నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 66:13వ వచనమును మనము ధ్యానించుకొనబోవుచున్నాము. ఆ వచనములో ప్రభువు ఈలాగున సెలవిచ్చుచున్నాడు, "ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మనలను ఆదరించు దేవుడు. సాధారణంగా, ఒక తండ్రి కుటుంబానికి ప్రేమగల యజమానుడిగా కనిపిస్తాడు. అయితే, అదే సమయములో, తల్లి ఒక ప్రాధమిక పోషణకర్తగా ఉంటుంది. తద్వారా, పిల్లలు తమ తండ్రి నుండి బలమును గురించి, తల్లి నుండి సౌమ్యతను గురించి నేర్చుకుంటారు. అందుకే దేవుడు ప్రేమతో తనను తాను తల్లితో పోల్చుకున్నాడు.

ఒకసారి, ఒక విమానం టేకాఫ్ అయిన (పైకి బయలుదేరిన) కొంత సమయములోనే ఆ విమానం ప్రమాదమునకు గురైనదన్న ఒక విషాద వార్తా నివేదిక వెలువడినది. ఆ ప్రమాదంలో 155 మంది మరణించారని తెలియవచ్చినది. అద్భుతరీతిగా, ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి నాలుగేళ్ల ఒక బాలిక మాత్రమే. ఈ ప్రమాదంలో మిగిలిన వారందరూ చనిపోయినప్పుడు, ఇంత చిన్న బిడ్డ ఎలా బ్రతకగలదని మీరు ఆశ్చర్యపోవచ్చును. నిజంగా, ఏమి జరిగిందో మీకు తెలుసా? ఆకాశము నుండి విమానం కూలిపోతుండగా, ఆ చిన్నారి తల్లి తన సీటు బెల్టును విప్పి, తన కూతురి ముందు మోకరిల్లి, ఆమె తన చేతులు చాచి మరియు తన దేహములోనికి ఆమె తీసుకొని గట్టిగా కౌగలించుకొనెను. ఆమె తన బిడ్డను ప్రమాదము నుండి కాపాడుతూ, ఆ బిడ్డను విడిచి వెళ్లడానికి నిరాకరించినది. తన చిన్నారిని ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు తల్లి తన శరీరాన్ని ఆశ్రయముగా ఉపయోగించుకొనెను. కనుకనే, ఆ బిడ్డ మరణము నుండి కాపాడబడినది. ఇది ఎంత గొప్ప ఆశ్చర్యము కదా.
  
అదేవిధంగా, యేసు కూడా తన్ను తాను తగ్గించుకుని, మానవ రూపాన్ని ధరించడం ద్వారా తన సీట్ బెల్ట్‌ను విప్పాడు అని మీకు తెలుసా? ఆయన సిలువపై శ్రమలు అనుభవించి తన శరీరాన్ని అప్పగించడం ద్వారా ఆయన మనలను నిత్య మరణం నుండి రక్షింపబడుటకు మనకు ఆశ్రయమును కల్పించాడు. యేసు మనలను తల్లికన్న మిన్నగా సౌమ్యతతో ఆదరించే ప్రేమగల దేవుడు. కనుకనే, ఫిలిప్పీయులకు 2వ అధ్యాయములో బయలుపరచబడినట్లుగానే, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను. కనుకనే, నేడు యేసులో మనం అత్యంత ప్రోత్సాహాన్ని, లోతైన ఆదరణను మరియు ప్రేమ గల సాటిలేని ఓదార్పును కనుగొనగలము. ఈ లోకములో మరెవరూ అనుగ్రహించలేని ఈ దైవీకమైన గొప్ప ఆదరణ మన అంతరంగంలోనికి ప్రవేశిస్తుంది. ఇంకను మన చుట్టూ ఉన్న ప్రజలు, ఎంత శ్రద్ధ చూపించినా, యేసు చూపుచున్న గొప్ప ఆదరణతో సరిపోల్చలేము. ఈ లోకములో మానవాళి ప్రేమ విలువైనదే అయినప్పటికిని, ఆయన దైవీకమైన కనికరము గల లోతైన ప్రేమకు సాటి కాదు.

