా మమ్మును ఒంటరిగా విడువకుండా, మమ్మును నీ రెక్కల క్రింద భద్రపరచుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.