నా ప్రియులారా, మన జీవితములో దుఃఖం మరియు ఆపత్కాల సమయాలలో మనం యేసు యొద్దకు పరుగెత్తుకొని వెళ్లి, మన తల్లిని కౌగిలించుకున్నట్లుగానే, ఆయనను కౌగలించుకొని, ఆయన మృదువైన ఆదరణను అనుభవించవచ్చును. మన శోధనల సయముములో, ఆయన ప్రత్యేకమైన మరియు శక్తివంతమైన మార్గాలలో మనలను ఆదరిస్తానన్న తన వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. కొన్నిసార్లు ఆయన మనలను తన ఆత్మతో నింపుతాడు; మరికొన్నిసార్లు, ఆయన తన శక్తితో మనలను కాపాడుతాడు. తన దైవీకమైన ఆదరణ ద్వారా, ఆయన మన కొరకే ఉన్నాడని తెలుసుకోవడం ద్వారా ఆయన మనలను దుఃఖం నుండి పైకి లేవనెత్తి, మన హృదయాలను ఆనందంతో నింపుతాడు. ఈ దైవీకమైన కృప ద్వారానే మనం నిజంగా యేసు హృదయాన్ని నేర్చుకుంటాము. అందుకే ప్రభువు ప్రేమతో, 'ఒక తల్లివలె నేను మిమ్మును ఆదరిస్తాను' అని సెలవిచ్చుచున్నాడు. కొన్నిసార్లు, ఒక తల్లి తన బిడ్డను మరచిపోవచ్చును. కానీ, యేసు మనలను ఎన్నటికిని మరవడు, విడువడు మరియు ఎడబాయడు. మన భూసంబంధమైన తల్లులు కూడా అన్ని సమయాలలో మనతో ఉండలేరు. కానీ, మన పరలోకమందున్న ఆదరణకర్త అయిన యేసు, జీవితంలోని ప్రతి సమయములోను మనతో కూడా ఉంటాడు. అన్ని విధాలుగా మనకు ఆదరణను అనుగ్రహించే దేవుడు తన మృదువైన ప్రేమతో మిమ్మును కౌగలించుకొని, ఒక తల్లివలె ఆదరించును గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
సమస్త ఆదరణకు కర్తవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రియమైన ప్రభువా, మా జీవితంలో నీ సున్నితమైన ప్రేమ మరియు శాశ్వతమైన సన్నిధిని మాతో నిత్యము ఉంచుమని కోరుచున్నాము. దేవా, ఒక తల్లి తన బిడ్డను ఆదరించునట్లుగా, నీవు మమ్మును నీ మృదువైన కౌగలిలో భద్రపరచుకొనుము. యేసయ్య, సిలువపై నీవు చేసిన త్యాగం ద్వారా మమ్మును నిత్య మరణం నుండి కాపాడినందుకై నీకు వందనాలు. దేవా, మా దుఃఖం మరియు శోధన కాలములలో కూడా నీవు మాత్రమే మమ్మును హృదయాంతరము నుండి ఆదరించగలవని గుర్తించి మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చియున్నాము. దేవా, నీ ఆదరణ ద్వారా మా ప్రమాదముల నుండి కాపాడి, మా హృదయాన్ని నీ ఆత్మతో నింపుము, నీ శాంతితో మమ్మును ఆవరించుము మరియు మా మనస్సులలో ఉన్న ప్రతి భారాన్ని తొలగించుము. దేవా, మానవుల ప్రేమ విఫలమైనప్పుడు కూడా నీ శాశ్వతమైన ప్రేమను నమ్మడానికి మాకు నేర్పించుము. ప్రభువా, నీ కనికరము మా హృదయానికి ఆనందం మరియు నిరీక్షణను తీసుకొని వచ్చునట్లుగా చేయుము. దేవా, మా జీవితంలోని అన్ని వేళలలో మా ప్రక్కన నడుస్తూ, మా పక్షాన ఉన్నావని మేము ఎల్లప్పుడు గుర్తుంచుకొనునట్లుగా మాకు కృపను చూపుము. ప్రభువా, మమ్మును ఎన్నడు కూడా విడువకుండా, ఎడబాయకుండా, నీ కౌగిలిలో భద్రముగా కాచి కాపాడమని వేడుకొనుచున్నాము. దేవా, నీ ప్రేమ మమ్మును నిత్యము ఆదరిస్తుందని గుర్తెరిగి మేము నీ చేతులలో విశ్రాంతి తీసుకొనుటకు మాకు అటువంటి కృపను చూపుమని యేసుక్రీస్తు ఆదరించు ప్రేమగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.